తెలంగాణలో గర్భిణులకు అవమానాలు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-09-15T23:17:03+05:30 IST

తెలంగాణలో గర్భిణులకు అవమానాలు: విజయశాంతి

తెలంగాణలో గర్భిణులకు అవమానాలు: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గర్భిణులకు ఎదురవుతున్న అవమానాలు, అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాల​ సమస్యలు, డాక్టర్లు - టెక్నిషియన్ల కొరత, ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేకపోవడం తదితర అంశాలపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియాలో స్పందించారు. ఆమె పోస్టు యథాతథంగా....


''రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత నుంచి గర్భిణులు కొంచెం ఉపశమనం పొంది... చెకప్​లు, కాన్పుల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పోతున్న వారికి అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్న సంగతిని ప్రభుత్వం పక్కన పెడుతోంది. టెస్టుల కోసం, డాక్టర్​ చెకప్​ కోసం గంటల తరబడి నిలబడి వేచి చూడాల్సిన పరిస్థితి తెలంగాణలో దాపురించింది. మహిళలకు కార్పొరేట్​ స్థాయి వైద్యం అందిస్తామని చెప్పే సీఎం కేసీఆర్,​ సొంత నియోజకవర్గం గజ్వేల్​లోని ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోగా కూర్చోడానికి కుర్చీలు కూడా లేక గర్భిణులు నేలపైనే కూర్చుంటున్న దృశ్యాలు చాల బాధాకరం. మహిళలకు అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని సీఎం కెసిఆర్ గొప్పలు చెప్పడంలో ఉన్న శ్రద్ద చేతల్లో లేదని అర్ధమవుతుంది. రాష్ట్ర మంతటా ప్రభుత్వాస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఉన్నా... ఆరోగ్య శాఖ మాత్రం పట్టింపులేనట్టుగానే వ్యవహరిస్తోంది. కడుపులోని బిడ్డ ఎదుగదలను తెలుసుకునేందుకు అల్ట్రా సౌండ్ స్కానింగ్​లే కీలకంగా ఉంటాయి. అలాంటి స్కానింగ్​ పరికరాలు రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో లేనేలేవు. కమ్యునిటీ హెల్త్​ సెంటర్​‌‌‌‌ నుంచి టీచింగ్​ హాస్పిటళ్ల వరకూ స్కానింగ్​ యంత్రాలు అందుబాటులో లేవు. కొన్ని చోట్ల ఉన్నా... టెక్నీషియన్లు లేక మూలనపడడం చూస్తే ప్రభుత్వం వైద్య వ్యవస్థపై ఎంత చిత్తశుద్ధి కనబరుస్తుందో ఇట్టే అర్ధమవుతుంది. గర్భిణుల సమస్యలకు డాక్టర్ల కొరత కూడా ప్రధాన కారణం. ఒక్కో డాక్టర్​ రోజూ కనీసం వంద మంది గర్భిణులను చూడాల్సిన పరిస్థితి తెలంగాణాలో ఉంది. ఆదిలాబాద్​ రిమ్స్​లో 30 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట, 11 మంది మాత్రమే పనిచేస్తున్నారని వైద్యశాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే... కాన్పు అయ్యాక బ్లీడింగ్​ను ఆపే ట్రామెక్సా ఇంజెక్షన్లు, ఇతర మందులు కూడా అందుబాటులో లేకుండా పేద గర్భిణీల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది ఈ ప్రభుత్వం. వైద్య శాఖలో ఉన్న మొత్తం ఖాళీలు భర్తీ చేయాల్సిన ప్రభుత్వం వాటి ఊసెత్తడం లేదు. వైద్య శాఖకు కేటాయించిన నిధిని మౌలిక సౌకర్యాలు, వసతులపై ఏమాత్రం ఖర్చు చేయకుండా స్వలాభాలకి వాడుతున్నరు. ప్రభుత్వ భూములమ్మి, ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టుల ద్వారా డబ్బు సొమ్ముచేసుకుని, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుచేసి అధికారం పొందడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తీరు ఉంది. కానీ ప్రజల ఆరోగ్యంపై, గర్భిణుల ప్రాణాలపై ఎలాంటి బాధ్యత కనుబరుస్తలేడు. ఇలాంటి నీచమైన దొర పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.'' అని రాములమ్మ ఆవేదన చెందారు.



Updated Date - 2021-09-15T23:17:03+05:30 IST