మూడు సింహాలు.. మూడు కోణాలు

ABN , First Publish Date - 2020-09-22T17:19:32+05:30 IST

ఇంద్రకీలాద్రిపై ఉత్సవమూర్తుల ఊరేగింపు రథంపై ఉన్న మూడు వెండి సింహాల మాయంపై మూడు దర్యాప్తు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులకు కొన్ని చిక్కుముడులు వీడడం లేదు. ఒక్క అంశంలో మాత్రం ఈ బృందాలు ఒక నిర్ధారణకు వచ్చాయి. రథాన్ని మహామండపం

మూడు సింహాలు.. మూడు కోణాలు

మహామండపం వద్దే ప్రతిమలు మాయం!

గర్భాలయం వరకే ఎస్పీఎఫ్‌ భద్రత

30 మందిని విచారించిన దర్యాప్తు బృందాలు

ఇంటి దొంగలా? బయట వాళ్లా?

పెదవి విప్పని అధికారుల తీరుపై అసహనం


విజయవాడ (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై ఉత్సవమూర్తుల ఊరేగింపు రథంపై ఉన్న మూడు వెండి సింహాల మాయంపై మూడు దర్యాప్తు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులకు కొన్ని చిక్కుముడులు వీడడం లేదు. ఒక్క అంశంలో మాత్రం ఈ బృందాలు ఒక నిర్ధారణకు వచ్చాయి. రథాన్ని మహామండపం సమీపంలోని ప్రొటోకాల్‌ ఆఫీసు వద్దకు చేర్చిన తరువాతే ఈ మూడు సింహాలు మాయమయ్యాయని తేల్చారు. ఈ ఘటనలో పాత్రధారులు, వెనుక ఉండి కథను నడిపించిన సూత్రధారులు ఎవరన్నది తేలడానికి ఆధారాలు లభించడం లేదు. పోలీసులు దఫదఫాలుగా ఆలయానికి చెందిన అధికారులను, సిబ్బందిని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 30 మందిని వివిధ కోణాల్లో విచారించారు. ఇందులో స్తపతి మాత్రమే తాను మూడు సింహాలను చూశానని చెప్పారు. మిగిలిన వారు ఎలాంటి సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. వన్‌టౌన్‌ పోలీసులతోపాటు సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. ఈ విషయంలో ఈ బృందాలు ఎలాంటి నిర్ధారణకు రాకపోయినప్పటికీ సింహాల మాయం వెనుక ఇంటి దొంగలున్నారా? లేక బయటవారు ఎవరైనా ఉన్నారా? అనే దిశగా దర్యాప్తును సాగిస్తున్నారు. ముఖ్యంగా దేవస్థానం అధికారులు అడిగిన సమాచారం ఇవ్వడం లేదన్న అసహనం దర్యాప్తు బృందాల్లో కనిపిస్తోంది. 


లాక్‌డౌన్‌ సమయంలో దేవాలయంలో జరుగుతున్న నిర్మాణ పనులను బిహార్‌కు చెందిన కార్మికులు చేశారు. వాళ్లంతా కలిపి 15 మంది వరకు ఉన్నారని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇందులో ఒక బ్యాచ్‌ జూలై 15వ తేదీన వెళ్లిపోయింది. మరో బ్యాచ్‌ అదే నెలలో 25వ తేదీన, మూడో బ్యాచ్‌ ఆగస్టు 31న సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఈ కార్మికులకు సంబంధించిన వివరాలేమీ ఆలయ అధికారుల వద్ద లేవని తెలుస్తోంది. శివాలయం పనులను దాతలు చేయిస్తున్నందున వారే ఈ కార్మికులను తీసుకొచ్చారని సమాచారం. లాక్‌డౌన్‌లో పనులు జరిగినన్ని రోజులూ ఆ కార్మికులు మహామండపంలోనే ఉన్నారు. వారికి ఇక్కడే భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. కార్మికులు బిహార్‌లోని ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఇప్పటి వరకు దర్యాప్తు బృందాలకు వివరాలు అందలేదు. ఒకవేళ దర్యాప్తులో భాగంగా వాళ్లను విచారించాలనుకుంటే ఆ రాష్ట్రానికే వెళ్లాల్సి ఉంటుంది. కాగా ఆలయంలో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌) భద్రత అంశం కూడా ముందుకొచ్చింది. అయితే ఈ సిబ్బంది గర్భాలయం వరకు మాత్రమే భద్రత బాధ్యతలు చూస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అమ్మవారి అలంకరణల రీత్యా విలువైన ఆభరణాలు ఉంటాయి కాబట్టి గర్భాలయం వరకే ఎస్పీఎఫ్‌ భద్రత కావాలని ఆలయ అధికారులు నాడు అడిగారని పోలీసులు చెబుతున్నారు. 


దీన్ని బట్టి చూస్తే రథం భద్రతను ఆలయ అధికారులే చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి వెండి సింహాలు ఉన్నందున ప్రత్యేకంగా సెక్యూరిటీని నియమించుకోవాలి. సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించినందున ఒక గార్డును ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని తెలుస్తోంది. కాగా దర్యాప్తులో భాగంగా లోగడ దేవాలయాల్లో చోరీలకు దిగిన నిందితుల జాబితాను కూడా పోలీసులు వడబోస్తున్నారు. 

Updated Date - 2020-09-22T17:19:32+05:30 IST