Abn logo
May 13 2021 @ 06:04AM

నిర్బంధంలో నిరపరాధి

ఏ ఆధారాలు లేకుండా, మూడేళ్లుగా అక్రమ వేధింపులకు, నిర్బంధానికి గురవుతున్న 16 మంది అమాయకులపై మోపిన కేసే భీమాకోరేగావ్‌–ఎల్గార్‌ పరిషత్ కేసు. ఇది ప్రధానమంత్రిని చంపడానికి కుట్ర పన్నుతున్నారనే ఆరోపణతో మొదలైంది. ఇప్పుడది సంతకాలు లేని, ఏ రకమైన విచారణకు నిలవని ఉత్తర ప్రత్యుత్తరాల్నే నేరంగా చూపే దాకా వచ్చింది. కొందరు నిందితుల వ్యక్తిగత కంప్యూటర్లలో హాకర్ల ద్వారా ‘ప్రవేశపెట్టబడ్డ’ ఈ ఉత్తరాల మీద ఆధారపడి అర్థం లేని ఆరోపణలతో ఈ రాజ్యం న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నది.


భీమాకోరేగావ్‌ కేసులో 12వ వ్యక్తిగా అరెస్టయిన ఎం.టి. హనిబాబు ఢిల్లీ విశ్వ విద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌. భాషాశాస్త్రంలో విద్యావేత్త. హైదరాబాద్‌లోని ఇఫ్లూ నుంచి ఒక పిహెచ్‌డి, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాన్‌స్టాంజ్‌ నుంచి మరొక పిహెచ్‌డి పొందారు. చిత్తశుద్ధిగల అధ్యాపకుడు, తనను తాను అంబేడ్కర్‌వాదిగా చెప్పుకునే సామాజిక కార్యకర్త. సామాజిక న్యాయం కోసం జరుగుతున్న కుల వ్యతిరేక పోరాటాలకు తన జీవితాన్ని, జ్ఞానాన్ని వినియోగిస్తున్న వ్యక్తి. అందుకే విద్యార్థులే కాక ఎంతోమంది మేధావులు ఆయనను ఒక ప్రజాస్వామిక మేధావిగా, స్నేహశీలిగా, అందరికీ సాయపడే వ్యక్తిగా గౌరవిస్తారు, అభిమానిస్తారు.


అందుకే ఇంత అన్యాయమైన భీమా కోరేగావ్‌ కేసులో హనిబాబుని నిందితుడిగా ఇరికించడం ఎంతో ఆందోళన కలిగిస్తున్నది. ఎన్‌ఐఎ (జాతీయ దర్యాప్తు సంస్థ) హనిబాబుని ముంబైకి రప్పించి అయిదు రోజుల పాటు అర్థం లేని విచారణ జరిపింది. 2020 జూలై 8న అక్రమంగా అరెస్టు చేసింది. ఈ అరెస్టుకు ముందు ఆయన ఇంటిపై దాడి జరిపి సోదా చేశారు. (2019 సెప్టెంబర్‌లో ఒకసారి, 2020 ఆగస్టులో మరొకసారి.) పుస్తకాలు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా, నియమ నిబంధనలకు విరుద్ధంగా గంటల తరబడి సోదాలు జరిపి భయభ్రాంతులను చేసి వేధించారు. ఊపా లాంటి అన్యాయమైన చట్టం పేరుతో సాక్ష్యాధారాల సేకరణలో పాటించే శాస్త్రీయ పద్ధతుల్ని, నిబంధనల్ని పూర్తిగా ఉపేక్షించారు. స్వాధీనపర్చుకున్న ఎలక్ట్రానిక్‌ పరికరాల పూర్తి వివరాలు కాని, హాష్‌ వాల్యూ కాని ఇవ్వలేదు. దీనివల్ల ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాలను తారుమారు చేసి, తప్పుడు ఆధారాలుగా మార్చే వీలుంది. మొత్తంగా ఈ చట్టవిరుద్ధ సోదా, సాక్ష్యాధారాల సేకరణ, ముంబై పిలిచి విచారించడం, కరోనా ఉధృతి పెరుగుతున్న సమయంలో అరెస్టు చేయడం లాంటి చర్యలన్నీ అన్యాయం, అక్రమం, చట్టవిరుద్ధం. 


