టోక్యో స్ఫూర్తితో...

ABN , First Publish Date - 2021-09-07T06:06:54+05:30 IST

కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతున్న వేళ ఆంక్షల నడుమ నిర్వహించిన టోక్యో ఒలింపిక్‌ క్రీడలు భారత క్రీడాభిమానులను ఆనందడోలికల్లో ముంచెత్తాయి. సరిగ్గా నెలరోజుల క్రితం ముగిసిన వేసవి ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు...

టోక్యో స్ఫూర్తితో...

కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతున్న వేళ ఆంక్షల నడుమ నిర్వహించిన టోక్యో ఒలింపిక్‌ క్రీడలు భారత క్రీడాభిమానులను ఆనందడోలికల్లో ముంచెత్తాయి. సరిగ్గా నెలరోజుల క్రితం ముగిసిన వేసవి ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించిన అథ్లెట్ల స్ఫూర్తితో.. మన పారా క్రీడాకారులు భారత్‌ను అల్లంత ఎత్తున నిలిపారు. వేసవి క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్ల సన్మాన కార్యక్రమాలు ఇంకా ముగియకముందే, పారా అథ్లెట్లు ఆనందాన్ని మూడింతలు చేశారు. మొత్తం 9 క్రీడాంశాల్లో 54 మంది భారత అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నా, ఏకంగా 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలవడం నిజంగా అత్యద్భుతంగానే చెప్పుకోవాలి. 2016 రియో క్రీడల్లో మనకు దక్కినవి నాలుగు పతకాలే. ఆ మాటకొస్తే 1960 టోక్యో పారాలింపిక్స్‌లో తొలిసారిగా బరిలోకి దిగినప్పటినుంచి రియో క్రీడల వరకూ భారత్‌ సాధించినది కేవలం డజను మాత్రమే. వాటితో పోల్చిచూస్తే తాజా క్రీడల్లో మనవారి ఘనత నిస్సందేహంగా రికార్డు పుటల్లో లిఖించదగ్గదే. 1972 పారాలింపిక్స్‌లో ఒకే మెడల్‌ గెల్చుకున్నా, మనకు 25వ స్థానం దక్కింది. పోటీ పెరిగిన నేపథ్యంలో టోక్యోలో 19 పతకాలు నెగ్గిన భారత్‌కు 24వ స్థానం లభించింది. ఈసారి షూటింగ్‌, డిస్కస్‌, ఆర్చరీ, టేబుల్‌ టెన్నిస్‌, హైజంప్‌, జావెలిన్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాంశాల్లో 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్యాలు అందుకున్నారు. వీరిలో ఐదుగురు క్రీడాకారులు సుమిత అంటిల్‌, ప్రమోద్‌ భగత్‌, కృష్ణ నగార్‌, మనీశ్‌ నర్వాల్‌, అవని లేఖార స్వర్ణకాంతులు పరిచారు. అలాగే సింగ్‌రాజ్‌ అధాన, అవనీ లేఖార చెరో రెండు పతకాలు కొల్లగొట్టారు. క్రీడాంశాల విషయానికొస్తే ఒక్క షూటింగ్‌లోనే భారత్‌ ఐదు పతకాలు సాధించింది. ఇక డిస్కస్‌ త్రోయర్‌ వినోద్‌ కుమార్‌ పతకాన్ని వెనక్కి తీసుకోకుంటే మన సంఖ్య రెండు పదులయ్యేది. అతడు తలపడిన విభాగం సరైనది కాదంటూ వినోద్‌పై అనర్హత వేటు వేశారు. ఈ విభాగంలో పాల్గొనేందుకు తొలుత అంగీకరించిన క్రీడాధికారులు అనంతరం పరిశీలన చేసి అనర్హుడిగా ప్రకటించారు. 


అనూహ్యమైన ఫలితాలతో భవిష్యత్తుపై ఎన్నో ఆశలు రేకెత్తిస్తున్న మన పారా అథ్లెట్ల కోసం మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో మెరుగుపరచాల్సి ఉంది. అంతంత మాత్రంగా సిద్ధమైతేనే ఇంత ఘనమైన విజయాలు దక్కితే.. నిజంగా ప్రభుత్వాల అండ పూర్తిగా ఉంటే అద్భుతమైన ఫలితాలు అందుతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. క్రీడా సంస్కృతి కొరవడిన మన సమాజంలో పారా క్రీడాకారులు సాధించిన ఫలితాలు ఒకింత ఆశ్చర్యకరమే. ఈ క్రీడల పతకాల పట్టికలో చైనా 207, బ్రిటన్‌ 124, అమెరికా 104 పతకాలతో తొలి మూడుస్థానాల్లో నిలిచాయి. క్రీడా సంస్కృతి పరిఢవిల్లే ఆయా  దేశాలకు వందల సంఖ్యలో పతకాలు లభించడం ఊహించిందే. ఆటలు దేనికీ కొరగానివన్న అభిప్రాయం నెలకొన్న మన దేశంలో పరిస్థితులు చాలా మెరుగుపడాలి. వివిధ రకాలైన వైకల్యాలతో బరిలో నిలిచిన క్రీడాకారుల ప్రదర్శనను గమనిస్తే, అవయవాలన్నీ సక్రమంగా ఉన్న ఆటగాళ్ల కంటే ఒక అడుగు ముందే ఉన్నారన్న విషయం అవగతమవుతుంది. ప్రమాదాలు, పోలియో వ్యాధిగ్రస్తులు, జన్మతః వచ్చే ఇతరత్రా సమస్యలతో వైకల్యం ప్రాప్తించిన వారు అన్ని సమస్యలనూ అధిగమించి రాణించిన తీరు బహుధా ప్రశంసనీయం. ఈ క్రీడల్లో విజేతల నేపథ్యాన్ని పరికిస్తే... అంతంత మాత్రం ప్రోత్సాహం, వైకల్యంతో పోగయిన కష్టాలు, పూటగడవని కుటుంబ నేపథ్యాలు కనిపిస్తాయి. ప్రపంచ రికార్డు సాధించిన జర్మనీకి చెందిన లాంగ్‌జంప్‌ స్వర్ణపతక విజేత మార్కస్‌ రేమ్‌ ప్రతిభాపాటవాల్ని చూస్తే సాధారణ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం నెగ్గగల సత్తా కనిపిస్తుంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో, అంతంత మాత్రం శిక్షణలోనూ ఇంత గొప్ప విజయాలు దక్కడం మామూలు విషయం కాదు. క్రీడా మంత్రిత్వ శాఖ, భారత పారాలింపిక్‌ కమిటీ, శిక్షకులు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. అయితే ఇంతటితో సరిపోదు. కార్పొరేట్‌ సెక్టార్‌ దిగ్గజాల సహాయం కూడా అందాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంకల్పించి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు, వైకల్యం ఉన్నవారికి అధునాతన సామాగ్రి అందజేసే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాలు సఫలమైతే 2024 పారిస్‌ క్రీడల్లో ఇప్పటి 19 పతకాల్ని 38 చేయడం పెద్ద కష్టమేమీ కాబోదు. ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్టు ఈ విజయం భారత క్రీడారంగంలోనే ఒక ప్రత్యేకమైన సందర్భమనడంలో సందేహం లేదు.

Updated Date - 2021-09-07T06:06:54+05:30 IST