క్రిమి

ABN , First Publish Date - 2020-05-25T09:56:28+05:30 IST

నాలో ఏదో సంచరిస్తోంది ఉదయాస్తమయాల్ని చక్రాలేసుకు తిరిగే కాళ్ళకి భయం ఇనుప గొలుసుల్ని మెలిచుడుతోంది పుట్ట కట్టిన ఒంటరితనంలో విషప్పాములా ఏదో కదులుతోంది...

క్రిమి

నాలో ఏదో సంచరిస్తోంది 

ఉదయాస్తమయాల్ని చక్రాలేసుకు తిరిగే కాళ్ళకి 

భయం ఇనుప గొలుసుల్ని మెలిచుడుతోంది 

పుట్ట కట్టిన ఒంటరితనంలో విషప్పాములా ఏదో కదులుతోంది 


ఆకలిదప్పులకైనా నడక ఆపలేని శాపగ్రస్త చీమల కడుపులోకి 

ఖాళీతనాన్ని అన్నం ముద్ద చేసి పెట్టి 

మందలోంచి తప్పిపోయిన గొర్రెపిల్లల మీద లాఠీ దెబ్బలు కొడుతోంది 

నన్నేదో నమ్మబలుకుతోంది; 

కొమ్మలమీద కనకాంబరాలను గుత్తులుగా పూయొద్దని చెప్పి 

గాయపడ్డ ఆకాశాన్ని ఓదార్చే పావురాళ్ళ గుంపును 

      ఇరుకు జైళ్ళలోకి తరుముతోంది 


సగం విరిచేసిన పింఛనుదారు చేతి కర్రలా, 

నెలవారీ జీతగాడి ముఖమ్మీద కత్తి గాటులా 

నా చుట్టూ ఆంక్షల ముళ్ళ పొద మొలుస్తోంది

దీపాల బారు వెలుగు కింద చీకటిలో పురుగేదో దాక్కుని ఉంది 

చప్పట్ల శబ్దంలో చిరుద్యోగి గుండె ఓటికుండలా పగిలి 

నన్నిక్కడేదో చేతగానివాణ్ణి చేస్తోంది; 


నాకిదేమీ తొలి యుద్ధమూ కాదు, 

ఊడ్చకుండా వదిలేస్తున్న ఆఖరి దుక్కిచేనూ కాదు 

నన్నదిమిపెట్టాలనుకుంటున్న గుప్పిట్లో పిల్లిలా పడుకోలేను 

ఈ అస్పృశ్యత శిక్షలా ఉంది; నేనెవ్వర్నీ పిరికిగా ముద్దు పెట్టుకోలేను; 

నన్నేదో అజమాయిషీ చేస్తోంది; అదను చూసి కత్తి దూస్తోంది 


ప్రేమ; చెట్టుమీదే కాసి పండిపోతున్నట్టుంది బ్రతుకు 

ఈ కట్టుదిట్టం ఉత్త మాయలా ఉంది; లోపలేదో శత్రు వ్యూహం విస్తరిస్తోంది 

దేశాన్ని కలుగులో ఎలుకను చేసి; తాళం వేసి 

నిర్మానుష్యమైన వీధుల్లో అరూపంగా ఏదో సంచరిస్తోంది 

శ్రీరామ్‌

99634 82597


Updated Date - 2020-05-25T09:56:28+05:30 IST