‘రణవీర్‌’లో ప్రమాదంపై విచారణ

ABN , First Publish Date - 2022-01-20T08:23:07+05:30 IST

‘రణవీర్‌’లో ప్రమాదంపై విచారణ

‘రణవీర్‌’లో ప్రమాదంపై విచారణ

మృతి చెందిన ముగ్గురు సెయిలర్లూ 

విశాఖలోని నేవల్‌ క్వార్టర్స్‌ నివాసితులు


విశాఖపట్నం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): మిస్సైల్‌ డిస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌లో మంగళవారం సంభవించిన ప్రమాదంలో మరణించిన ముగ్గురు సెయిలర్లూ విశాఖపట్నంలోనే నివాసం ఉంటున్నారు. ఈ యుద్ధ నౌక విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో పనిచేస్తోంది. మూడు నెలల క్రాస్‌ కోస్ట్‌ విధుల్లో భాగంగా ముంబై వెళ్లింది. అక్కడ డాక్‌యార్డులో యాంకరేజిలో వున్న సమయంలో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. మృతులు ముగ్గురు సెయిలర్లు. విశాఖపట్నంలోని నేవల్‌ క్వార్టర్స్‌లో కుటుంబాలతో ఉంటున్నారు. వారిలో ఒకరు కృష్ణకుమార్‌ (ఎంసీపీఓ 1), మరొకరు సురిందర్‌కుమార్‌ (ఎంసీపీఓ 2), ఇంకొకరు ఏకే సింగ్‌ (ఎంసీపీఓ 3)గా అధికారులు గుర్తించారు. సెయిలర్లలో అత్యంత అనుభవం కలిగిన సీనియర్లను మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ (ఎంసీపీఓ)గా నియమిస్తారు. ఈ ముగ్గురూ ఆ ఎంసీపీఓహోదా కలిగిన సెయిలర్లు కావడం విశేషం. వీరు ముగ్గురూ నౌకలోని ఒకే కేబిన్‌లో ఉండగా దానికి ఎదురుగా వున్న కంపార్టుమెంట్‌లోని ఏసీ పేలింది. దాంతో వారు తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ సందర్భంగా వెలువడిన మంటలు, వాయువుల నుంచి తప్పించుకునేందుకు పలువురు అటుఇటు పరుగులు తీశారు. అలా 11 మంది గాయపడగా నేవీ ఆస్పత్రి అశ్వినికి తరలించారు. మరణించిన ముగ్గురి కుటుంబాలకు అండగా ఉంటామని, వారి మృతికి చింతిస్తున్నామని చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.


35 ఏళ్లుగా సేవలు

ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ డి54 రష్యాలో తయారైన నౌక. ఇది 1986లో తూర్పు నౌకాదళంలో చేరింది. గత 35 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది పాత నౌక. అయినప్పటికీ ఎప్పటికప్పుడు నిర్వహణ, రీఫిట్‌ పనులు చేయిస్తూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 



Updated Date - 2022-01-20T08:23:07+05:30 IST