రాష్ట్రంలో 29 జిల్లాల్లో తీవ్రత

ABN , First Publish Date - 2021-04-05T08:09:25+05:30 IST

నిన్నమొన్నటి వరకు జిల్లాల్లో పదుల సంఖ్యలో నమోదైన కరోనా కేసులు ఇప్పుడు వందల్లోకి వెళ్తున్నాయి..

రాష్ట్రంలో  29 జిల్లాల్లో తీవ్రత

  • నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వారంలో కేసులు పది రెట్లు
  • మహారాష్ట్ర సరిహద్దు కావడమే కారణం!
  • నిజామాబాద్‌ జిల్లాలో కలకలం..పెళ్లికి వెళ్లిన 46 మందికి కరోనా
  • రెండు షాపింగ్‌ మాల్స్‌లో 89 మందికి
  • రాష్ట్రంలో కొత్తగా 1,321 పాజిటివ్‌లు
  • ఐదుగురి మృతి.. మొత్తం 1717కు చేరిక
  • గాంధీలో మరో 17 మంది మృత్యువాత
  • కరోనాతో 4 రోజుల్లో 56 మంది మృతి
  • ఏపీలో 1730 మందికి పాజిటివ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): నిన్నమొన్నటి వరకు జిల్లాల్లో పదుల సంఖ్యలో నమోదైన కరోనా కేసులు ఇప్పుడు వందల్లోకి వెళ్తున్నాయి.. వివాహాది శుభకార్యాలు వైరస్‌ వ్యాప్తికి కేంద్రాలవుతున్నాయి.. దుకాణాలు, రద్దీ ప్రాంతాలు కొవిడ్‌ విజృంభణకు వేదికలుగా మారుతున్నాయి.. మొత్తంగా రాష్ట్రంలో వైరస్‌ రెండో దశ తీవ్రత పెరుగుతోంది. 33 జిల్లాలకు గాను 29 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉంది. వీటిలో నిర్మల్‌ జిల్లాలో కేవలం వారం వ్యవధిలోనే కేసులు 12 రెట్లు, నిజామాబాద్‌ జిల్లాలో పదిరెట్లు పెరిగాయి. ఈ రెండూ.. కరోనా విజృంభిస్తున్న మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలే కావడం గమనార్హం. జగిత్యాల జిల్లాలో వారంలో పాజిటివ్‌ ఐదు రెట్లు, రంగారెడ్డి, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లో నాలుగు రెట్లు  అధికంగా నమోదయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండున్నర రెట్లు పెరిగాయి. కాగా, రాష్ట్రంలోని 25 జిల్లాల్లో వారం క్రితం వరకు పాజిటివ్‌లు పదిలోపే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు సగటున 40-50 కేసులు నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, జోగుళాంబ గద్వాల, ములుగు, వరంగల్‌ రూరల్‌లోనే పరిస్థితి అదుపులో ఉంది.


ఏడు రోజుల్లో 403 నుంచి.. 1,321కి

మార్చి 28న రాష్ట్రంలో 403 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. శనివారం ఆ సంఖ్య 1,321కి పెరిగింది. హైదరాబాద్‌లో 320, మిగిలిన అన్ని జిల్లాల్లో 1,001 పాజిటివ్‌లు వచ్చాయి. హైదరాబాద్‌ నగరంలో రెండ్రోజులు 200 పైగా వచ్చిన కేసులు.. తాజాగా 300 దాటాయి. మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఈ జిల్లాల్లో పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అంటున్నాయి. కాగా, మూడు రోజుల నుంచి మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. శనివారం ఐదుగురు చనిపోయారు. తాజా గణాంకాలతో మొత్తం కేసులు 3,12,140కు, మరణాలు 1,717కు పెరిగాయి. కొత్తగా 293 మంది డిశ్చార్జి అయ్యారు. రికవరీలు 3,02,500కు చేరాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,044, ప్రైవేటు ఆస్పత్రుల్లో 3,013 మంది చికిత్స పొందుతున్నారు. 7,923 యాక్టివ్‌ కేసులున్నాయి.


88 కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ విజృంభిస్తుండటంతో అన్ని జిల్లాల్లో కలిపి 88 కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైద్య శాఖ వెల్లడించింది. వీటిలో మొత్తం 8,114 పడకలను సిద్ధం చేశారు. ఈ కేంద్రాల్లో అత్యధికం ప్రభుత్వ విద్యాసంస్థలు, విశ్వ విద్యాలయాలు, గురుకుల పాఠశాలల్లో నెలకొల్పారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ కేంద్రాలతో పాటు హోటళ్లలోనూ సొంత ఖర్చుతో ఉండేలా కేంద్రాలను అందుబాటులో ఉంచారు.


ఏపీలో 1730 మందికి పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల వరకు మరో 1730 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి 4న కేవలం 102 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, నెల రోజుల వ్యవధిలో ఆ సంఖ్య ఏకంగా 1600 శాతం పెరిగి 1730కి చేరడం గమనార్హం. ఇక ఇదేకాలంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 871 నుంచి 10,300కి పెరిగింది. కొవిడ్‌ మరణాల రేటు కూడా ఒక శాతం దాటేసింది. మార్చి 4 నాటికి రాష్ట్రంలో మొత్తం 7,171 మరణాలు సంభవించగా, ఏప్రిల్‌ 4 నాటికి అవి 7,239కి చేరాయి. 


వివాహానికి హాజరై.. కరోనా బారినపడి’

నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్‌లో మూడు రోజుల క్రితం జరిగిన వివాహానికి హాజరైనవారిలో 46 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఈ పెళ్లికి వెళ్లినవారిలో 185 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా ఈవిషయం వెల్లడైంది. శుక్ర, శనివారాల్లో నిజామాబాద్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో పరీక్షలు నిర్వహించగా 75 మందికి పాజిటివ్‌ వచ్చింది. శనివారం మరో వ్యాపార సముదాయంలో 14 మందికి కరోనా నిర్ధారణ అయింది. కాగా, హైదరాబాద్‌ సంజీవరెడ్డినగర్‌లోని వ్యాపారి దగ్గర కూరగాయలు కొన్న వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో వ్యాపారి పరీక్షలు చేయించుకోగా అతడికీ వైరస్‌ సోకినట్లు స్పష్టమైంది. అతడి వద్ద కూరగాయాలు కొన్న దాదాపు పదిమందికి వైరస్‌ సోకింది. 



Updated Date - 2021-04-05T08:09:25+05:30 IST