తస్మాత్ జాగ్రత్త.. మాటల్లో పెట్టి.. మాయచేసేస్తారు!

ABN , First Publish Date - 2021-06-06T12:22:28+05:30 IST

ఆ తర్వాత అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌, వహీద్‌ రాజాబ్‌ అనే ఇద్దరు ఆరు నెలల క్రితం

తస్మాత్ జాగ్రత్త.. మాటల్లో పెట్టి.. మాయచేసేస్తారు!

  • దృష్టిమరల్చి దోపిడీకి పాల్పడుతున్న.. ఇరానీ దొంగల ముఠా
  • ఆటకట్టించిన రాచకొండ పోలీసులు
  • ముగ్గురి అరెస్టు, 811 యూఎస్‌ డాలర్లు,
  • 35వేల నగదు, కారు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ : ఫారెన్‌ కరెన్సీని ఎలా మార్చుకోవాలంటూ అమాయకంగా అడిగి బుట్టలో వేసుకుని మాటల్లో పెట్టి అందినకాడికి నగదును దోచేస్తారు. ముగ్గురు సభ్యులున్న ఈ ఖతర్నాక్‌ ఇరానీ గ్యాంగును రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి ఒక కారు, రూ. 35వేల నగదు, 811 యూఎస్‌ డాలర్లను స్వాధీనం చేసుకున్నా రు. ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. 


అక్రమంగా ఇండియాలో ఉంటూ.. 

ఇరాన్‌ దేశం టెహ్రాన్‌కు చెందిన నజీర్‌ అబిది 18 నెలల క్రితం ఈ వీసాపై ఇండియాకు వచ్చాడు. గడువు ముగిసినా అక్రమంగా ఢిల్లీలోనే ఉంటున్నాడు. ఆ తర్వాత అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌, వహీద్‌ రాజాబ్‌ అనే ఇద్దరు ఆరు నెలల క్రితం విజిటింగ్‌ వీసాపై వచ్చి నజీర్‌తో పాటు ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ముగ్గురు కలిసి హైదరాబాద్‌కు మకాం మార్చారు. టోలీచౌకీ పారామౌంట్‌ కాలనీలో ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. చాకచక్యంగా మోసాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.


ఒక్కనెలలో 5 మోసాలు.. 

ఇరానీ గ్యాంగు ఒక్క నెలలోనే ఐదు మోసాలకు పాల్పడింది. టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వద్ద స్విఫ్ట్‌డిజైర్‌ కారును అద్దెకు తీసుకుని అమాయకుల్లా వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి అనుకున్న ప్రకారం వారిని మాటల్లో దింపి ఒకచోట డబ్బు లెక్కిస్తూ తస్కరిస్తారు. మరోచోట  బిజీగా ఉన్న వ్యాపారి వద్దకు వెళ్లి ఆయన్ను మాటల్లోకి దింపి చాకచక్యంగా గల్లాపెట్టెలోని డబ్బును కాజేస్తారు. ఇలా ఒక్క నెలలలోనే ఐదుగురిని మోసం చేసి డబ్బులు కాజేశారు. ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక్కరోజే ఇద్దరు వ్యాపారులను మోసం చేసి ఒకరి వద్ద 30వేలు కొట్టేసి, మరొకరి వద్ద రూ. 22వేలు తస్కరించారు. బాధితులందరూ పోలీసులను ఆశ్రయించారు. ఎల్‌బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి, డీఐ ఉపేందర్‌రావులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించడంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిందితులు రాచకొండలో-2 సైబరాబాద్‌లో-2 హైదరాబాద్‌ పరిధిలో-1 చొప్పున మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే తరహా మోసాలు ఢిల్లీలో కూడా చేశారా అనే కోణంలో విచారిస్తున్నామని సీపీ తెలిపారు. అవసరమైతే స్పెషల్‌ టీమ్‌ను ఢిల్లీకి పంపి.. ఇన్వెస్టిగేషన్‌ చేస్తామని పేర్కొన్నారు.


దోపిడీ ఇలా..

ఇరాన్‌ ముఠా సభ్యులు కారులో తిరుగుతూ ఓ వ్యాపారసంస్థ వద్ద ఆగుతారు. ‘సర్‌, మా వద్ద యూఎస్‌ డాలర్స్‌ ఉన్నాయి. అర్జంట్‌గా ఇండియన్‌ కరెన్సీ కావాలి. ఎలా మార్చుకోవాలి..’ అంటూ వ్యాపారిని మాటల్లోకి దింపుతారు. సమీపంలో ఉన్న బ్యాంకుల్లో డబ్బులు మార్చుకోవాలంటూ చెప్పినా ఇండియన్‌ కరెన్సీ ఎలా ఉంటుందో తమకు తెలియదని, వాటిని ఎలా గుర్తించాలో చెప్పాలని, లక్ష రూపాయలు తీసుకోవాలంటే ఎంత కరెన్సీ తీసుకోవాలని అతన్ని మాటల్లో పెడతారు. బయటి దేశస్థులు కావడంతో సదరు వ్యాపారి తన వద్ద ఉన్న రూ.500ల కట్టను రెండు చూపించగా అమాయకంగా నటిస్తూ వాటిని లెక్కిస్తామని చేతుల్లోకి తీసుకుంటారు. చాకచక్యంగా చేతివేళ్లతోనే కొన్ని నోట్లను తస్కరించి బాధితునికి అనుమానం రాకుండా తిరిగి ఆ రెండు కట్టలను ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత బాధితుడు లెక్కిస్తే లక్షలో సగం నోట్లు మాయమై ఉంటాయి. 

Updated Date - 2021-06-06T12:22:28+05:30 IST