Omicron భయం.. ఆకాశాన్నంటిన విమాన చార్జీలు.. రెట్టింపు బాదుడుతో ప్రయాణికుల బేజారు!

ABN , First Publish Date - 2021-12-04T16:00:39+05:30 IST

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. శరవేగంగా ప్రబలుతున్న ఈ వేరియంట్ ఇప్పటికే 38 దేశాలకు పాకింది.

Omicron భయం.. ఆకాశాన్నంటిన విమాన చార్జీలు.. రెట్టింపు బాదుడుతో ప్రయాణికుల బేజారు!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. శరవేగంగా ప్రబలుతున్న ఈ వేరియంట్ ఇప్పటికే 38 దేశాలకు పాకింది. దీంతో చాలా దేశాలు మళ్లీ ప్రయాణాలపై ఆంక్షలు మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో విమాన చార్జీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ప్రయాణ ఆంక్షలు మరింత కఠినతరం అవ్వకముందే ప్రయాణాలు చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అదే సమయంలో క్రిస్మస్ సీజన్ కావడం కూడా విమాన చార్జీలు భారీగా పెరగడానికి కారణమైంది. అంతర్జాతీయ ప్రయాణాలకు డిమాండ్ ఏర్పడి విమాన టికెట్ల రేట్లు ఆకాశాన్నంటాయి. ఒమైక్రాన్ భయం నేపథ్యంలో భారత్ నుంచి అధిక రద్దీ ఉండే యూఏఈ, అమెరికా, బ్రిటన్, కెనడాలకు విమాన చార్జీలు రెండింతలు అయ్యాయి.  


తాజా సమాచారం ప్రకారం న్యూఢిల్లీ నుంచి కెనడాలోని టోరంటోకి ఇంతకుముందు కనీస ఛార్జీ రూ.80వేలుగా ఉండగా ఇప్పుడది రూ. 2.37 లక్షలకు చేరింది. అలాగే ఢిల్లీ టు లండన్‌కు గతంలో విమాన చార్జీ రూ. 60గా ఉంటే.. ఇప్పుడు రూ. 1.20 లక్షలు అయింది. ఢిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు ఇంతకుముందు టికెట్‌ చార్జీ రూ. 20 వేలుగా ఉండేది. ప్రస్తుతం అది రూ. 33 వేల వరకు ఉంది. అటు భారత్ నుంచి అగ్రరాజ్యం అమెరికాలోని ప్రధాన నగరాలకు విమాన ఛార్జీలు గతంలో రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షలు ఉండేవి. ఇప్పుడు కనీసం రూ.1.70 లక్షలకు తగ్గడం లేదు. అక్కడి ప్రధాన నగరాలైన వాషింగ్టన్‌ డీసీ, చికాగో, న్యూయార్క్‌ సిటీకి అయితే విమాన రేట్లు వంద శాతం పెరిగాయి. ఇక బిజినెస్‌ క్లాస్‌ టిక్కెట్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏకంగా రూ.6 లక్షలకు చేరుకున్నాయి. కాగా, ఈ రెట్టింపు బాదుడుతో ప్రయాణికులు బేజారవుతున్నారు.  

Updated Date - 2021-12-04T16:00:39+05:30 IST