ఆయిల్‌పాం సాగుపై ఆసక్తి

ABN , First Publish Date - 2022-03-18T06:31:30+05:30 IST

పంటల మార్పిడిపై అన్నదాతల్లో అవగాహన పెరుగుతోంది. ఉద్యానవన పంటల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటికే డ్రాగన్‌ ఫ్రూట్స్‌ వంటి విదేశీ పంటల వైపు కూడా దృష్టి పెడుతున్నారు.

ఆయిల్‌పాం సాగుపై ఆసక్తి

- జిల్లాలో 8,398 ఎకరాల్లో సాగు లక్ష్యం 

- ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు 

- విజ్ఞాన యాత్రలతో పంటలను పరిశీలించిన రైతులు 

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పంటల మార్పిడిపై అన్నదాతల్లో అవగాహన పెరుగుతోంది. ఉద్యానవన పంటల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటికే డ్రాగన్‌ ఫ్రూట్స్‌ వంటి విదేశీ పంటల వైపు కూడా దృష్టి పెడుతున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన పెంచుతున్న క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయిల్‌పాం సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఉండడంతో అయిల్‌ పాం సాగు చేయడానికి రైతులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వీలుగా భద్రాద్రి కొత్తకగూడెం జిల్లా అశ్వరావుపేట ప్రాంతంలోని అయిల్‌ పాం సాగును పరిశీలించడానికి విజ్ఞాన యాత్రలు కూడా చేపట్టారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ముందుగానే రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎఫ్‌జీపీ- పీయూ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి కేటాయించారు. 

- ముందుకు వచ్చిన 780 మంది రైతులు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8,398 ఎకరాల్లో ఆయిల్‌ పాం సాగు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 780 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో కాళేశ్వరం జలాలు, భారీ వర్షాల వల్ల భూగర్భజలాలు పెరగడం, అయిల్‌పాంకు సరిపడే వాతావరణం, తేమ శాతం, ఉండడంతో జిల్లాలో అయిల్‌ పాం సాగుకు అసక్తి చూపుతున్నారు. ఆంధ్రాలోని కోనసీమ ప్రాంతానికే పరిమితమైన విభిన్నమైన పంటలు  అయిల్‌పాం వంటి వాటివైపు జిల్లా ప్రజలు మొగ్గు చూపుతున్నారు

- ఎకరానికి 57 మొక్కలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నదాతలకు ఉద్యానవన శాఖ అధ్వర్యంలో అయిల్‌ పాం సాగుపై ఆసక్తిని పెంచారు. అయిల్‌ పాం సాగుకు ప్రభుత్వం నుంచి భారీ ప్రోత్సహకాలు సబ్సిడీలు ఉంటాయని ప్రచారం చేశారు. ప్రోత్సహకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయిల్‌ పాం సాగులో ఎకరానికి 57 మొక్కలు నాటుకోవచ్చు. ప్రతి మొక్కకు  9 మీటర్ల దూరం ఉండేవిధంగా చూసుకుంటారు. అయిల్‌పాం పెట్టిన మూడేళ్లలోపు పంట చేతికి వస్తుంది. ఎకరానికి ఒక సంవత్సరానికి 12 నుంచి 14 టన్నుల దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో ఒక టన్నుకు దాదాపు రూ. 20 వేల వరకు ధర పలుకుతుంది. రైతులకు ఎకరానికి మొదటి సంవత్సరం రూ.26 వేలు, రెండు, మూడో సంవత్సరాల్లో రూ. ఐదు వేల చొప్పున ప్రోత్సాహం అందనుంది. దీంతో పాటు డ్రిప్‌ సిస్టమ్‌ కోసం ఓసీ, బీసీలు 80 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం రాయితీ పొందవచ్చు. పంట ఎదుగుదల కాలంలో అంతర పంట సాగు చేసుకునే వీలుంది. అయిల్‌ పాం వైపు విడతలుగా రైతులను మళ్లించాలని భావిస్తున్నారు. సబ్సిడీ, ప్రభుత్వ ప్రోత్సాహాకాలపై పూర్తిస్థాయిలో స్పష్టత వస్తే మరికొంత మంది రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌లో అయిల్‌ ధరలు పెరుగుతండడంతో అయిల్‌పాం సాగుకు డిమాండ్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయి.


Updated Date - 2022-03-18T06:31:30+05:30 IST