జైల్లో భూమా అఖిల.. మౌనిక అత్యవసర సమావేశం.. సయోధ్య కుదురుతుందా?

ABN , First Publish Date - 2021-01-13T18:06:48+05:30 IST

హఫీజ్ పేట్ భూ వివాదంలో భూమా అఖిలప్రియ జైలుకెళ్లడంతో

జైల్లో భూమా అఖిల.. మౌనిక అత్యవసర సమావేశం.. సయోధ్య కుదురుతుందా?

హఫీజ్ పేట్ భూ వివాదంలో భూమా అఖిలప్రియ జైలుకెళ్లడంతో ఆళ్లగడ్డ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోందా? ఆమె జైలులో ఉండటాన్ని అధికార పార్టీ అనుకూలంగా మలుచుకుంటుందా? భూమా వర్గీయులపై ఎలాంటి ఒత్తిళ్లు మొదలయ్యాయి...? అక్క బాధ్యతలు స్వీకరించిన మౌనిక రెడ్డి భూమా క్యాడర్‌ను కాపాడుకునేందుకు ఎలాంటి ప్లాన్ వేశారు. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహుతుడైన ఏవి సుబ్బారెడ్డిపై స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతోంది.. ఆసక్తికరమైన ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం. 


తెలుగునాట సంచలనం..

హైదరాబాద్‌ హఫీజ్ పేట్ భూ వివాదం చిచ్చు...కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కిడ్నాప్‌ ఆరోపణలతో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేయడం తెలుగునాట సంచలనం సృష్టించింది. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు మూడు నాలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు ఇప్పటికే కోర్టులో కౌంటరు దాఖలు చేశారు. ఆమె బెయిల్‌పై వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు అక్క అఖిలప్రియ బెయిల్‌ కోసం ఆమె చెల్లెలు మౌనికా రెడ్డి, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి హైదరాబాద్‌లో మకాం వేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.


అత్యవసరంగా ఆళ్లగడ్డకు మౌనిక..!

భూమా అఖిలప్రియ జైలుకు వెళ్లినప్పటి నుంచి భూమా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. ఇదే అదనుగా భావించిన ప్రత్యర్ధి వర్గం.. దివంగత భూమా నాగిరెడ్డి వర్గానికి చెందిన కార్యకర్తలపై ఫోకస్ పెట్టారు. పంచాయితీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అధికార పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. భూమా వర్గీయులను టార్గెట్‌గా చేసుకొని పావులు కదుపుతోంది. భూమా ముఖ్య అనుచరులు, కార్యకర్తలపై రాజకీయంగా, ఆర్ధికంగా ఒత్తిళ్లకు గురిచేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అఖిల ప్రియ సహోదరి మౌనికా రెడ్డి ఆదివారం అత్యవసరంగా ఆళ్లగడ్డ వెళ్లారు. భూమా నివాసంలో కార్యకర్తలతో ఆమె అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రత్యర్ధి వర్గం మిమ్మల్ని ఏవిధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారో తన దృష్టికి వచ్చినట్లు మౌనికా రెడ్డి చెప్పారట. అఖిలప్రియ జైలుకు వెళ్లారని అధైర్య పడొద్దనీ..ఇక నుంచి మీకు అండగా తానుంటానని ఆళ్లగడ్డ బాధ్యతలు తీసుకున్నారట. ఏ చిన్న సమస్య వచ్చినా తనకు నేరుగా ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తానని ఆమె కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్లు  చెబుతున్నారు.


కార్యకర్తలకు మనోధైర్యం..

ఓవైపు తన అక్క అఖిలప్రియ బెయిల్ కోసం మౌనికా రెడ్డి గట్టిగా పయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఆళ్లగడ్డలో ప్రత్యర్ధి వర్గం కదలికలపై ఆమె ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రత్యర్ధుల ఒత్తిళ్ల వల్ల భూమా క్యాడర్ చెదిరిపోకుండా ఉండేందుకు..భూమా కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే వారిని రంగంలోకి దింపినట్లు సమాచారం. మౌనికా రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల్లో తన అన్న భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. భూ వివాదంలో అఖిలప్రియ జైలుకు వెళ్లడంతో మౌనిక రెడ్డి ఆళ్లగడ్డలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశీతంగా గమనిస్తున్నారట. ఆళ్లగడ్డ బాధ్యతలు ఆమె తీసుకోవడంతో కార్యకర్తలు మనోధైర్యంతో ముందుకు వెళ్తున్నారట.


టాక్ ఇదీ..

ఇక అఖిలప్రియ అరెస్ట్ వ్యవహారంపై ఆళ్లగడ్డ రాజకీయాల్లో పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఏ2గా ఉన్న అఖిలప్రియను ఏ1గా మార్చడం...ఏవీ సుబ్బారెడ్డిని కేవలం విచారించి వదిలేయడంపై స్థానికంగా చర్చకు దారితీసింది. రాజకీయ కక్షలో భాగంగానే అఖిలప్రియను అరెస్ట్ చేసి, ఏవీ సుబ్బారెడ్డిని విడిచిపెట్టారని భూమా వర్గం భావిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే భూమా మౌనికా రెడ్డి ఆళ్లగడ్డలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. హఫీజ్ పేట్ భూ వివాదంపై ఇంత రాద్ధాతం చేయాల్సిన పనిలేదన్నారట. ఎవరైనా పెద్దలు కూర్చోని చర్చలకు ఆహ్వానిస్తే.. వెళ్లడానికి తమ కుటుంబం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారట.


సయోధ్య కుదురుతుందా?

హఫీజ్ పేట్  భూ వివాదం భూమా నాగిరెడ్డి మరణించాక అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య  దూరం పెంచిందన్న వాదనలున్నాయి. అయితే మౌనిక రెడ్డి పిలుపు మేరకు ఏవీ సుబ్బారెడ్డి చర్చలకు వెళ్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏవీ సుబ్బారెడ్డి, భూమా కుటుంబాలు పంతాలు వీడి పెద్ద  మనుషుల దగ్గర రాజీ చేసుకుంటే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో భూమా కుటుంబానికి మౌనికా రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మరి మౌనిక చెప్పినట్లు చర్చల ద్వారా ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదురుతుందా? లేక మరో వివాదానికి దారితీస్తుందో చూడాలి.



Updated Date - 2021-01-13T18:06:48+05:30 IST