Telangana BJPలో డిష్యుం డిష్యుం.. ఆ ఇద్దరు త్వరలో టీఆర్ఎస్‌లోకి.. ఇదే జరిగితే...!

ABN , First Publish Date - 2021-08-06T12:21:45+05:30 IST

Telangana BJPలో డిష్యుం డిష్యుం.. ఆ ఇద్దరు త్వరలో టీఆర్ఎస్‌లోకి.. ఇదే జరిగితే...!

Telangana BJPలో డిష్యుం డిష్యుం.. ఆ ఇద్దరు త్వరలో టీఆర్ఎస్‌లోకి.. ఇదే జరిగితే...!

హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్‌ : మునిసిపల్‌ ఎన్నికల సమయంలో మంత్రి సబితారెడ్డి అనుచరులను ఓడించి బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో ఏకంగా పది స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీకి ఇప్పుడు అంతర్గత పోరు సమస్యగా మారింది. అల్మాస్‌గూడలో ఇద్దరు బీజేపీ కార్పొరేటర్ల మధ్య జరిగిన ఫ్లెక్సీ వివాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు అసభ్య పదజాలంతో దూషించుకోవడం, పరస్పరం దాడి చేసుకోవడం, పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో పవిబేధాలు బట్టబయలయ్యాయి.


ఒకే గ్రామంలో.. ఒకే పార్టీ నేతల మధ్య..

అల్మాస్‌గూడలో పక్క పక్క డివిజన్‌కు చెందిన ఒకే పార్టీ కార్పొరేటర్ల మధ్య కొంత కాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. ఓ కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులు  ఇబ్బడి ముబ్బడిగా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ మరో కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులు అధికారులకు, మేయర్‌కు ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొత్తగా నిర్మించే గృహాల వద్ద, కాంట్రాక్టర్ల వద్ద వసూళ్లు చేస్తున్నారని మరో కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దాంతో వారి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. గురువారం అల్మాస్‌గూడలో బోనాల పండుగ ఉండగా, బుధవారం మధ్యాహ్నం కోమటికుంట కట్ట వద్ద శ్రీఉమామహేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఫ్లెక్సీలు కట్టే  సందర్భంగా సదరు కార్పొరేటర్ల కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ తలెత్తింది. తాను ముందుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే దానిపైనే మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారంటూ ఓ కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులు మరో కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. ఇరువర్గాల మధ్య కాసేపు దూషణల పర్వం కొనసాగింది. అనంతరం మీర్‌పేట్‌ పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అల్మాస్‌గూడలో బీజేపీ తరపున గెలిచిన ఇద్దరూ మహిళలే. వారి కుటుంబ సభ్యుల మధ్య వివాదం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వారి మధ్య రాజీ కుదిర్చే దిశలో కొందరు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.


కదిలిన గులాబీ దళం..

కార్పొరేషన్‌లోని నాలుగు గ్రామాల్లో బీజేపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో నాదర్‌గుల్‌లో నాలుగు స్థానాల్లో గెలిచిన బీజేపీ అల్మాస్‌గూడ, గుర్రంగూడ, బడంగ్‌పేట్‌ గ్రామాల్లో రెండేసి స్థానాలను దక్కించుకుంది. వారిలో ఒకరిద్దరు టీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షితులైనప్పటికీ పార్టీ పెద్దలు అప్రమత్తమై వారిని తాత్కాలికంగా నిలువరించగలిగారు. బీజేపీలోని అంతర్గత పోరు బహిర్గతమవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. బీజేపీలోని అసంతృప్త నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఒకరిద్దరు బీజేపీ కార్పొరేటర్లు గులాబీ గూట్లోకి చేరే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.

Updated Date - 2021-08-06T12:21:45+05:30 IST