కార్పొరేట్‌ కొలువు వదలి... రైతుల కోసం కదలి...

ABN , First Publish Date - 2021-06-07T05:30:00+05:30 IST

చాలామంది డబ్బు సంపాదనే లక్ష్యంగా బతుకుతారు. అతి కొద్దిమంది మాత్రమే తమ లక్ష్యం కోసం సంపాదిస్తారు. తమ్మినేని నిర్మల రెండవ కోవకు చెందినవారు. వ్యవసాయం మీద మక్కువతో నెలకు నాలుగు లక్షల వేతనం...

కార్పొరేట్‌ కొలువు వదలి... రైతుల కోసం కదలి...

చాలామంది డబ్బు సంపాదనే లక్ష్యంగా బతుకుతారు. అతి కొద్దిమంది మాత్రమే తమ లక్ష్యం కోసం సంపాదిస్తారు. తమ్మినేని నిర్మల  రెండవ కోవకు చెందినవారు. వ్యవసాయం మీద మక్కువతో నెలకు నాలుగు లక్షల వేతనం ఇచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నారు. అమెరికాలో సాఫీగా సాగుతున్న జీవితాన్ని విడచి సాగు బాట పట్టారు. కొవిడ్‌ కష్టకాలంలో సాగుదారుల స్థితిగతుల గురించి నవ్యతో ఆమె పంచుకున్న విశేషాలు...


‘‘పట్టణం పస్తు పెడతది. పల్లె ఆకలి తీరుస్తద’ని పెద్దలు ఊరికే అనలేదు. ఈ మాటలు కరోనా కష్టకాలంలో నిజమయ్యాయి. మాయదారి వైరస్‌ మూలంగా మహానగరాలు సైతం చిగురుటాకులా వణికినా, ఊర్లు మాత్రం  నిబ్బరంగా ఉన్నాయి. కొవిడ్‌ కారణం చూపి ఉద్యోగులకు జీతాలు ఇవ్వని వ్యాపారులున్నారేమోగానీ... కూలీ ఎగ్గొట్టిన రైతు ఒక్కరూ లేరని చెప్పవచ్చు.. లాక్‌డౌన్‌ ఉన్నా, లేకున్నా వ్యవసాయ రంగపనులు మాత్రం యథావిధిగా సాగుతున్నాయి. నేను నారాయణపేట్‌ జిల్లా, దామరగిద్ద మండలంలోని రైతులతో నాలుగేళ్లుగా కలిసి పనిచేస్తున్నాను. వాళ్ల సాధకబాధకాలను కళ్లారా చూస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ పరిస్థితులపై నాకు ఒక మేరకు అవగాహన ఉంది. ఉపాధి హామీ పథకం పుణ్యమా అని వ్యవసాయ కూలీ రేట్లు కాస్త మెరుగయ్యాయి. నిజం చెప్పాలంటే, ఈ కష్టకాలంలో గ్రామీణులే కాస్త స్థిమితంగా ఉన్నారు. 


అయితే, రైతులను కొవిడ్‌ కన్నా మన వ్యవస్థలే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాము పండించిన సరుకును నిర్ణీత సమయంలో అమ్ముకోలేక, మరుసటి రోజుకు అవి నిల్వ ఉండక... రైతులు ఎదుర్కొంటున్న వెతలు అన్నీ ఇన్నీకావు. ఇలాంటి సమయంలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వాలు ముందుకు రాక పోవడంతో అన్నదాతల కష్టాలు మరింత పెరిగాయి. అయితే నేను పనిచేస్తున్న గ్రామాల్లో మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం. పరిష్కారాల దిశగా వెళ్తున్నాం.


వలస శ్రామికుల కష్టం...

నగరాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయిన వలస శ్రామికులు సొంత ఊరు బాటపట్టారు. వ్యవసాయ పనులు అలవాటు లేని వారంతా ఇప్పుడు అత్యంత దయనీయంగా బతుకు వెళ్లదీస్తున్నారు. చాలామంది యువకులు స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోయి ఒక విధమైన నిరాసక్తతతో రోజులు గడుపుతున్నారు. అలాంటి వాళ్లకు గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించకపోతే సమాజానికి ఊహించలేనంత నష్టం తలెత్తుతుంది. లాక్‌డౌన్‌లో  రైతులు శ్రమిస్తున్నా, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు స్తంభించాయి. పీఎం కిసాన్‌యోజన, రైతుబంధు, రైతుభరోసా తదితర సంక్షేమ పథకాల ద్వారా డబ్బు కొంత మందికే వస్తుంది. మిగతావాళ్లు తమకెందుకు రాలేదని సంబంధిత అధికారులను అడిగితే సమాధానం ఉండదు.


తెలంగాణలో ధరణి పోర్టల్‌ సేవల కోసం చాలామంది రైతులు రోజుల తరబడి చెప్పులు అరిగేలా తిరిగినా పనులు కావడం లేదు. మల్‌రెడ్డిపల్లికి చెందిన పింజరి కాశీం అనే రైతుకు చెందిన ఒక ఎకరా పదిగుంటల భూమిని పాత ఎమ్మార్వో పైసలు తీసుకొని మరొకరి పేర రాశాడు. న్యాయం కోసం కలెక్టర్‌ను కలిస్తే, కోర్టుకు వెళ్ళాలని సూచించారు. ఇప్పుడు ఆ చిన్నరైతు కోర్టుల చుట్టూ తిరగాలా? సాగు చెయ్యాలా? ప్రతి పల్లెల్లో ఇవే సమస్యలు. అవి అన్నదాత కంటిమీద కునుకును దూరం చేస్తున్నాయని నా అనుభవం ద్వారా గుర్తించాను. అలాంటి బాధిత రైతుల పక్షాన నా వంతుగా పోరాడుతున్నాను. 


సంపాదన ఇక చాలనిపించింది...

మా సొంత ఊరు అనంతపురం జిల్లా ఉరవకొండ. మా నాన్న తమ్మినేని నారాయణ భారత ప్రణాళికా సంఘం ఉద్యోగి కావడంతో వివిధ రాష్ట్రాల్లో నా చదువు సాగింది. ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ అధికారిగా దేశంలో పేదరికం గురించి మా నాన్న చెప్పే విషయాలను వింటూ పెరిగాను. పెద్దయ్యాక గ్రామాల్లో పనిచేయాలని చిన్నప్పుడే నిశ్చయించుకున్నా. కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసి, అమెరికాలోని ఒక కార్పొరేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా చేరాను. అప్పుడు నా నెల జీతం రూ. నాలుగు లక్షలు. పదేళ్ల తర్వాత ‘ఈ సంపాదన ఇక చాలు’ అనిపించింది. ఉద్యోగం వదిలేశాను. 2012లో హైదరాబాద్‌కి వచ్చాను. కొన్నాళ్లు స్వచ్ఛంద సంస్థల్లో వాలంటీర్‌గా పనిచేశాను. అప్పుడే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరువు గ్రామాల గురించి తెలిసింది. అలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేయాలనేది నా కోరిక. అందుకే గట్టు గ్రామంలో ఒక అద్దె ఇల్లు తీసుకున్నాను. ఊరూరా తిరుగుతూ ఉపాధి హామీ పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించాను. కొన్నిచోట్ల అందులోని అవినీతిని బయటపెట్టాను. స్థానిక నాయకుల నుంచి బెదిరింపులూ చాలా వచ్చాయి. తెలంగాణ అవతరణ తర్వాత... రెట్టంపాడు ప్రాజెక్టు కారణంగా ఆ ప్రాంతంలో  తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. అక్కడ ఇప్పుడు చేపలు పడుతున్నారు. ఇక నా అవసరం అక్కడ లేదనిపించింది. 


బీడును బాగుచేశాం...

