‘బీమా’ చింత !

ABN , First Publish Date - 2021-07-01T06:16:31+05:30 IST

జీవిత బీమా సంస్థలో వాటాలు విక్రయించే విషయంలో కేంద్రప్రభుత్వం బుధవారం మరో కీలకమైన అడుగు వేసింది. ఒకపక్క 1956 నాటి ఎల్‌ఐసీ చట్టానికి 27 సవరణలు చేయడంతోపాటు, బీమా రంగంలో...

‘బీమా’ చింత !

జీవిత బీమా సంస్థలో వాటాలు విక్రయించే విషయంలో కేంద్రప్రభుత్వం బుధవారం మరో కీలకమైన అడుగు వేసింది. ఒకపక్క 1956 నాటి ఎల్‌ఐసీ చట్టానికి 27 సవరణలు చేయడంతోపాటు, బీమా రంగంలో విదేశీపెట్టుబడుల శాతాన్ని 74కు పెంచుతున్నట్టు ఇటీవలి బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎల్‌ఐసీ చట్టానికి చేసిన ఆ 27 సవరణలను కేంద్రం బుధవారం అమలులోకి తీసుకువచ్చి, ఎల్‌ఐసీలో భారీ వాటాల విక్రయానికి మార్గం సుగమం చేసుకుంది. ఈ భారీ ఐపీవో ద్వారా  లక్షకోట్లు సంపాదించాలని కేంద్రప్రభుత్వం ఆశిస్తోంది. ఈ దిశగా గ్లోబల్‌ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు విశేషకృషి సాగుతోందనీ అంటున్నారు. కేంద్రప్రభుత్వం ఈ ఐపీవోను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ భారీకార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకుపోయి, విదేశీ పెట్టుబడిదారుల ముందు తలవంపులు రాకుండా చూడటానికి వీలుగా, బుధవారంతో ముగిసిపోయే ప్రస్తుత ఎల్‌ఐసీ చైర్మన్‌ పదవీకాలాన్ని మరో తొమ్మిదినెలలు పొడిగించింది కూడా.


ఈ సవరణలతో ఎల్‌ఐసీ ఇక కార్పొరేషన్‌గా కాక, కంపెనీగా మారిపోతున్నది కనుక, తదనుగుణంగా దాని నిర్మాణంలోనూ, పనివిధానాల్లోనూ మార్పులుంటాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఏడాది లక్షాడెబ్బయ్‌ ఐదువేల కోట్ల రూపాయలు ఆర్జించాలన్న కేంద్ర బడ్జెట్‌ లక్ష్యంలో గరిష్ఠ భాగాన్ని ఈ ఐపీవో తీరుస్తుంది. ఈ అతిపెద్ద, పురాతన బీమా సంస్థ ఎంత గొప్పదో, దాని పనితీరు ఎంత భేషుగ్గా ఉన్నదో, ప్రభుత్వం చట్టసవరణలతో తెచ్చిన కొత్త మార్పుచేర్పులు భవిష్యత్తులో ఎంత లాభం చేకూర్చిపెడతాయో ఇన్వెస్టర్లకు ఎంతోముందుగానే వివరించే ప్రయత్నాలు సాగుతున్నాయి. రెండు చేతుల మధ్య వెలుగులీనుతూండే జీవిత బీమా దీపాన్ని మార్కెట్‌లో అమ్మకానికి పెట్టేపనిని, ఆర్థికమంత్రిత్వశాఖకు అనుబంధంగా ఉండే ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌’ (దీపం) డెల్లాయిట్‌ కంపెనీకి అప్పగించింది. ఎల్‌ఐసీ శక్తిసామర్థ్యాల మదింపునుంచి, మదుపుదారులను ప్రభుత్వం తరఫున ఆకర్షించేవరకూ ఈ కంపెనీ సలహాదారు హోదాలో పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. 


