ఏయూ వీసీపై విచారణ

ABN , First Publish Date - 2021-03-02T09:21:11+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పలు ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, వాటిపై విచారించి తగిన చర్యలు

ఏయూ వీసీపై విచారణ

విశాఖపట్నం/అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పలు ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, వాటిపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆంధ్రా వర్సిటీ వీసీ ప్రసాద్‌రెడ్డి ‘రెడ్డి సామాజిక వర్గం’ సమావేశంలో పాల్గొన్నారని, అధికార పార్టీ ప్రతినిధులతో సన్నిహితంగా ఉన్నారని పత్రికల్లో వచ్చిన వార్తలు చూశానన్నారు. ఇది తీవ్రమైన ఆరోపణ అని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని ప్రకటించారు. అవన్నీ నిజమని తేలితే.. తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. అలాగే జీవీఎంసీ పరిధిలో బార్ల యజమానులను కొందరు బెదిరించారని, ఫలానా మద్యం కొని ఇవ్వాలని టార్గెట్లు పెట్టారని ఆరోపణలు వచ్చాయన్నారు. వీటిపై బార్ల యజమానులలో ఏ ఒక్కరు ఫిర్యాదు ఇచ్చినా, విచారణ చేసి కఠిన చర్యలు చేపడతామని స్పష్టంచేశారు.  


నేటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ

ఈ నెల 10న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నుంచి రెండు రోజులపాటు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 నగరపాలక సంస్థలోని 671 డివిజన్లతోపాటు,  75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 20123 వార్డులకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-03-02T09:21:11+05:30 IST