సాగర్‌ పోరుకు జానారెడ్డి కొత్త వ్యూహం.. టీఆర్‌ఎస్‌, బీజేపీ అన్వేషణ!?

ABN , First Publish Date - 2021-01-12T17:51:59+05:30 IST

సాగర్‌ పోరుకు జానారెడ్డి కొత్త వ్యూహం.. టీఆర్‌ఎస్‌, బీజేపీ అన్వేషణ!?

సాగర్‌ పోరుకు జానారెడ్డి కొత్త వ్యూహం.. టీఆర్‌ఎస్‌, బీజేపీ అన్వేషణ!?

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో తేలిపోయారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఇంకా గెలుపు గుర్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఎవరిని బరిలోకి దింపాలా అని మేధోమథనం చేస్తున్నాయి. జానారెడ్డిని ఢీకొట్టేందుకు బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రధానంగా సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకునేందుకు టీఆర్‌ఎస్‌ ఎత్తుగడ ఎలా ఉండబోతోంది? వాచ్‌ దిస్‌ ఇంట్రెస్టింగ్‌ ఏబీఎన్‌ ఇన్‌సైడ్‌ కథనం.  


దూకుడు పెంచిన కాంగ్రెస్!

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికను కాంగ్రెస్‌ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పాలనుకుంటుంది. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి బరిలో ఉంటారని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఉపఎన్నిక షెడ్యూల్‌ రాకుండానే సాగర్‌లో అభ్యర్థిని ఖరారు చేసుకుని దూకుడు పెంచింది హస్తం పార్టీ. దాంతో జానారెడ్డి క్యాంపెయిన్‌ స్పీడ్‌ పెంచారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ వంతు ఎప్పుడన్నది ఉత్కంఠ రేపుతోంది.


సత్తా ఏంటో చూపించాలని..!

ఈ స్థానం నుంచి ఏడుసార్లు విక్టరీ సాధించిన కుందూరు జానారెడ్డి 8వ సారి గెలిచి తన సత్తా ఏంటో ప్రత్యర్థి పార్టీలకు చూపించాలనుకుంటున్నారు. తనకు మద్ధతు కూడగట్టేందుకు ఇటీవల నియోజకవర్గంలోని చెల్మగూడెం,తిరుమలగిరి, త్రిపురారం, నిడమనూరుతో పాటు పలు మండలాలు, గ్రామాల్లో జానారెడ్డి పర్యటించారు. చిన్న, పెద్ద కార్యక్రమాలు అనేవి చూడకుండా అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ పార్టీ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. ఎక్కడికక్కడ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. సాగర్‌ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు పీసీసీ ఎంపికను వాయిదా వేయాలన్న జానా సూచనతో అధిష్టానం ఆ ప్రక్రియను పెండింగ్‌లో పెట్టింది. సాగర్‌లో విజయం సాధించేందుకు ఆ పార్టీ ఏ స్థాయిలో సన్నద్ధమవుతుందో తెలుస్తోంది.


పెద్దలతో క్యాంపెయిన్..!

మరోవైపు తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక మార్చి 15 లోపు పూర్తి చేయాలని ఆ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికను కూడా అదే సమయంలో పూర్తి చేసేలా.. రెండింటికి ఒకేసారి నోటిఫికేషన్‌ ఇవ్వాలని సీఈసీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి తక్కువ సమయమే ఉంటుంది. అందుకే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలన్న వ్యూహంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకులను కూడా తీసుకొచ్చి క్యాంపెయిన్‌ చేయిస్తారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


టీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు..

ఇంకోవైపు సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అధికార టీఆర్‌ఎస్‌ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దుబ్బాక, GHMC ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న కారు పార్టీ..ఇక్కడ విజయం సాధించి బీజేపీ స్పీడ్‌కు బ్రేకులు వేయాలనుకుంటుంది. నోముల నర్సింహయ్య కుటుంబానికి టికెట్‌ ఇస్తుందా లేక వేరెవరినైనా బరిలో దించుతుందా అన్నది ఇంకా తేలలేదు. ఈ క్రమంలో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు టికెట్ ఇవ్వాలని యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎంసీ కోటిరెడ్డి, తెరా చిన్నపరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఓ విద్యార్థి నాయకుడి పేర్లు పరిశీలిస్తున్నట్టు టాక్‌ వినిపిస్తోంది. అయితే సాగర్‌ ఉప ఎన్నికపై ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్‌ అంతర్గత సమావేశంలో సీఎం కేసీఆర్‌..కాంగ్రెస్‌కు ఎడ్జ్‌ ఉందని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది బీజేపీని ఇరుకునపెట్టేందుకు టీఆర్‌ఎస్‌ ఆడుతున్న మైండ్‌ గేమ్‌లో భాగమా? నిజంగానే కాంగ్రెస్‌ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయట.


ఎవరికైనా గాలం వేస్తారా?

ఇక బీజేపీ ముందు నాగార్జునసాగర్‌లో అనేక సవాళ్లు ఉన్నాయి. ఒకవైపు అధికార పార్టీని.. మరోవైపు జానారెడ్డిని ఎదుర్కొంటూనే బలం చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఉపఎన్నికలో అభ్యర్థి ఎంపికే కమలం పార్టీకి కీలకం కానుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు ఆశావహులు ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటూ.. తామే బరిలో ఉంటున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఆశించి భంగపడేవారు ఎవరికైనా గాలం వేస్తారా? లేక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని యాదవ  సామాజికవర్గానికి చెందిన వారిని బరిలో దించుతారా అన్నది ఆసక్తిగా ఉంది. త్రిముఖపోటీలో ఓట్లు చీలతాయని.. ఆ మేరకు ఎన్నికల వ్యూహం రచించాలని ఆలోచిస్తున్నారట కమలనాథులు.  మరి.. జానారెడ్డిని ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఎలాంటి అస్త్రాలును సంధిస్తాయో? ఎవరిని బరిలో దించుతాయో చూడాలి.





Updated Date - 2021-01-12T17:51:59+05:30 IST