అంతర్జాతీయ విమానాలను నడుపుతాం: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-06-03T23:59:23+05:30 IST

కోవిడ్-19 పరిస్థితులు ఒకింత సాధారణ స్థితికి వచ్చి, ప్రజలకు ఎలాంటి ముప్పూ లేకుంటే త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులను..

అంతర్జాతీయ విమానాలను నడుపుతాం: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: కోవిడ్-19 పరిస్థితులు ఒకింత సాధారణ స్థితికి వచ్చి, ప్రజలకు ఎలాంటి ముప్పూ లేకుంటే త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించే ఆలోచన చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వరుస ట్వీట్లలో ఆయన తెలిపారు. ఏ దేశాలకు విమాన సర్వీసులు నడపాలనే దానితో పాటు విదేశీ పర్యాటకులను అనుమతించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.


'వందే భారత్ మిషన్‌' మూడో దశలో మరిన్ని విమానాలను కూడా చేర్చనున్నామని, ఈ విమానాల్లో విదేశాలకు వెళ్లగోరే వారిని ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్ర మంత్రి తెలిపారు. దేశానికి రావాలనుకునే వారు, ఇక్కడి నుంచి వెళ్లాలనుకునే వారు కూడా ఈ విమాన సర్వీసులను ఉపయోగించుకోవచ్చని అన్నారు. 'వందే భారత్ మిషన్' కింద మే 6 నుంచి 312 విమానాల్లో 57,000 మంది పౌరులను వివిధ దేశాల నుంచి తీసుకువచ్చామని, 314 అవుట్ బోర్డ్ విమానాల్లో భారతీయులు, ఎన్ఆర్ఐలు, ఓసీఐ కార్డు హోల్టర్లు ప్రయాణించారని చెప్పారు.


కేంద్ర పౌర విమానయాన శాఖ జారీచేసిన ఆదేశాల మేరకు మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. కరోనా వైరస్ ‌వ్యాప్తిని నిరోధించేందుకు విమానాశ్రయాల్లోనే ప్రయాణికులను, వారి లగేజీని తనిఖీ చేస్తున్నామని అన్నారు.

Updated Date - 2020-06-03T23:59:23+05:30 IST