రాయితీ ‘వడ్డీ’oచేదెప్పుడో ?

ABN , First Publish Date - 2020-10-22T07:08:11+05:30 IST

ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతువడ్డీ రాయితీ పథకం ఇప్పుడు సకాలంలో ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో రైతులకు, బ్యాంకులకు భారంగా మారింది.

రాయితీ ‘వడ్డీ’oచేదెప్పుడో ?

రైతుపై భారం పడుతున్న వడ్డీరాయితీ పథకం

అన్నదాతల ఎదురుచూపు

ప్రభుత్వం నుంచి సకాలంలో విడుదల కాని నిధులు

ఖమ్మం డీసీసీబీకి రూ.13.82కోట్ల బకాయి


ఖమ్మం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతువడ్డీ రాయితీ పథకం ఇప్పుడు సకాలంలో ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో రైతులకు, బ్యాంకులకు భారంగా మారింది. అసలు ఈపథకంలో అమల్లో ఉన్నదా లేదా అనే విషయంలో  స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో గమనార్హం. రుణమాఫీ పథకం ఆరేళ్లలో రెండుసార్లు వర్తించగా, గత నాలుగేళ్లకు సంబంధించిన వడ్డీరాయితీ మాత్రం నిధులు లేకపోవడంతో రైతులే వడ్డీలు చెల్లించే పరిస్థితి నెలకొంది. 


రూ. 13.82 కోట్ల కోసం డీసీసీబీ ఎదురుచూపు

ఖమ్మం డీసీసీబీకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీరాయితీ పథకం కింద సుమారు రూ.13.82కోట్లు రావాల్సి ఉంది.  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు, వాణిజ్య బ్యాంకులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వడ్డీరాయితీ పథకం కింద నిధులు రావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు రుణమాఫీపథకం 2014లో అమలుకాగా తిరిగి 2018లో కూడా వ్యవసాయ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. మిగిలిన కాలంలో రైతుకు వడ్డీరాయితీ అమలుకావాల్సి ఉంది. వానాకాలం, యాసంగి సమయాల్లో రైతులు రుణం తీసుకున్నప్పుడు లక్షరూపాయలలోపు ఏడాదిలోగా చెల్లిస్తే ఏడు శాతం వడ్డీరాయితీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలనుంచి జమకావాలి. ఇందులో మూడు శాతం వడ్డీ కేంద్రం ఇస్తుండగా నాలుగు శాతం వడ్డీ రాష్ట్ర ప్రభుత్వంనుంచి విడుదల అవుతుంది. 


కనిపించని పావలా వడ్డీ

లక్ష రూపాయలకంటే అదనంగా మరో రూ. రెండు లక్షలు రుణం తీసుకుని ఉంటే దానికి లక్షరూపాయల వరకు వడ్డీలేని రుణం అంతకుమించి మిగిలిన రెండు లక్షలకు పావలావడ్డీ చొప్పున రుణం పొందే సౌలభ్యం ఉంది. ఏడాదిలోగా చెల్లిస్తే పావలావడ్డీ పథకం అమలుకావాలి. అయితే సకాలంలో రుణాలు చెల్లించిన వారికే ఈవడ్డీరాయితీ పథకం అమలు చేస్తారు. సకాలంలో చెల్లించిన వారి నుంచి కూడా బ్యాంకులు రుణంతోపాటు వడ్డీలు కూడా కట్టించుకున్నాయి. ఇటు వాణిజ్య, సహకార బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రైతులు తీసుకున్న రుణాలు చెల్లించినవారు అసలుతోపాటు వడ్డీకూడా చెల్లించారు. 


జమకాని వడ్డీ డబ్బులు

రాష్ట్ర ప్రబుత్వం రుణమాఫీ సందర్భంగా విడతలవారీగా అసలు వడ్డీ జమచేస్తున్నప్పటికి వడ్డీరాయితీ పథకం కింద రుణాలు తీసుకున్న రైతులకు మాత్రం వడ్డీ సొమ్ము సకాలంలో జమచేయడంలేదు. దీంతో వడ్డీ ఎప్పుడు వస్తుందో కూడా బ్యాంకు అధికారులు చెప్పలేని పరిస్థితి ఉంది. ఇటీవల ఖమ్మం డీసీసీబీ మహాసభలో సైతం 13సహకార సంఘాల అధ్యక్షులు ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీరాయితీని విడుదల చేయించాలని మొరపెట్టుకున్నారు. దీంతో అసలు ఈపథకం అమల్లో ఉందా లేదా అన్నది స్పష్టత ఇవ్వాలని సూచించారు. 


రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించరా..?

కేంద్ర ప్రభుత్వం నుంచి వడ్డీరాయితీ నిధులు విడుదలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వంనుంచి విడుదల కావాల్సిన వడ్డీరాయితీ సొమ్ము విడుదల కావడంలేదని సమాచారం. దీంతో  వడ్డీరాయితీ పథకాన్ని సకాలంలో రైతులు అందుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో అన్నీజిల్లాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఈపథకం పకడ్బందీగా అమలు చేస్తే రైతులు కూడా ఏడాదిలో గా రుణాలు చెల్లించి వడ్డీరాయితీ పొందే సౌలభ్యం ఉంటుంది. వడ్డీరాయితీ పథకం అమల్లో జాప్యం కారణంగా రైతులు కూడా సకాలంలో రుణాలు చెల్లించక రుణమాఫీ వస్తుందన్న ఆశలతో అసలు రుణాలు చెల్లించకుండా కొందరు రైతులు ఉంటున్నారు. ఈపరిస్థితి వల్ల బ్యాంకులు కూడా వడ్డీ పూర్తిసొమ్ముతోనే రైతులనుంచి వసూలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు వడ్డీరాయితీ వస్తుందని చెబుతున్న బ్యాంకులు ఇకపై ఆపథకం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తీసుకున్న రుణం సకాలంలో వడ్డీతో చెల్లించాలని రైతులకు బ్యాంకులు సూచిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఒకవేళ వడ్డీరాయితీ విడుదలయితే జమచేస్తామని చెబుతున్నాయి


వడ్డీ పెండింగ్‌లో ఉంది..వేణుగోపాలరావు,  డీసీసీబీ సీఈవో 

వడ్డీరాయితీ కింద ఖమ్మం బీసీసీబీకి రూ.13.82కోట్లు బకాయి ఉంది. నాలుగేళ్లుగా వడ్డీరాయితీ పథకం కింద నిధులు రావడంలేదు. ప్రభుత్వంనుంచి విడుదలైతే రైతుల ఖాతాల్లో వడ్డీరాయితీ జమ చేస్తాం. 

Updated Date - 2020-10-22T07:08:11+05:30 IST