ఖానాపూర్‌ డివిజన్‌లో 106 చోట్ల తనిఖీలు

ABN , First Publish Date - 2021-06-13T06:13:09+05:30 IST

ఖానాపూర్‌ డివిజన్‌ పరిదిలో అటవీశాఖ అధికారులు ఏకకాలంలో 106 చోట్ల కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు.

ఖానాపూర్‌ డివిజన్‌లో 106 చోట్ల తనిఖీలు
ఖానాపూర్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులు

ఖానాపూర్‌, జూన్‌ 12 : ఖానాపూర్‌ డివిజన్‌ పరిదిలో అటవీశాఖ అధికారులు ఏకకాలంలో 106 చోట్ల కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జంగల్‌ బచావో.. జంగల్‌ బడావో కార్యక్రమంలో భాగంగా అడవుల నరికివేతను అడ్డుకునేందకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఖానాపూర్‌ ఎఫ్‌డీవో కోటేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు కలప స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు కొత్త కొత్త పద్దతులను అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎఫ్‌డీవో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డివిజన్‌ పరిధిలోని ఖానాపూర్‌, పెంబి, కడెం, ఉడూంపూర్‌ అటవీరేంజ్‌ కార్యాలయాల పరిధిలోని 45 గ్రామాలలో 106 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల కోసం 25 బృందాలను సిద్దం చేసి సోదాలు నిర్వహించగా రూ.3 లక్షలు విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కలప స్మగ్లింగ్‌కు పాల్పడితే ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్‌ ఎఫ్‌ఆర్‌వో వినాయక్‌, పెంబి ఎఫ్‌ఆర్‌వో రామకృష్ణ, కడెం ఎఫ్‌ఆర్‌వో అనిత, ఉడుంపూర్‌ ఎప్‌ఆర్‌వో పోశమల్లుతో పాటు ఖానాపూర్‌ డిప్యూటి రేంజ్‌ అధికారి రత్నాకర్‌రావు తదితరులున్నారు. 


Updated Date - 2021-06-13T06:13:09+05:30 IST