అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు !

ABN , First Publish Date - 2020-11-26T20:38:14+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నందున అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మళ్లీ పొడిగించింది.

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు !

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నందున అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. డిసెంబర్ 31 వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని గురువారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణం, వీసా నిబంధనలకు సంబంధించి నవంబర్ 30 వరకు ఉన్న నిషేధాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు డీజీసీఏ ఈ సందర్భంగా పేర్కొంది. కాగా, ఈ నిషేధం కార్గో విమానాలకు వర్తించదని స్పష్టం చేసింది. అయితే, ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో మాత్రం... సందర్భం, పరిస్థితిని బట్టి విమాన సర్వీసులకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని డీజీసీఏ వెల్లడించింది. 


ఇక కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, మే నెల మొదటి వారం నుంచి విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు 'వందే భారత్ మిషన్' ద్వారా కొన్ని దేశాలకు అంతర్జాతీయ విమానాలను నడిపిస్తోంది. అలాగే భారత్‌తో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకున్న 22 దేశాలకు సైతం విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. కాగా, ఇండియాతో ఈ ఒప్పందం కుదుర్చుకున్న దేశాల జాబితాలో అమెరికా, కెనడా, యూకే, యూఏఈ, ఉక్రెయిన్, టాంజానియా, రవాండా, ఖతార్, ఒమన్, నైజిరియా, నెదర్లాండ్స్, మాల్దీవులు, కెన్యా, జపాన్, ఇరాక్, జర్మనీ, ఫ్రాన్స్, ఈథోపియా, భూటాన్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, ఆఫ్గనిస్థాన్ ఉన్నాయి.  

Updated Date - 2020-11-26T20:38:14+05:30 IST