B.1.351.. కరోనా వేరియంట్లకు ఇంత విచిత్రమైన పేర్లు ఎందుకంటే..

ABN , First Publish Date - 2021-06-15T18:36:08+05:30 IST

బి.1.351, బి.1.617.2.. ఇలాంటి పేర్లు సామాన్యులకు ఎలా గుర్తుంటాయి? అసలు గుర్తుచుకోవడం సాధ్యమా? సైంటిస్టులంటే వారి వృత్తే అది కాబట్టి ఇలాంటి పేర్లను సులభంగా గుర్తుంచుకుంటారు. కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి? అందుకే వీటికి పేర్లు పెట్టాలి.

B.1.351.. కరోనా వేరియంట్లకు ఇంత విచిత్రమైన పేర్లు ఎందుకంటే..

ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని కరోనా వేరియంట్లు ఉన్నాయో తెలుసా? వేలాది వేరియంట్లు ప్రపంచాన్ని కప్పేశాయట. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎప్పుడో చెప్పింది.  ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. ఒక్కోదేశంలో ఒక్కో మ్యూటేషన్‌కు గురవుతూ సైంటిస్టులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ క్రమంలో వీటిని గుర్తించడానికి పేర్లు పెట్టక తప్పదు. మరి ఇలాంటి వైరసులకు పేర్లు ఎలా పెట్టాలి? ఏ ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి? ఈ రంగంలో నిష్ణాతులు ఏం చెప్తున్నారు? ప్రపంచంలో ఉన్న వేలాది వేరియంట్లను ఎలా గుర్తించాలి?


బి.1.351, బి.1.617.2.. ఇలాంటి పేర్లు సామాన్యులకు ఎలా గుర్తుంటాయి? అసలు గుర్తుచుకోవడం సాధ్యమా? సైంటిస్టులంటే వారి వృత్తే అది కాబట్టి ఇలాంటి పేర్లను సులభంగా గుర్తుంచుకుంటారు. కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి? అందుకే వీటికి పేర్లు పెట్టాలి.  కరోనా వైరస్‌ను కొవిడ్-19 వ్యాధికి కారణమైన వైరస్‌ను అమెరికాలో ట్రంప్ ఉండగా ‘చైనా వైరస్’ అని పదేపదే అన్నారు. దీంతో ఏమైంది? అమెరికాలో తూర్పు ఆసియన్లపై విద్వేష దాడులు పెరిగాయి. అలాగే భారత్, సౌతాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా వైరస్ రకరకాల మ్యూటేషన్లకు గురైంది. వీటికి సరైన పేర్లు పెట్టకపోతే చైనీయులకు ఎదురైన అనుభవాలే మిగతా దేశప్రజలూ ఎదుర్కోవాల్సి వస్తుంది. 1800ల్లో కూడా ఇలాంటి తప్పులే జరిగాయి. ప్రస్తుతం మనందరికీ తెలిసిన ‘కలరా’ వ్యాధి భారత్‌ నుంచి ఇంగ్లండ్‌కు పాకింది. దాంతో ఇంగ్లండ్ పత్రికలు దీన్ని ‘ఇండియన్ కలరా’ అని సంబోధించేవారు. అప్పట్లో దీని బొమ్మ గీసిన వారు కూడా కలరా తలపాగా కట్టుకొని ఉన్నట్లు చిత్రించారు. దీనివల్ల భారతీయులపై వివక్ష పెరిగింది. ఇలా ఒక వ్యాధికి దేశాల పేర్లు పెట్టడం సరికాదు. కానీ వీటిని గుర్తించడానికి ఏదో ఒక పేరు పెట్టాలి. లేదంటే జనాల్లో దేశాల పేర్లతో అవి పాపులర్ అయిపోతాయి. ప్రస్తుతం ప్రపంచంలో వేలకొద్దీ వైరస్ వేరియంట్లు ఉన్నాయని వీటిని గుర్తించాలంటే పేర్లు పెట్టాల్సిందేనని నిపుణులు అంటున్నారు. ఈ పేర్లు భిన్నంగా ఉండాలి. సదరు వేరియంట్ గురించి వివరాలు చెప్పాలి. పలకడానికి, రాయడానికి, గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఉండాలి.


ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న డబ్ల్యూహెచ్‌వో కరోనా వేరియంట్లకు సింపుల్‌గా వీ1, వీ2, వీ3.. ఇలా పేర్లు పెట్టాలని అనుకుందట. కానీ ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని మార్చుకొని ఆల్ఫా, బీటా, డెల్టా వంటి పేర్లు పెట్టింది. బి.1.351 ఇది సౌతాఫ్రికాలో తొలిసారి బయటపడిన వేరియంట్.  ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ప్రమాదకర వేరియంట్లలో ఇదీ ఒకటి. ఈ క్రమంలో అమెరికాలో బి.1.315 అనే వేరియంట్ విజృంభిస్తోందని వార్తలు వచ్చాయి. చాలా మంది ఈ రెండు వేరియంట్ల విషయంలో తికమకపడ్డారు. దీంతో సౌతాఫ్రికాలో బయటపడిన వేరియంట్‌ను ‘సౌతాఫ్రికా వేరియంట్’ అనడం ప్రారంభించారు. కానీ ఇది ఈ దేశంలో పుట్టిందనడానికి ఆధారాల్లేవు. అలాగే ఇది ఇప్పుడు 48 దేశాల్లో బయటపడింది. అలాంటప్పుడు దీన్ని సౌతాఫ్రికా వేరియంట్ అని ఎలా అంటారు? అని కొందరు ప్రశ్నించారు. అసలు ఈ ‘బి.1’ అంటే ఏంటో తెలుసా? ఒక వేరియంట్ పేరు ఇలా మొదలైందంటే.. ఇది ఇటలీలో విజృంభించిన కరోనా వేరియంట్ తాలూకా అని. నేరుగా చైనా నుంచి వచ్చిన వైరస్ కాదన్నమాట. ఇటలీలో విలయంలో ఈ కొత్త వేరియంట్ల మూలాలు దాక్కొని ఉన్నాయని ఈ ‘బి.1’ చెప్తుంది. ఇలా ఒక రకం మ్యూటేషన్ల సంఖ్య భారీగా పెరిగిపోయినా, మరో అంకె లేదంటే డాట్‌ పెట్టడం కష్టమని భావించినా సైంటిస్టులు మరో అక్షరంతో కొత్త సిరీసును ప్రారంభిస్తారు. ఇలా ఇంగ్లీషు అక్షరమాలను కూడా శాస్త్రవేత్తలు వేరియంట్లకు పేర్టు పెట్టడంలో ఉపయోగించుకుంటారు.  అయితే సామాన్యులకు ఇలాంటి పేర్లు గుర్తుపెట్టుకోవడం పెద్ద తలనొప్పి వ్యవహారంలా తోస్తుంది.


ఇలా దేశాల పేర్లు పెట్టడం భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురిచేస్తుందనే భావనతో చాలా మంది వేరియంట్ల పేర్లు పెట్టడంపై సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. తుఫానుల పేర్లు, పక్షులు, గ్రీకు అక్షరాలు, ఇతర జంతువులు ఇలా వచ్చిన సలహాలు కోకొల్లలు. అలాగే అన్ని వేరియంట్లకూ పేర్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వ్యాక్సిన్ పనితనాన్ని తగ్గించే ఈ484కే వేరియంట్‌కు ‘ఈక్’(Eeek) అని పేరు పెట్టారు. అయితే ఇది ప్రపంచంలో వెలుగు చూసిన చాలా వేరియంట్లలో కనిపించింది. అంటే దీనికి ప్రత్యేకంగా పేరు అక్కర్లేదు. ఇలా అనవసరమైన వేరియంట్లకు పేర్లు పెట్టడం దండగ అనే వాదన కూడా ఉంది. ‘‘రేప్పొద్దున చూస్తే డబ్ల్యూహెచ్‌వో పెట్టిన పేర్లతో నిండిపోయిన జాబితా ఉండి, దానిలో కేవలం మూడే ఇంపార్టెంట్ అయితే చాలా చిరాగ్గా ఉంటుంది’’ అని ఒక డాక్టరు చెప్పారు. అదే విధంగా వేరియంట్లకు పెట్టే పేర్లు సైంటిస్టులకు, సామాన్యులకూ ఆమోదయోగ్యంగానూ ఉండాలి. అదే ఈ పేర్లు పెట్టేవారి ముందు ఉండే అతిపెద్ద సవాల్.



Updated Date - 2021-06-15T18:36:08+05:30 IST