ప్రస్తుతం నారాయణ పేటలో ఉంటున్నాను. దామరగిద్ద మండలంలోని ఏడు గ్రామాల్లో రైతు సహకార సంఘాలను ఏర్పాటుచేశాను. వాటి ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఉడుమలగిద్దలోని రెండు వందల ఎకరాల మేర రాళ్లు పరుచుకొని ఉన్న బీడును 89 మంది దళిత కుటుంబాలకు ప్రభుత్వం సాగు చేసుకోవాలని కేటాయించింది. ఆ నేలను బాగు చేయించాల్సిందిగా లబ్ధిదారులు కలెక్టర్‌ను అభ్యర్థిస్తే... ‘దానికి రూ.4 కోట్లు అవుతుంది. అంత సొమ్ము లేద’న్నారు. మనమే జేసీబీల సహాయంతో బీడును బాగుచేసుకోవచ్చని రైతులతో అన్నాను. అందుకు వారంతా సిద్ధమయ్యారు.  కలసికట్టుగా పనిచేచి, బీడును సాగు నేలగా మార్చారు. ఆ భూమిలో ఇప్పుడు కందులు, కొర్రలు, పెసలు తదితర పంటలు పండిస్తున్నారు. ఆ పంటను మార్కెట్‌ చేసుకోవడంలోనూ రైతులకు శిక్షణ ఇస్తున్నాం. ఇందులో భాగంగా నా స్నేహితుల సహకారంతో హైదరాబాద్‌లోని కొన్ని కమ్యూనిటీలకు రైతు సహకార సంఘాల నుంచి కందిపప్పు, పెసరపప్పు లాంటి పప్పుదినుసులను సరఫరా చేస్తున్నాం. అవి కూడా మిల్లులో ఆడించినవి కావు. సంప్రదాయ పద్ధతిలో విసిరినవి అందిస్తున్నాం. 


శ్రామికుల్లో కరోనా తీవ్రత తక్కువే...

‘‘ఇప్పుడు కరోనా గ్రామాలకూ వ్యాపించింది. పల్లెల్లో కుల వివక్షకు కరోనా వివక్ష తోడైంది. వైద్య సౌకర్యాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే, శారీరక శ్రమ చేసే వ్యక్తుల్లో వైరస్‌ తీవ్రత తక్కువనే చెప్పాలి. నాకు తెలిసినంత వరకు రైతులు, వ్యవసాయ కూలీలు కరోనాతో చనిపోయిన దాఖలాలైతే లేవు. ఈ విషయంలో తప్పనిసరిగా అధ్యయనం జరగాలి.’’



అందుకే పిల్లలు వద్దనుకున్నాం...

నా సహచరుడి పేరు అభయ్‌కుమార్‌. అతను కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి కర్ణాటకలోని గ్రామీణ కూలీ కార్మిక సంఘటన సంస్థ సేవలకే అంకితమయ్యాడు. దేశానికి అన్నం పెట్టే రైతులతో జీవితాంతం కలిసి పనిచేయాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. దీనికి సంతానం అవరోధం కాకూడదనే... పిల్లలు వద్దనుకున్నాను. ఇప్పటి వరకూ ఒక వ్యక్తిగానే నేను పనిచేస్తున్నాను. అలానే ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి, దానిద్వారా కార్యక్రమాలు చేపట్టడం నాకు ఇష్టం లేదు. ఒక సగటు మనిషి సాధారణ జీవితం గడిపేందుకు అవసరమైనంత డబ్బును ఉద్యోగం ద్వారా కూడబెట్టాకే కార్యక్షేత్రంలోకి దిగాను. కనుక ఒక రూపాయి కూడా ఇతరుల నుంచి నేను ఆశించడంలేదు.  ప్రతి గ్రామంలో రైతు సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడం, రైతులకు లబ్ది కలిగించే పథకాలు, సాగు పద్ధతి, మార్కెటింగ్‌ విధానం, భూమి సమస్యలకు పరిష్కార మార్గాలు తదితర అంశాలపై వాటి ద్మారా అవగాహన కల్పించడం, రైతులకు ఫెసిలిటేటర్‌గా ఉండటం నా కర్తవ్య నిర్వహణగా భావిస్తున్నాను.’’

- కె. వెంకటేశ్‌




Updated Date - 2021-06-07T05:30:00+05:30 IST