ఆన్‌లైన్‌లో ఇంటర్‌ తరగతులు

ABN , First Publish Date - 2020-08-14T10:06:20+05:30 IST

కరోనా నేపథ్యంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంటర్‌ విద్యాబోధనకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

ఆన్‌లైన్‌లో ఇంటర్‌ తరగతులు

17నుంచి ప్రారంభానికి సన్నాహాలు

గ్యాడ్జట్ల కొనుగోలు పేద విద్యార్థులకు భారమే


ఖమ్మం ఎడ్యుకేషన్‌, ఆగస్టు 13: కరోనా నేపథ్యంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంటర్‌ విద్యాబోధనకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో కళాశాలలు తెరిచే అవకాశం లేకపోవడంతో వర్చువల్‌ తరగతులు, డిజిటల్‌ బోధన, కంప్యూటర్‌ సీడీలు, వెబ్‌నార్‌ తదితర సాంకేతికత పరిజ్ఞానంతో ఈ ఏడాది తరగతులకు శ్రీకారం చుట్టబోతోంది. జూన్‌ 1న ప్రారంభం కావాల్సిన ఇంటర్‌ తరగతులు, ప్రభుత్వ కళాశాలలు కొవిడ్‌ కారణంగా నేటికీ ప్రారంభం కాలేదు. దీంతో తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యల గురించి ఈ నెల 5న రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చ జరిగింది. అనంతరం అధికారులతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ప్రకటనతో ఈనెల  17 నుంచి ఆన్‌లైన్‌లో టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తారని తెలుస్తోంది.


ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 33ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న  అధ్యాపకులకు 15రోజుల పాటు ఆన్‌లైన్‌లో బోధనలకు అవసరమైన సాంకేతిక, నైపుణ్యాలను అందించేందుకు వెబ్‌నార్‌ ద్వారా శిక్షణ కూడా ఇచ్చారు. నిర్వాన్‌ ఎన్‌జీవో, కాగ్‌నిజెంట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల సహకారంతో, కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా ఈ శిక్షణనిచ్చాయి. యానిమేషన్‌, గ్రాఫిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన లాంటి పలు విభిన్న అంశాలతో ఇచ్చిన ఈ శిక్షణను ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న రెగ్యులర్‌, ఒప్పంద అధ్యాపకులలో 228 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 14 ప్రభుత్వ కళాశాలలకు చెందిన 221 మంది పూర్తి చేసుకున్నారు. సుమారు రెండు నెలల కాలం విద్యార్థులకు వృథా అయిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇంటర్‌ అధికారులు అధికారులు కసరత్తు చేస్తున్నారు.


2020-21 విద్యాసంవత్సరం ప్రారంభం కోసం కళాశాలల అప్లియేషన్‌ ప్రక్రియను ఇప్పటికే చేపట్టిన ఇంటర్‌ విద్యామండలి ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. సెప్టెంబరు 1నుంచి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ లాగిన్‌ సౌకర్యాన్ని కూడా కల్పించనుంది. అయితే ఆన్‌లైన్‌ తరగతుల వల్ల ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు కొంత వ్యయభారం కానుంది. ఇందుకోసం ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు సామాజికబాధ్యతగా సహకారం అందిస్తే కార్పొరేట్‌ కళాశాలలోపాటు ప్రభుత్వ విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలు వినే అవకాశం ఉంటుంది.


ప్రభుత్వ నిర్ణయం మంచిదే.. కేఎస్‌ రామారావు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ప్రభుత్వం ఆన్‌లైన్‌లో బోధనకు సన్నాహాలు చేయడం మంచి పరిణామమే. ఇప్పటికే  విద్యార్థులు తరగతుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వ కళాశాలలోని విద్యార్థులు పేదలు అయునందున వారికి లాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, రీచార్జిల రూపంలో భారం పడుతుంది. ఇందుకు కార్పొరేట్‌ రంగాలలోని వారు సామాజిక బాధ్యతగా వీరికి సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2020-08-14T10:06:20+05:30 IST