Abn logo
Jul 29 2021 @ 02:28AM

పారితోషికం రెట్టింపు చేస్తామని.. ఉద్యోగాలకే ఎసరు

  • రోడ్డున పడిన బీమా మిత్రలు
  • ఒక్క మాటైనా చెప్పకుండా 1,350 మంది తొలగింపు
  • వారి విధులు వలంటీర్లకు అప్పగింత
  • ఒక్క పోస్టు కూడా తొలగించబోమన్న సీఎం హామీ హుష్‌
  • డీఆర్‌డీఏ పీడీ కార్యాలయాల వద్ద బీమా మిత్రల నిరసన 


బీమా మిత్రలను ఒక్కరిని కూడా తొలగించేది లేదని, వారి పారితోషికాన్ని రెట్టింపు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ నీటి మీద రాతల్లా మారింది. ఒక్క మాటైనా చెప్పకుండా రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్న 1,350 మందిని తొలగించారని వారంతా ఆందోళన బాట పట్టారు. డీఆర్‌డీఏ పీడీ కార్యాలయాల వద్ద నిరసనకు దిగారు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): వారు పేద డ్వాక్రా మహిళలు. 2008లో అప్పటి ప్రభుత్వం ఆమ్‌ ఆద్మీ బీమా యోజన, అభయహస్తం లాంటి బీమా పథకాల ఫలాలను డ్వాక్రా సంఘాల సభ్యులకు కల్పించేందుకు బీమా మిత్రల పేరుతో మండలానికొకరిని నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా చురుకుగా ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి సుమారు 1,350 మంది పదో తరగతి పాసైన మహిళలను ఎంపిక చేశారు. అరకొర పారితోషికంతోనే వారు విస్తృతమైన సేవలు అందించేవారు. చంద్రబాబు హయాంలో చంద్రన్న బీమా కోసం పనిచేశారు. కాల్‌సెంటర్లకు వచ్చిన కాల్స్‌ను రిసీవ్‌ చేసుకుని మండలస్థాయిలో బీమాకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపేవారు. పేద కుటుంబంలోని వ్యక్తి ఎక్కడ మరణించినా  కాల్‌ సెంటర్లకు ఫోన్లు వెళ్లేవి. చనిపోయిన కుటుంబాలకు ఆసరాగా నిలబడుతూ మట్టి ఖర్చుల కింద రూ.5 వేలు బీమా మిత్రల ఆధ్వర్యంలో చెల్లించేవారు. వాళ్లు చేస్తున్న ఉద్యోగాలు చిన్నవైనప్పటికీ చేసే సేవలు విస్తృతమైనవని ప్రశంసలందుకున్నారు. మండలంలో చంద్రన్న బీమా క్లెయింల పరిష్కారం కోసం వారు తలలో నాలుకలా వ్యవహరించేవారు. అందుకే అప్పటి ప్రభుత్వం వారి సేవలకు రూ.3 వేల పారితోషికం అందించేది. అలాంటి సిబ్బందికి వైసీపీ సర్కార్‌ వచ్చిన వెంటనే కష్టాలు ప్రారంభమయ్యాయి. 


అన్ని జిల్లాల్లో ఆందోళనలు..

గతేడాది నవంబరు 13న బీమా మిత్రల జాబ్‌చార్ట్‌ను వలంటీర్లకు అప్పగించడంతో, అప్పటి నుంచి బీమా మిత్రలకు కంటిమీద కునుకు కరువైంది. పన్నెండేళ్ల నుంచి ఇదే బతుకుదెరువుగా జీవిస్తున్న తమ కుటుంబాలను రోడ్డున పడేశారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పోరాటం ద్వారానే తమ ఉనికిని కాపాడుకోవాలన్న నిర్ణయానికొచ్చారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల డీఆర్‌డీఏ పీడీ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తిండి పెడితే, జగన్‌ నోటికాడ కూడు తీసే పనులు చేస్తున్నారని, బీమామిత్రలకు ఉద్యోగ భద్రత లేకుండా చేశారని ఆవేదన వెలిబుచ్చారు. తమ ఉద్యోగాలు తమకే కావాలని, సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు పారితోషికం రెట్టింపు చేయాలని అప్పటి వరకు ఉద్యమం ఆపేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  


చెప్పిందొకటి.. చేసిందొకటి..

సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించిన బీమా మిత్రలకు వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత ఉనికి కోల్పోయే ప్రమాదమేర్పడింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో బీమా మిత్రలు జగన్‌ను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలిచ్చారు. చివరికి ఓ సారి ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదని, పారితోషికం రెట్టింపు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అయితే అందుకు విరుద్ధంగా జరుగుతుండటంతో బీమా మిత్రల పరిస్థితి ఆందోళనకంగా మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రన్న బీమాకు స్వస్తి పలికింది. ఆ తర్వాత వైఎ్‌సఆర్‌ బీమాను ప్రారంభించేందుకు ఏడాది పట్టింది. వైఎ్‌సఆర్‌ బీమా అమలు కోసం జారీచేసిన జీవో నంబరు 644ను చూసి బీమామిత్రలు ఉలిక్కిపడ్డారు. మార్గదర్శకాల్లో తమ ప్రస్తావనే లేకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. వైఎ్‌సఆర్‌ బీమా దరఖాస్తులతో పాటు క్లయింల బాధ్యతలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న వలంటీర్లకు అప్పగించడంతో తమకు ఇంకేం పని ఉందంటున్నారు. పొమ్మనకుండానే పొగపెట్టేందుకు వలంటీర్లకు బాధ్యతలు అప్పగించారని వాపోతున్నారు. ఒక్క ఉద్యోగం కూడా తొలగించబోమని చెప్పిన సర్కార్‌ మాట మార్చిందని, మోసం చేసిందని వాపోతున్నారు.