ఫెయిలైన విద్యార్థులూ పాస్‌

ABN , First Publish Date - 2020-07-10T08:25:52+05:30 IST

ఫెయిలైన విద్యార్థులూ పాస్‌

ఫెయిలైన విద్యార్థులూ పాస్‌

ఇంటర్‌లోనూ బంపర్‌ ఆఫర్‌!

సెకండియర్‌ వారికే అవకాశం 

ఫస్టియర్‌వి మిగిలినా పాసే

గత మార్చిలో పరీక్ష రాసి ఉంటేనే..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం

1.47 లక్షల మందికి లబ్ధి

ఆగస్టు-1 నుంచి మెమోలు జారీ

10 రోజుల్లో రీకౌంటింగ్‌ ఫలితాలు


హైదరాబాద్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసింది. మార్చిలో జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పరీక్షలను రద్దు చేసినట్లు చెప్పారు. తాజా నిర్ణయంతో పాస్‌ అయిన వారికి కంపార్ట్‌మెంటల్‌గా ఉత్తీర్ణులైనట్లు మార్కుల జాబితాలో పేర్కొంటారని మంత్రి తెలిపారు. 1.47 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారన్నారు. ఇందులో 1,28,169 మంది సెకండియర్‌ విద్యార్థులు, 18,831 మంది సెకండియర్‌ పూర్తయి ఫస్ట్‌ ఇయర్‌ సబ్జెక్టులు మిగిలిన విద్యార్థులు ఉన్నారని వివరించారు. మార్కుల మెమోలను వచ్చే నెల 1 నుంచి కళాశాలల నుంచి పొందొచ్చని చెప్పారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను 10రోజుల తర్వాత అందజేస్తామన్నారు. 


ఇంటర్‌ విద్య పరిరక్షణ సమితి హర్షం

కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు మార్గదర్శకాలు విడుదల చేయాలని ఇంటర్‌ విద్య పరిరక్షణ సమితి కోరింది. సప్లిమెంటరీ పరీక్షల రద్దుపై సమితి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులందరినీ పాస్‌ చేయాలన్న నిర్ణయంపై ఇంటర్‌ విద్యాజేఏసీ, తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం హర్షం వ్యక్తం చేశాయి.

Updated Date - 2020-07-10T08:25:52+05:30 IST