Abn logo
Sep 27 2021 @ 00:03AM

నా రాజీనామాతోనే మహిళలకు వడ్డీలేని రుణాలు

మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

 - నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు పోరాడుతా..

- మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌

వీణవంక, సెప్టెంబరు 26: తన రాజీనామాతోనే హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నారని  మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం మండలంలోని బొంతుపల్లి గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ముదిరాజ్‌, గౌడ కులస్థులు 150 మంది బీజేపీలో చేరారు. అనంతరం ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ మహిళలపై ప్రేమ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు వారి తరుపున పోరాటం చేస్తానని, నిరుద్యోగులకు తానే నాయకత్వం వహిస్తానన్నారు.    తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశ పడ్డ నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. 2017లోనే కొన్ని పత్రికల్లో వచ్చిన అంశాలసై స్పందించి గులాబీ ఓనర్లు మేమే అని మాట్లాడిన మాటలు విన్న కేసీఆర్‌ తనను కంట్లో పెట్టుకొని ఈ విధంగా చేశారన్నారు. గడ్డి పోచలాగా పోతాడని అనుకుంటే గడ్డపార లాగా అయ్యానని అన్నారు. దళితులపై ప్రేమ ఉంటే అకౌంట్లలో వేసిన 10లక్షలపై కలెక్టర్‌, బ్యాంకు అధికారుల పెత్తనం తీసివేయాలన్నారు. తాను రాజీనామా చేస్తేనే ఇక్కడ సర్పంచ్‌లకు నిధులు వచ్చాయన్నారు. మంత్రి హరీష్‌రావు దుబ్బాక, కొండగల్‌, హుజూరాబాద్‌ అంతట నేనే అన్నట్టు వ్యవహరిస్తున్నాడని, హుజూరాబాద్‌ ప్రజలు కర్రు కాల్చి వాత పెడుతారన్నారు. రాష్ట్ర ప్రజలు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నారని, రానున్న ఉప ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు పుప్పాల రఘు, వాసుదేవరెడ్డి, ఆదిరెడ్డి, నర్సింహారాజు, పెద్ది మల్లారెడ్డి, మారముల్ల కొంరయ్య, రమేష్‌, గౌతమ్‌రెడ్డి, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రెడ్డి, నరేష్‌గౌడ్‌, ఎల్లారెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, సమ్మయ్య పాల్గొన్నారు.

- చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఈటల

జమ్మికుంట: పట్టణంలోని పద్మశాలి వీధిలో బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరైన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.