రైతన్నకు వడ్డీ పోటు!

ABN , First Publish Date - 2021-04-17T08:45:48+05:30 IST

అన్నదాతలకు వడ్డీపోటు తగులుతోంది. రూ.3 లక్షల్లోపు వ్యవసాయ రుణాలకు ఇప్పటిదాకా పావలా వడ్డీ మాత్రమే చెల్లించిన రైతులు... ఇప్పుడు మొత్తం 7 శాతం వడ్డీని చెల్లించాలనే హెచ్చరికలతో

రైతన్నకు వడ్డీ పోటు!

రాయితీలతో సంబంధం లేదు

కేంద్రం, రాష్ట్రాలు ఇస్తే వెనక్కిస్తాం

లేదంటే 11.75 శాతం వడ్డీ

పంట రుణాలపై బ్యాంకుల ఆదేశం

లక్షలోపు రుణానికి సున్నా వడ్డీ

2019 రబీ నుంచీ బకాయిలే

ఆపై రూ.2లక్షలకు 1 శాతమూ ఇవ్వని రాష్ట్రం


‘‘వినండహో వినండి! పంట రుణాలను గడువులోగా అసలు, వడ్డీ కట్టండి.  లేకపోతే సున్నా వడ్డీ రాయితీ వర్తించదు. పావలా వడ్డీ గురించి మేమేమీ చెప్పలేం. ప్రభుత్వం నుంచి వస్తే.. మీ ఖాతాల్లో జమ చేస్తాం. ఇప్పుడు మాత్రం మీరు వడ్డీతో సహా కట్టాల్సిందే. లేకుంటే... అపరాధ వడ్డీ 11.75ు పడుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం!’’ ఇవి అనేక ప్రాంతాల్లో జాతీయ బ్యాంకులు, సహకార సంఘాల అధికారులు రైతులకు చేస్తున్న హెచ్చరికలు. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి) 

అన్నదాతలకు వడ్డీపోటు తగులుతోంది. రూ.3 లక్షల్లోపు వ్యవసాయ రుణాలకు ఇప్పటిదాకా పావలా వడ్డీ మాత్రమే చెల్లించిన రైతులు... ఇప్పుడు మొత్తం 7 శాతం వడ్డీని చెల్లించాలనే హెచ్చరికలతో హతాశులవుతున్నారు. గడువులోపు చెల్లించకుంటే 11.75 శాతం అపరాధ వడ్డీ చెల్లించాలన్న హెచ్చరికలు వారిని మరింత భయపెడుతున్నాయి. రూ.3 లక్షల్లోపు వ్యవసాయ రుణాలకు బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇందులో... లక్షలోపు రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే సున్నా వడ్డీ వర్తిస్తుంది. మిగిలిన రెండు లక్షలకు సంబంధించి... కేంద్రం 3 శాతం, రాష్ట్రం 1 శాతం వడ్డీని భరిస్తాయి. ఇక... రైతు చెల్లించాల్సింది మిగిలిన 3 శాతం, అంటే పావలా వడ్డీ మాత్రమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా వడ్డీని చెల్లించినా, చెల్లించకపోయినా... బ్యాంకులు రైతు నుంచి పావలా వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నాయి. ఆ తర్వాత... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ సొమ్ము ఇచ్చినప్పుడు తీసుకుంటున్నాయి. ఇప్పటిదాకా ఉన్న ఈ పద్ధతిని బ్యాంకులు చాలాచోట్ల మార్చేశాయి. 


ఆపై మొత్తం కథ ఇది... 

రూ.3 లక్షల వరకు తీసుకునే పంట రుణంలో... మొదటి లక్షకు సున్నా వడ్డీ వర్తించేది. ఆ తర్వాతి రూ.రెండు లక్షలను కూడా ఏడాదిలోపు చెల్లిస్తే... 3 శాతం కేంద్రం, 1 శాతం రాష్ట్రం, 3 శాతం రైతు చెల్లిస్తే సరిపోయేది. అంటే, ‘పావలా వడ్డీ’తో వ్యవసాయ రుణం! కేంద్రం వాటా 3 శాతం, రాష్ట్రం వాటా 1 శాతం చెల్లింపులతో సంబంధం లేకుండా... రైతులు పావలా వడ్డీ కడితే సరిపోయేది. కానీ... వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక శాతం వడ్డీ భరించేది లేదని తేల్చింది. జగన్‌ సర్కారు లెక్కప్రకారం... బాగా పెద్ద రైతులే రూ.3 లక్షల పంట రుణం తీసుకుంటారట! వారికి ఒక్కశాతం వడ్డీని వారు భరించగలరంటూ... దానిని ఎగ్గొట్టారు. కేంద్రం మాత్రమే 3 శాతం రాయితీ భరిస్తోంది.


మిగిలిన 4 శాతాన్ని రైతులే భరించాల్సి వస్తోంది. ఇప్పుడు... బ్యాంకులు నిర్బంధంగా మొత్తం 7 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. కేంద్రం తన వాటా చెల్లిస్తే... అప్పుడు ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నాయి. బ్యాంకులు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా... ప్రస్తుతం రైతులు 7ు చొప్పున ఏడాదికి రూ.21 వేలు వడ్డీ కట్టాల్సి వస్తోంది. అదికూడా ఏడాది గడువులోపు చెల్లించకపోతే  అపరాధ వడ్డీ 11.75ుదాకా విధిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే రాయితీ వాణిజ్య బ్యాంకులకు మాత్రమే జమ అవుతోంది. సహకార బ్యాంకుల విషయంలో దీనిపై స్పష్టత లేదు. మరోవైపు... పంట రుణాల బకాయిలుంటే.. కొన్ని బ్యాంకులు కొత్తగా అప్పు ఇవ్వడంలేదు. దీంతో రైతులు నానా తిప్పలు పడి, వడ్డీతో సహా బాకీ మొత్తం కట్టాల్సి వస్తోంది. కొన్ని సహకార సంఘాలు వడ్డీ మాత్రం కట్టించుకుని, పంట రుణాలను రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు సమాచారం.



ఒక్కశాతానికీ జెల్ల...

లక్షలోపు పంట రుణాలను తీసుకున్న తేదీ నుంచి సరిగ్గా ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే రైతుపై ఎలాంటి వడ్డీ భారం పడేది కాదు. కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వడ్డీని భరించేవి. ఇప్పుడు... దీనినే ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం’ అని పేరు పెట్టారు. అయితే... గడువులోపు రైతు అసలుతోపాటు వడ్డీ కూడా తానే చెల్లించాలనే షరతు విధించారు.


2019-20 పంట రుణాలను రైతులు వడ్డీతో సహా చెల్లించాల్సి వచ్చింది. 2020-21 ఖరీఫ్‌, రబీ పంట రుణాలనూ వడ్డీతో సహా కట్టారు. కానీ... ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన 4 శాతం వడ్డీని జమ చేయలేదు. తాజాగా... గురువారం సున్నా వడ్డీ పథకం కింద రూ.246 కోట్లు విడుదల చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన నిధులను ఇప్పుడు జమ చేశారు. దీంతో... సున్నా వడ్డీ పథకం ఉన్నా లేనట్లే అన్నట్లుగా తయారైంది.

Updated Date - 2021-04-17T08:45:48+05:30 IST