ప్రభుత్వ భూమికి రిజిస్ర్టేషన్లపై విచారణ

ABN , First Publish Date - 2021-10-27T07:06:29+05:30 IST

మదనపల్లె మండలం బసినికొండ సర్వే నెం.235లోని 5.55 ఎకరాల ప్రభుత్వ భూమిని రిజిస్ర్టేషను చేసిన వ్యవహారంపై రెవెన్యూ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు.

ప్రభుత్వ భూమికి రిజిస్ర్టేషన్లపై విచారణ
విచారణ చేస్తున్న రెవెన్యూ అధికారులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


మదనపల్లె, అక్టోబరు 26: మదనపల్లె మండలం బసినికొండ సర్వే నెం.235లోని 5.55 ఎకరాల ప్రభుత్వ భూమిని రిజిస్ర్టేషను చేసిన వ్యవహారంపై రెవెన్యూ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. బైపా్‌సరోడ్డును ఆనుకుని ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్‌ చేయడం...  ఆ తర్వాత విక్రయాలు చేపట్టి పరాధీనం చేయడంపై మంగళవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘ప్రభుత్వ భూమికి రిజిస్ర్టేషన్లు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన సబ్‌కలెక్టర్‌ జాహ్నవి విచారణకు ఆదేశించారు. ఈక్రమంలో తహసీల్దార్‌ సి.కె.శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఆర్‌ఐ రెడ్డెప్ప, సర్వేయర్‌ కృష్ణమూర్తి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.భూమి హక్కుదారులుగా చెబుతున్న కొండామరిపల్లెకు చెందిన రామాపురం వెంకటమ్మను, చీకలిగుట్ట బాలాజీనగర్‌కు చెందిన తండ్రీకొడుకులు కొమ్ము పెద్దరెడ్డెప్ప,చిన్నరెడ్డెప్పలను రికార్డులతో హాజరు కావాలని సూచించారు. అయితే వెంకటమ్మ మాత్రమే విచారణకు హాజరయ్యారు. 1981లో తన భర్త నరసింహులు పేరున డీకేటీ పట్టా మంజూరు చేశారని, ఆయన మరణించడంతో తన పేరున మ్యూటేషన్‌ చేశారని వివరించారు. ఆమె వద్ద ఉన్న రికార్డుల ప్రకారం సర్వే నెం.235-3లో 2.05ఎకరాలు సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. అలాగే  235-2లో 3.50 ఎకరాలు ఎవరికీ కేటాయించలేదని, పట్టా కూడా ఇవ్వలేదని తెలిపారు. అదంతా గుట్ట పొరంబోకుగా గుర్తించారు. ఈ రెండింటికీ సంబంధించి వెంకటమ్మ నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు నమోదు చేశారు. సర్వే నెం.235లోని మొత్తం 6.15 ఎకరాలు ప్రభుత్వ భూమేనని ఆర్‌ఐ రెడ్డెప్ప, సర్వేయర్‌ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఒకవేళ వెంకటమ్మ భర్త పేరుతో అసైన్‌మెంట్‌ పట్టా జారీ చేసి ఉంటే, రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్‌లో భాగంగా డి.పట్టాగా నమోదు చేయాల్సి ఉంది.కానీ అనువంశీకం పేరుతో వన్‌బీ నమోదు కావడంతో రిజిస్ర్టేషన్లు చేశారు. అలాగే కొమ్ము చిన్నరెడ్డెప్ప పేరుతో ఇచ్చినట్లు చెబుతున్న వన్‌బీలోనూ అనువంశీకంగా నమోదు చేయడంతో విక్రయాలు జరిగి,రిజిస్ర్టేషన్లు చేపట్టారు. అసలు విష యం వెలుగులోకి రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మరోవైపు వెంకటమ్మ పేరున మ్యూటేషన్‌ చేయడం, ప్రభుత్వ భూమి రిజిస్ర్టేషన్లు కావడంలో ఆర్‌ఐ రెడ్డెప్ప కీలకపాత్ర పోషించినట్లు రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఆయన్నే, క్షేత్రస్థాయి విచారణకు పంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద రెవెన్యూ అధికారుల ప్రమేయంతోనే రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందనే చెప్పాలి. విక్రయాలు చేపట్టిన, రికార్డులు తారుమారు చేసిన, నకిలీ రికార్డులు సృష్టించిన కబ్జాదారులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం పై స్థానికంగా చర్చ సాగుతోంది.

Updated Date - 2021-10-27T07:06:29+05:30 IST