సినిమా చూసి.. డాక్టర్‌ను నిలువునా దోచేసిన ముఠా!

ABN , First Publish Date - 2021-03-29T01:14:51+05:30 IST

బాలీవుడ్ సినిమా ‘స్పెషల్ 26’ చూసిన ఓ ముఠా అచ్చం ఆ సినిమాలోలా సీబీఐ అధికారులుగా నమ్మించి ఓ

సినిమా చూసి.. డాక్టర్‌ను నిలువునా దోచేసిన ముఠా!

న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా ‘స్పెషల్ 26’ చూసిన ఓ ముఠా అచ్చం ఆ సినిమాలోలా సీబీఐ అధికారులుగా నమ్మించి ఓ డాక్టర్‌ను నిలవునా దోచేసింది. రూ. 36 లక్షల నగదు, నగలు, విదేశీ కరెన్సీని దోచుకుంది. ఢిల్లీలోని పీతంపుర ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఐదుగురు సభ్యుల ఈ ముఠాలోని ముగ్గురిని.. బిట్టు (32), సురేందర్ (35), విభ (35)లను పోలీసులు అరెస్ట్ చేయగా, మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. ముఠా దోచుకున్న రూ. 36 లక్షల నగదు, రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 3,852 అమెరికన్ డాలర్లు, 400 పౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అమిత్, పవన్‌ల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  


1987లో ఒపేరా హౌస్‌లో జరిగిన దోపిడీ ఆధారంగా ‘స్పెషల్ 26’ సినిమాను తెరకెక్కించారు. ఇందులోని ఓ ముఠా సీబీఐ అధికారులుగా నటిస్తూ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు చేస్తూ అందినంత దోచుకుంటూ ఉంటుంది. ఈ సినిమాను చూసిన దోపిడీ ముఠా కూడా అచ్చం అలాగే చేస్తూ వైద్యుడిని దోచుకుంది. బాధిత వైద్యుడు  ప్రియాంక అగర్వాల్ మాట్లాడుతూ.. శుక్రవారం సాయంత్రం తన తండ్రి, డ్రైవర్‌తో కలిసి క్లినిక్ నుంచి ఇంటికి చేరుకున్నానని, అప్పటికే ఇంటి దగ్గర ఓ మహిళ సహా ఐదుగురు ఉన్నారని పేర్కొన్నారు. 


సీబీఐ అధికారులమని చెప్పి వైద్యుడి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన నిందితులు వారి నుంచి మొబైల్ ఫోన్స్ లాక్కున్నారు. నల్లధనం దాచినట్టు తమకు సమాచారం అందిందంటూ ఇల్లంతా గాలించారు. నగదు, నగలు తీసుకున్న తర్వాత తనిఖీల కోసమంటూ వైద్యుడిని మౌర్య ఎన్‌క్లేవ్‌లో ఉన్న క్లినిక్‌కు తీసుకెళ్లారు. వాహనం మౌర్య ఎన్‌క్లేవ్ పోలీస్ స్టేషన్‌ సమీపానికి చేరుకున్న సమయంలో వైద్యుడి డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. విషయాన్ని పోలీసులకు చేరవేశాడు.


పోలీసులను చూసిన నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురిని పట్టుకున్నారు. మిగతా ఇద్దరూ పరారయ్యారు. నిందితులు లూటీ చేసిన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తాము ‘స్పెషల్ 26’ సినిమా నుంచి ప్రేరణ పొంది ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్టు విచారణలో నిందితులు వెల్లడించారు. 

Updated Date - 2021-03-29T01:14:51+05:30 IST