అరకొర జీతాలు.. అర్ధాకలి బతుకులు

ABN , First Publish Date - 2021-06-18T05:21:26+05:30 IST

కరోనా మహమ్మారి అనేక మంది జీవితాలను తలకిందులు చేసింది. అందులో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఉన్నారు.

అరకొర జీతాలు.. అర్ధాకలి బతుకులు

ఏడాదిగా ప్రైవేటు టీచర్ల పాట్లు

కరోనాతో జీవితాలు తలకిందులు

ప్రత్యామ్నాయ పనుల కోసం వెదుకులాట

ప్రభుత్వం సాయం చేయాలని అభ్యర్థన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


కరోనా మహమ్మారి అనేక మంది జీవితాలను తలకిందులు చేసింది. అందులో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. నగరంలో దాదాపు 600 వరకు ప్రైవేటు పాఠశాలలు వుండగా, వాటిలో 15 వేల మంది వరకు టీచర్లు పనిచేస్తున్నారు. వారికి ఇచ్చేదే చాలీచాలని జీతం. ఒక మాదిరి పాఠశాలల్లో రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తుంటారు. భార్యాభర్తలు ఇద్దరూ పనిచేసుకుంటేనే కుటుంబం ముందుకుసాగేది. గత ఏడాది మార్చిలో విద్యా సంవత్సరం ముగుస్తుందనగా కరోనా రావడంతో పాఠశాలలన్నీ మూతపడ్డాయి. అప్పటికే పాఠశాలల యాజమాన్యాలన్నీ ఉపాధ్యాయులకు రెండు, మూడు నెలల జీతాలు చెల్లించాల్సి ఉంది. ఇక గత జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం మొదలు కాలేదు. అక్టోబరులో కొన్ని పాఠశాలలు తెరిచినా పెద్ద తరగతులను 20 శాతం మంది టీచర్లతోనే నడిపారు. ఆ తరువాత జనవరిలో సంక్రాంతి ముగిసిన తరువాత మరో 30 శాతం మందిని టీచర్లను పిలిచారు. మళ్లీ కరోనా కారణంగా మార్చి పాఠశాలలు మూసేశారు. ఇప్పటివరకు తెరుచుకోలేదు. దీంతో విద్యా సంవత్సరం అంతటికీ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కొంతమంది టీచర్లకు నాలుగైదు నెలల జీతాలు మాత్రమే ఇచ్చాయి. పాఠాలు చెప్పే టీచర్లు...కరోనా నేపథ్యంలో కనీసం ట్యూషన్లు చెప్పుకొనే అవకాశం కూడా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కుటుంబ పోషణకు నెలకు కనీసం రూ.15 వేలు అవసరం కావడంతో ఏడాది నుంచి అప్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఇక అప్పు కూడా పుట్టని స్థితి రావడంతో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం వెదుకులాడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా కర్ఫ్యూ కారణంగా వ్యాపారాలు లేవని, మధ్యాహ్నానికే దుకాణాలు కట్టేస్తున్నామని, ఇక ఉద్యోగాలు ఎక్కడ ఇస్తామంటూ పెదవి విరుస్తున్నారు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం ఏమీ చేయడం లేదని ప్రైవేటు పాఠశాలల టీచర్లు వాపోతున్నారు. 


నెలకు కనీసం రూ.10 వేలు ఉండాలి


ఇద్దరు పిల్లలతో చిన్న కుటుంబం గడవాలంటే నగరంలో నెలకు కనీసం రూ.10 వేలు ఉండాలి. ఇంటి అద్దె నెలకు రూ.4 వేలు. కరెంట్‌, కేబుల్‌, తాగునీటి ఖర్చు రూ.వేయి. పాలకు మరో వేయి. బియ్యం, పప్పులు, ఇతర అవసరాలకు ఇంకో రూ.4 వేలు. మొత్తం రూ.10 వేలు. పిల్లల చదువులు, అనారోగ్యం ఖర్చులు అదనం. గత ఏడాదికాలంగా జీతాలు సరిగ్గా లేకపోవడంతో ఒక్కో టీచరు లక్ష రూపాయల వరకు అప్పు చేశారు. వడ్డీ నెలకు రూ.100లకు మూడు రూపాయలు. ఇప్పుడు వడ్డీకే నెల రూ.3 వేలు కట్టాల్సిన పరిస్థితి. అది కూడా కట్టలేని పరిస్థితి. 


మరో ఉపాధి చూసుకుంటున్నా

ఎస్‌.శంకర్‌, అధ్యాపకుడు, శంకర్‌ ట్యుటోరియల్స్‌, కొత్తపాలెం


గత ఏడాది నుంచి మా పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్ధిక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించే వారు ఎంతో కొంత చెల్లిస్తున్నారు. మిగిలిన పాఠశాలల్లో జీతాలు కూడా ఇవ్వడం లేదు. ఇక తప్పనిసరి స్థితిలో ఇతర ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో యాజమాన్యాన్ని కూడా ఏమి అనలేకపోతున్నాము. ప్రభుత్వం ఎంతో కొంత సాయం అందించి ఆదుకుంటే బాగుటుంది.


రెండేళ్ల నుంచి ఇబ్బందులు 

ఎం.శ్రీనివాసరావు, ప్రైవేటు స్కూల్‌ టీచర్‌


కరోనా మొదటి వేవ్‌ నుంచి స్కూళ్లు సరిగ్గా పనిచేయక ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఉద్యోగంపైనే ఆధారపడినవారు అప్పులు పాలై జీవనాన్ని కొనసాగించాల్సి వస్తున్నది. కొంతమంది ఇతరత్రా పార్టు టైం ఉద్యోగాల్లో చేరి కుటుంబాలను నెట్టుకువస్తున్నారు. అయినా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం దయతలచి ఆదుకోవాలి.

Updated Date - 2021-06-18T05:21:26+05:30 IST