శింగరకొండలో అంతర్యుద్ధం

ABN , First Publish Date - 2021-06-16T07:18:08+05:30 IST

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ పాలక మండలి, అధికారుల మధ్య అంతర్యుద్ధం నెలకొంది.

శింగరకొండలో అంతర్యుద్ధం
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం

ట్రస్ట్‌బోర్డు, అధికారుల మధ్య మనస్పర్థలు 

అభివృద్ధి పనులపై ప్రభావం

అద్దంకి, జూన్‌ 15 : శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ పాలక మండలి, అధికారుల మధ్య అంతర్యుద్ధం నెలకొంది. ఈ ప్రభావం  అభివృద్ధి పనులపై పడే అవకాశం  ఉండటంతో భక్తులు ఆందోళన చెందుతు న్నారు. శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి సుమారు 14 సంవత్సరాల తరువాత ఏర్పడింది. కోట శ్రీనివాసకుమార్‌ చైర్మన్‌గా మూడు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించింది. గత రెండు సంవత్సరాలుగా దేవాలయం వద్ద దాతల సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.  


ఆరంభం నుంచీ మనస్పర్థలు 

ఆలయ చైర్మన్‌గా శ్రీనివాసకుమార్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందని భావించారు. అయితే చైర్మన్‌, పాలకమండలి సభ్యులకు.. దేవస్థానం ఈవో, అసిస్టెంట్‌ కమిషనర్‌ కూడా అయిన శ్రీనివాసరెడ్డిల మధఽ్య ఆరంభం నుంచి మనస్పర్థలు వచ్చాయి. ‘ఎవరికి వారే యమునాతీరే’ అన్న విధంగా సాగుతున్నారు. ఈక్రమంలో పాలకమండలి ఏర్పడి మూడు నెలలు  గడిచిన తరువాత తొలి సమావేశం సోమవారం జరిగింది. కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పటి వరకూ సమావేశం నిర్వహించలేదని చెబుతున్నా అభిప్రాయభేదాలే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


ఈవో ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న భావనలో పాలక మండలి 

 అటు చైర్మన్‌, ఇటు ఈవోల మధ్య అంతర్యుద్ధం సిబ్బందిపై కూడా పడింది. ప్రమాణ స్వీకారం రోజు నుంచి కూడా ఈవో తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యవహ రిస్తున్నారన్న అభిప్రాయాన్ని పాలకమండలి వ్యక్తం  చేస్తోంది. ఈనేపథ్యంలో తనకు తెలియకుండా దేవాల యంలో ఏ పనీ జరగకూడదన్న భావనలో చైర్మన్‌ ఉండగా.. పాలన, పర్యవేక్షణ విషయంలో పాలకమండలి జోక్యం ఉండకూడదన్న భావనలో ఈవో ఉన్నారు. దీంతో పాలకమండలి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వీరి మధ్య ప్రారంభమైన అంతర్యుద్ధం ముదిరిపాకాన పడింది.

 

21న ప్రత్యేక సమావేశం

ఈ క్రమంలోనే గత మూడు నెలల్లో జరిగిన జమాఖర్చులకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు ఈనెల 21న ప్రత్యేకంగా పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసినట్లు చైర్మన్‌  కోట శ్రీనివాసకుమార్‌ ప్రకటించారు. అదే సమయంలో సిబ్బంది విధులను మార్చాలని తీర్మానం చేశారు. అయితే పాలకమండలి చేసిన తీర్మానాలు ఈవో సంతకం లేకుండా చెల్లవని.. సిబ్బంది, ఆర్థిక సంబంధమైన తీర్మానాలు చేసే అధికారం పాలకమండలికి లేదని ఈవో శ్రీనివాసరెడ్డి ప్రకటించటంతో దేవాలయంలో పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ విషయాలను ఇరువురు పైస్థాయికి తీసుకుపోయి తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పాలకమండలి, అధికారుల మధ్య ఏర్పడ్డ బేధాభిప్రాయాలు చినికిచినికి గాలివానగా  మారి  అభివృద్ధి పనులపై పడే  అవకాశం  ఉందని  పలువురు అభి ప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి  పాలకవర్గం, అధికారుల మధ్య సయోధ్య కుదిర్చి సమన్వయంతో ముందుకు సాగే విధంగా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.


Updated Date - 2021-06-16T07:18:08+05:30 IST