‘జగనన్న టౌన్ల’పై ఆసక్తి

ABN , First Publish Date - 2021-04-21T09:43:30+05:30 IST

పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయదలచిన ఎం.ఐ.జి. లేఅవుట్ల పట్ల (జగనన్న స్మార్ట్‌ టౌన్లు)3.79 లక్షలమందికిపైగా ఆసక్తిని కనబరచారు. సకల వసతులు, మౌలిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తామంటున్న...

‘జగనన్న టౌన్ల’పై ఆసక్తి

  • -ముందుకొచ్చిన 3.79 లక్షల మంది

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయదలచిన ఎం.ఐ.జి. లేఅవుట్ల పట్ల (జగనన్న స్మార్ట్‌ టౌన్లు)3.79 లక్షలమందికిపైగా ఆసక్తిని కనబరచారు. సకల వసతులు, మౌలిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తామంటున్న ఈ ప్రతిపాదిత లేఅవుట్లలోని ప్లాట్లను లాభనష్టాల్లేని ప్రాతిపదికన విక్రయిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కొంతకాలం క్రితం ప్రకటించారు. ఆ వెంటనే సదరు లేఅవుట్ల పట్ల ఎందరు ఆసక్తితో ఉన్నారనేది తెలుసుకుని, తదనుగుణంగా ఆయా నగరాలు, పట్టణాల్లో వాటిని అభివృద్ధి చేసే ఉద్దేశంతో పురపాలక శాఖ, పట్టణ ప్రణాళిక శాఖలు డిమాండ్‌ అసె్‌సమెంట్‌ సర్వేను ఈ నెలారంభం నుంచి చేపట్టాయి.


మంగళవారంతో ముగిసిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో మొత్తం 3,79,147 మంది ఎం.ఐ.జి. లేఅవుట్లలోని ఇళ్ల స్థలాల కొనుగోలుకు సుముఖంగా ఉన్నారని వెల్లడైంది. మూడు పరిమాణాల్లో (150 చదరపు గజాలు, 200 చ.గ, 240 చ.గ.) ప్లాట్లుండే ఈ లేవుట్లలో 150 చ.గ. ఇళ్ల స్థలాలపై 1,19,845 మంది, 200 చ.గ. ప్లాట్లపై 1,31,233 మంది, 240 చ.గ. ఇళ్ల స్థలాలపై 1,28,069 మంది ఆసక్తిని వ్యక్తీకరించారు. మూడు కేటగిరీలను కలిపి చూస్తే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విశాఖపట్నంలో అత్యధికంగా 85.541 మంది ఎం.ఐ.జి. లేఅవుట్ల పట్ల ఆసక్తిని ప్రదర్శించగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 17,418 మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. సంఖ్యాపరంగా చూస్తే.. విశాఖపట్నం జిల్లా తర్వాతి స్థానాల్లో తూర్పు గోదావరి, కర్నూలు, అనంతపురం, కృష్ణా, కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలు నిలిచాయి.

Updated Date - 2021-04-21T09:43:30+05:30 IST