‘ఇంటర్‌’పై అనిశ్చితి

ABN , First Publish Date - 2020-10-18T08:23:32+05:30 IST

‘ఇంటర్‌’పై అనిశ్చితి

‘ఇంటర్‌’పై అనిశ్చితి

వచ్చేనెల 2 నుంచి తెరుచుకోనున్న కాలేజీలు .. ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు విడుదల కాని షెడ్యూల్‌ 

టెన్త్‌ మార్కులు లేనప్పుడు సీట్ల కేటాయింపెలా?.. కొత్త జూనియర్‌ కాలేజీలపైనా అయోమయం


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ అడ్మిషన్లపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. నవంబరు 2 నుంచి జూనియర్‌ కాలేజీలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది వరకు విద్యార్థులు నేరుగా కాలేజీలకు వెళ్లి దరఖాస్తు చేసుకొని ప్రవేశం పొందేవారు. కానీ 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేపడతామని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇది జరిగి నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు షెడ్యూల్‌ ఇవ్వలేదు. దీనికోసం జూనియర్‌ కాలేజీల నుంచి హడావిడిగా సమాచారం అప్‌లోడ్‌ చేయించుకున్న బోర్డు ఆ తర్వాత మౌనం వహించింది. ఆన్‌లైన్‌ అడ్మిషన్లు చేపట్టేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. కరోనా నేపథ్యంలో గతేడాది పదో తరగతి చదివిన దాదాపు 6.5లక్షల మంది విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. టెన్త్‌లో మార్కులు ఇవ్వకపోవడంతో వీరికి ఇంటర్‌లో ప్రవేశమెలా కల్పిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


కొత్త కాలేజీలు ఎప్పుడు?

ప్రైవేట్‌రంగంలో కొత్త జూనియర్‌ కాలేజీల ఏర్పాటు కోసం ఈ ఏడాది మొదట్లో ఇంటర్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న విద్యాసంస్థలను జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిటీ(జేఏసీ)ల ద్వారా తనిఖీ చేయించారు. అయితే ఎక్కడెక్కడ, ఎన్ని కొత్త కాలేజీలు ఏర్పాటు చేస్తారో ఖరారు చేయలేదు. 


కార్పొరేట్లలో ఫీజుల వసూళ్లు 

ఆన్‌లైన్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌లో అసాధారణ జాప్యం నేపథ్యంలో ప్రైవేట్‌/కార్పోరేట్‌ జూనియర్‌ కాలేజీలు మాత్రం అనధికారికంగా విద్యార్థులను చేర్చుకోవడం ప్రారంభించాయి. షెడ్యూల్‌ రాగానే వారితో దరఖాస్తు చేయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అడ్మిషన్‌ ధ్రువీకరించాలంటే విద్యార్థులు ముందుగా మొత్తం ఫీజులో కొంతభాగాన్ని చెల్లించేలా చూసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలు ఇప్పటికే 50-60ు మేర అడ్మిషన్లు చేసుకున్నట్లు సమాచారం. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధనా మొదలుపెట్టారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేరే విద్యార్థులపరిస్థితి ఏమిటన్నది స్పష్టత లేదు. 


పరిమితి అమలుపై సందేహాలు 

ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా సామర్థ్యానికి మించి విద్యార్థులను చేర్చుకుంటున్నాయని భావించిన ఇంటర్‌ బోర్డు... జూనియర్‌ కాలేజీల్లో ఒక్కో సెక్షన్‌కు అడ్మిషన్లను 40కి తగ్గించింది. గతుడాది వరకు ఒక్కో సెక్షన్‌లో 88మంది వరకు చేర్చుకునే అవకాశం ఉంది. ప్రైవేట్‌ కాలేజీల్లో అడ్మిషన్లను తగ్గించిన బోర్డు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మాత్రం సెక్షన్‌కు 88 మందిని చేర్చుకునేలా నిర్ణయం తీసుకోవడంపై మేనేజ్‌మెంట్ల అసోసియేషన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ కాలేజీల్లో కొత్త నిబంధన అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కరోనా కారణంగా ఇప్పటికే చాలా పనిదినాలు తగ్గిపోయాయి. రాష్ట్రంలో 2020-21 అకడమిక్‌ క్యాలెండర్‌ ఇంతవరకు విడుదల చేయలేదు. కానీ తెలంగాణలో ఇంటర్‌బోర్డు మాత్రం అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. 


ఖరారు కాని ఫీజులు 

2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ట్యూషన్‌ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేయలేదు. గత విద్యా సంవత్సరపు ట్యూషన్‌ ఫీజులనే ఈసారి కూడా తీసుకోవాలని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సూచిస్తోంది. 

Updated Date - 2020-10-18T08:23:32+05:30 IST