Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేపాల్‌లో అస్థిరత

నేపాల్‌ పార్లమెంటు రద్దుచేయాలన్నది పూర్తిగా ఆ దేశం వ్యక్తిగత అంశమని భారతదేశం బుధవారం వ్యాఖ్యానించింది. నేపాల్‌ రాజకీయ సంక్షోభంపై భారత్‌ నోరువిప్పడం ఇదే తొలిసారి. ఆ సంక్షోభంలో ఏమాత్రం వేలుపెట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేయడం భారత్‌ ఉద్దేశం. కానీ, నేపాల్‌ విపక్షాలు మాత్రం భారత్‌ను బలంగానే అనుమానిస్తున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీకి భారత్‌ లోపాయి కారీగా సహకరిస్తున్నట్టు అనుమానిస్తున్నాయి. 


పార్లమెంటు రద్దు నిర్ణయంతో నేపాల్‌ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ప్రధాని కేపీ శర్మ ఓలీని మరోమారు గట్టిగా కాపాడుకొచ్చినట్టే. తాత్కాలిక ప్రధాని హోదాలో ఆయన కనీసం ఆర్నెల్లు చక్రం తిప్పబోతున్నారు. నవంబరులో జరగబోయే ఎన్నికలకు సమాయత్తం కావడంలో మిగతా పక్షాల కంటే ఆయనకు అదనపు ప్రయోజనాలు కచ్చితంగా దక్కుతాయి. రాష్ట్రపతి నిర్ణయంపై అక్కడి విపక్షాలు తాడెత్తున మండిపడుతున్నాయి. పైగా, మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ దూబా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్‌ను బలపరీక్షకు ఆహ్వానించకుండా అధ్యక్షురాలు సభను రద్దుచేయడం ఓలీ వ్యతిరేకుల్లో మరింత అసహనాన్ని పెంచింది. అధికారంలోకి రావాలన్న విపక్ష కూటమి యత్నాలకు మధేసీ ఎంపీలు సహకరించకపోవడంతో విపక్షానికి తగిన సంఖ్యాబలం లేదని అధ్యక్షురాలు తేల్చేశారు. దూబా నాయకత్వంలోని సంకీర్ణ కూటమికి దూరంగా ఉండాలన్న మధేసీ నాయకుడు మహంత్‌ ఠాకూర్‌ నిర్ణయం వెనుక భారత్‌ ఒత్తిళ్ళు పనిచేశాయని విపక్షనాయకుల ఆరోపణ.


నేపాల్‌లో గత కొద్దినెలలుగా నెలకొన్న రాజకీయ అస్థిరత చివరకు కరోనా కష్టకాలంలో దేశం ఎన్నికలకు పోవాల్సిన అగత్యాన్ని కలిగించింది. నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీలో ఇద్దరు యోధుల మధ్య సాగుతున్న యుద్ధం అనేక మలుపులు తిరుగుతున్నది. మూడేళ్ళ క్రితం కేపీ శర్మ ఓలీ, పుష్పకుమార్‌ దహల్‌ (ప్రచండ) చేయీచేయీ కలిపి ఒక్కటి చేసిన పార్టీ ఇప్పుడు మళ్ళీ గతంలో మాదిరిగా రెండు అయింది. అధికారం సమంగా పంచుకుందామని ప్రచండకు హామీ ఇచ్చిన ఓలీ, ప్రధాని అయిన తరువాత సర్వాధికారాలూ చెలాయిస్తూ, సమస్త నిర్ణయాలూ ఏకపక్షంగా తీసుకుంటూ ప్రచండను అవమానాలకూ, ఆగ్రహానికీ గురిచేసిన విషయం తెలిసిందే. ప్రచండ వర్గం తనను గద్దెదింపేయడానికి ప్రయత్నించినప్పుడల్లా ఓలీ ఏవో ఎత్తులతో అధికారాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చాడు. చివరకు, ప్రధానిగా తాను తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు, అధికారాన్ని ప్రచండకు దక్కనీయకుండా చేయడానికి గత ఏడాది డిసెంబరులో పార్లమెంటు రద్దుకు సిఫార్సు చేసి, రాష్ట్రపతితో ఆమోదముద్రవేయించుకున్నారు. ఈ నిర్ణయంమీద విపక్షాలు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, రద్దు నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమనీ, చెల్లదనీ కోర్టు తీర్పుచెప్పింది. ఫిబ్రవరిలో పార్లమెంటును తిరిగి ప్రతిష్ఠించినా, బలాబలాల గొడవలూ, కుట్రలూ కొనసాగుతూనే ఉన్నాయి. 


నేపాల్‌ సుప్రీంకోర్టు కేవలం ఐదునెలల్లోనే మరోమారు రాష్ట్రపతి చేసిన దిగువసభ రద్దు నిర్ణయంపై రేపటినుంచి వాదనలు వినబోతున్నది. విపక్ష నాయకులు, ప్రజాస్వామికవాదులు దాఖలు చేసిన దాదాపు ముప్పై పిటిషన్‌లు న్యాయమూర్తుల ముందు ఉన్నాయి. 


మే 10న జరిగిన బలపరీక్షలో ఓడిపోయినప్పటికీ, అధ్యక్షురాలి అండదండలు ఉండటంతో తాత్కాలిక ప్రధానిగా ఓలీ కొనసాగగలిగారు. ఇప్పుడు ఆయన సూచనలమేరకే, మళ్ళీ దిగువ సభ రద్దుకూ, ఎన్నికల నిర్వహణకూ రాష్ట్రపతి నిర్ణయించడం విపక్షాలకు ఆగ్రహం కలిగించింది. ఓలీకి బలనిరూపణకు అవకాశం ఇచ్చినట్టే, 149మంది మద్దతు ఉన్నదని అంటున్న షేర్‌ బహదూర్‌ దూబాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అన్నది న్యాయనిపుణుల ప్రశ్న. విశ్వాసపరీక్షలో ఓడిపోయిన ఓలీని, మెజారిటీ పార్టీ నాయకుడన్న పేరిట మూడురోజుల్లోనే ప్రధానిగా తిరిగి కూచోబెట్టి, ఆయనకు మేలుచేకూర్చే లక్ష్యంతో మరోవారంలో ఇలా సభ రద్దుకూ, ఎన్నికలకూ రాష్ట్రపతి నిర్ణయించడం కచ్చితంగా సర్వోన్నత న్యాయస్థానంలో వీగిపోతుందని నిపుణుల అంచనా. దశాబ్దాలపాటు హింస చవిచూసి, ఎంతో కష్టపడి ప్రజాస్వామ్యంవైపు అడుగులు వేసిన నేపాల్‌ సుదీర్ఘ రాజకీయ అస్థిరతలో కొట్టుమిట్టాడటం విషాదం.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...