Instagramలో యువతి పరిచయం.. లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామని పిలిపించి కిడ్నాప్.. అమ్మాయి పేరెంట్స్‌కి ఫోన్.. చివరికి..!

ABN , First Publish Date - 2021-12-19T20:01:19+05:30 IST

Instagramలో యువతి పరిచయం.. లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామని పిలిపించి కిడ్నాప్ చేసి.. అమ్మాయి పేరెంట్స్‌కి ఫోన్.. చివరికి..!

Instagramలో యువతి పరిచయం.. లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామని పిలిపించి కిడ్నాప్.. అమ్మాయి పేరెంట్స్‌కి ఫోన్.. చివరికి..!

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 18: ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయమైన యువకుడు ప్రేమ పేరుతో ఓ యువతిని మోసగించి కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయగా పోలీసులు అతడిని పట్టుకుని యువతిని అతడి చెర నుంచి కాపాడారని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి చెప్పారు. రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం ఎస్పీ ఐశ్వర్య రస్తోగి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రాజానగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి  పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొత్తపూసల మర్రు గ్రామానికి చెందిన పాత నేరస్థుడు మోక ఫణీంద్ర అలియాస్‌ ఫణి ఇన్‌స్ట్రాగ్రాం ద్వారా పరిచయమయ్యాడు.


ఆమెకు మాయమాటలు చెప్పి ట్రాప్‌ చేశాడు. ఈ నెల 15న లాంగ్‌ డ్రైవ్‌కు వెళదామని చెప్పి భీమవరం తీసుకెళ్లి అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో కట్టేశాడు. ఆమె వద్ద ఉన్న బంగారు  చైను, చెవి దిద్దులు తీసుకుని ఆమె తండ్రికి ఫోన్‌ చేసి రూ.5 లక్షలు ఇస్తేనే కానీ వదలబోమని, ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించాడు. దీంతో బాధితురాలు తల్లి పోలీసులను ఆశ్రయించడంతో రాజానగరం సీఐ ఎంవీ సుభాష్‌ కేసు నమోదు చేశారు. ఏఎస్పీ లతామాధురి, డీఎస్పీ జేవీ సంతోష్‌ పర్యవేక్షణలో కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. 


భీమవరంలో ఎన్‌.గంగాభవాని అనే మహిళా పోలీస్‌ ద్వారా కిడ్నాప్‌కు గురైన యువతిని గుర్తించి  ఫణీంద్రను అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఫణీంద్ర బాలుడిగానే అనేక నేరాలకు పాల్పడ్డాడని అతడిపై అనేక కేసులున్నాయని చెప్పారు. కేసు ఛేదించడంలో కృషి చేసిన సీఐ సుభాష్‌, ఎస్‌ఐ వై.సుధాకర్‌, ఎండీ జుబేర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ డీబీ రమణ, ఎం.ప్రసాద్‌, కానిస్టేబుల్స్‌ కె.పవన్‌కుమార్‌, ఎ.శ్రీనివాస్‌, భీమవరం మహిళా పోలీస్‌ ఎన్‌.గంగాభవానిను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

Updated Date - 2021-12-19T20:01:19+05:30 IST