కరోనాతో ఆర్థికరంగానికి ఊహించనంత నష్టం వాటిల్లిందంటూ కేంద్రపెద్దలు ఈ తరహా వాటాల విక్రయాలకు సార్థకత చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏవో ఇతరత్రా లక్ష్యాలతో జరుగుతున్నపనికి కరోనా ముసుగు తగిలిస్తున్నారు. ఒకసారి అమ్మేయాలని నిశ్చయించుకుంటే సదరు సంస్థ లాభాలతో కానీ, ప్రయోజనాలతో కానీ వారికి నిమిత్తం ఉండదనడానికి జీవిత బీమా నిలువెత్తు నిదర్శనం. ఎల్‌ఐసీని లిస్టింగ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లోనే ప్రకటించింది. వందశాతం ప్రభుత్వరంగ సంస్థ కనుక వాటాల విక్రయం దిశగా ఆస్తుల మదింపు బాధ్యత మిల్లిమాన్‌ సంస్థకు అప్పగించింది. ఈనెలాఖరులోగా జీవితబీమా నిజవిలువ నిర్థారణ జరగవచ్చు. ప్రభుత్వం ఐదుశాతం వాటాలు మాత్రమే విక్రయిస్తుందని అంటున్నప్పటికీ, ఎల్ఐసీ చట్టానికి చేపట్టిన సవరణలు మాత్రం అవధుల్లేని అమ్మకాలకు మార్గం సుగమం చేసేవే. ఐదేళ్లలోపు ఇరవై అయిదుశాతం అమ్మేయడం, ఆ తరువాత ప్రభుత్వ పెట్టుబడులు నలభైతొమ్మిదిశాతానికి పరిమితం కావడం ఈ సవరణల అసలు లక్ష్యం. ఇందుకుభిన్నంగా, ఐపీవోకు పోవడం అంటే ప్రైవేటీకరణ ఎంతమాత్రం కాదని పాలకులు పార్లమెంటులో తెలివిగా వాదిస్తున్నప్పటికీ, సంస్థ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులుపడుతున్నాయనడానికి ఇది రుజువు. లిస్టింగ్‌ వల్ల ఎల్‌ఐసీ నిజవిలువ తెలుస్తుందన్న వాదన సరైనది కాదు. ఎల్‌ఐసీ ఆస్తుల మార్కెట్‌ విలువ వాటి పుస్తక విలువకంటే అనేకానేకరెట్లు ఉంటుందనేది నిజం. ఒక అంచనా ప్రకారం దానికి ముప్పై లక్షలకోట్లకు మించిన ఆస్తులున్నాయి కనుక మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం దానికైతే లేదు. దాని నిరర్థక ఆస్తుల విలువ అరశాతంలోపే. ఏడాదికి నాలుగైదు లక్షలకోట్ల పెట్టుబడులు పెట్టగల రిజర్వునిధులున్నాయి. ఆపత్కాలంలో ప్రభుత్వాలే దీని సొమ్ముతో అనేక సంస్థలను కష్టనష్టాల్లో ఆదుకున్నాయి. వాటాలు అమ్మేయడం ద్వారా బోర్డులోకి ప్రైవేటు, విదేశీ పెట్టుబడిదారులను రప్పించి కోట్లాదిమంది పాలసీదారుల ప్రయోజనాలకంటే, మదుపుదారుల లాభాపేక్షకు పెద్దపీటవేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశం కావచ్చు. ఇంతవరకూ కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీల్లో, రైల్వేలు, జాతీయరహదారులు ఇత్యాది మౌలిక రంగాల్లో ముప్పైలక్షలకోట్లు పైబడి పెట్టుబడులు పెట్టి, ప్రజల సొమ్ము ప్రజాసంక్షేమానికే వినియోగిస్తున్న జీవితబీమా సంస్థ సదాశయానికి చిల్లులు పడుతున్నందుకు చింతించాలి.

Updated Date - 2021-07-01T06:16:31+05:30 IST