మేము (హనిబాబు కుటుంబసభ్యులం) మా బాధను, దుఃఖాన్ని పంచుకోవడానికి, మా ఆవేదనను చెప్పుకోవడానికి ఈ విజ్ఞాపన చేస్తున్నాం. సరిగ్గా ఇప్పుడే ముంబై హైకోర్టు జైళ్ళలోని ఖైదీలకు కరోనా సోకిన వార్తలపై స్పందించి, సుమోటోగా ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు చేపట్టడం గమనార్హం. అంబేడ్కర్‌ బాటలో నడిచి కులవ్యతిరేక పోరాటం, సామాజిక న్యాయం కోసం జరిగిన నిరసనల్లో పాల్గొనడం మాత్రమే హనిబాబు చేసిన ‘నేరం’ అని మేం నిస్సందేహంగా నమ్ముతున్నాం. బిసి రిజర్వేషన్ల అమలుకు, ఎస్సీ, ఎస్టీలపై వివక్షకు వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్సిటీలో పోరాడిన అతి కొద్దిమందిలో హనిబాబు ఒకడు. జిఎన్‌ సాయిబాబా డిఫెన్స్‌, విడుదల కమిటీలో చురుగ్గా పాల్గొన్నాడు. సాయిబాబా ఒక తోటి విద్యార్థిగా, ఆ తరువాత సహ అధ్యాపకుడిగా హనిబాబుకి పరిచయం. 


ఈ రోజుకీ హనిబాబుని నేరస్థుడిగా నిరూపించే కచ్చితమైన ఆధారాలను ఎన్‌ఐఎ చూపించలేకపోయింది. దానర్థం నిరపరాధి హనిబాబుకు పౌరహక్కులు, నిష్పాక్షిక విచారణ నిరాకరించబడుతున్నాయి. ముఖ్యంగా ఆయన దగ్గర స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ పరికరాల క్లోన్‌ కాపీలు ఆయనకు ఇవ్వాలనే అభ్యర్థనను ఇప్పటికీ వాయిదా వేస్తున్నారు. తనను తాను నిర్దోషిగా నిరూపించుకునే వీలు లేకుండా చేస్తున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన డిజిటల్‌ ఫోరెన్సిక్‌ కంపెనీ ఆర్సనల్‌ కన్సల్టింగ్‌ రోనావిల్సన్‌ (భీమాకోరేగావ్‌ కేసులో ఒక నిందితుడు)కు చెందిన క్లోన్‌ కాపీలను పరిశీలించి అతడి కంప్యూటర్‌ను హ్యాక్‌ చేసి, హానికరమైన సాఫ్ట్‌వేర్‌ ద్వారా కొన్ని ఫైళ్లను ప్రవేశపెట్టారని, వాటిని రోనావిల్సన్‌ తెరవలేదని తన పరిశోధనలో తేల్చింది. రోనావిల్సన్‌ కంప్యూటర్‌ నుంచి అతడి ‘స్నేహితుల’ (సహ నిందితులు) లాప్‌టాప్‌లోకి పంపించిన మావోయిస్టు ఉత్తర ప్రత్యుత్తరాలు భీమాకోరేగావ్‌ కేసు మొత్తానికి సాక్ష్యాధారాలని ఎన్‌ఐఎ చూపడం నేడు ప్రశ్నార్థకమయింది. ‘మావోయిస్టు ఉత్తరాలు’ హాకర్స్‌ ద్వారా ప్రవేశపెట్టినవని స్పష్టంగా తేలింది.


బహుశా నేడు కరోనా విపత్తుకు గురికాని వ్యక్తి కానీ, ఇల్లు కానీ, సంస్థ కానీ (కోర్టులతో సహా) ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో హనిబాబు లాంటి రాజకీయ ఖైదీలు, వారి కుటుంబాలు అనుభవిస్తున్న బాధ మాటలకందనిది. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక హక్కులను నమ్మి, వాటిని చాటినందుకే నిరంతరం వాళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. హనిబాబు ఇప్పటికీ తన లేఖల్లో న్యాయవ్యవస్థ తన జీవితాన్ని, హక్కులను తిరిగి ఇస్తుందనే ప్రగాఢమైన నమ్మకాన్ని, ఆశని వ్యక్తపరుస్తున్నాడు. న్యాయవిచారణ మరింత ఆలస్యమయితే హనిబాబు వ్యక్తిగత, అకడమిక్‌ మేధోపరమైన జీవితం మరింతగా దెబ్బ తింటుంది. ఉపా చట్టం కింద అరెస్టయిన ఖైదీలకు కూడా సత్వర విచారణ ప్రాథమిక హక్కు అని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి కేసు దర్యాప్తు పేరుతో జుడీషియల్‌ కస్టడీ కాలమే శిక్షాకాలం కాకూడదు.


హనిబాబు కుటుంబసభ్యులుగా మా విజ్ఞప్తి: క్లోన్‌ కాపీలతో సహా అన్ని రకాల సాక్ష్యాధారాలను నిందితులకు, డిఫెన్స్‌ న్యాయవాదులకు అందించాలి. సత్వర న్యాయ విచారణ (ట్రయల్‌) ప్రారంభించాలి; నిందితులందర్నీ వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలి. అలా చేయకపోతే న్యాయవ్యవస్థ కూడా ఈ అన్యాయమైన ప్రక్రియలో భాగమైందనే ఆరోపణను ఎదుర్కోవలసి వస్తుంది.

జెన్నీ (భార్య), ఫర్జానా (కూతురు), ఫాతిమా (తల్లి), హరీష్‌, అన్సారీ (సోదరులు)

Advertisement