అసమ్మతి నేతల్లో అంతర్మథనం

ABN , First Publish Date - 2021-11-20T06:41:44+05:30 IST

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితం అనంతరం ప్రధాన పార్టీల్లో నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై సమాలోచనలో పడ్డారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనుండటంతో పలు పార్టీల్లోని నేతలు ముందుచూపుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. టీఆర్‌ఎ్‌సకు హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితం తారుమారుకావడంతో, ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.

అసమ్మతి నేతల్లో అంతర్మథనం

 పార్టీ మారే యోచనలో నాయకులు 

 టీఆర్‌ఎస్‌కు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఎఫెక్ట్‌

 ఎమ్మెల్సీ పదవుల్లో జిల్లాకు మొండిచేయి

 జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నేతల మధ్య విభేదాలు

 టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత పడాల శ్రీనివా్‌స దారెటో.. 

 రాజకీయ భవిష్యత్‌పై ఆయా పార్టీ నేతల్లో చర్చోపచర్చలు 

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితం అనంతరం ప్రధాన పార్టీల్లో నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై సమాలోచనలో పడ్డారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనుండటంతో పలు  పార్టీల్లోని నేతలు ముందుచూపుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.         టీఆర్‌ఎ్‌సకు హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితం తారుమారుకావడంతో, ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. 

- (ఆంరఽధజ్యోతి, యాదాద్రి)



టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరణకు గురై బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్‌ ఓటర్లు ఆదరించారు. ఇక్కడ అధికార పార్టీకి చుక్కెదురుకాగా, ఇంతకాలం పార్టీలో అసమ్మతితో ఉన్న నేతల్లో  కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. జిల్లాలో గతంలో పలు పార్టీల్లో కీలకంగా వ్యవహరించిన చాలామంది నేతలు టీఆర్‌ఎ్‌సలో చేరారు. పలువురు సీనియర్‌ నాయకులకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించలేకపోయినప్పటికీ, ఎప్పటికైనా అధిష్ఠానం తమకు ఎమ్మెల్సీ,  లేదంటే రాష్ట్రస్థాయిలో ఏదైనా నామినేటెడ్‌ పదవిని కట్టబెడుతుందన్న ఆశతో వారు టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌ ఫలితంతో వారు పునరాలోచనలోపడ్డారు.


ఎమ్మెల్యే కోటాలో జిల్లా నేతలకు మొండి చేయి

అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో జిల్లానేతల పేర్లు అధిష్ఠానం పరిశీలించడంలేదు. నామినేటెడ్‌ స్థానాల్లోనూ జిల్లానేతలకు అవకాశం దక్కుతుందా అన్నది కూడా నమ్మకం లేదు. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఇటీవల పార్టీ జిల్లా కమిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీకి సారథ్యం వహించేందుకు గానూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, అందరినీ సమన్వయం చేసుకునే సీనియర్‌ బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం ఆలోచన చేసింది. అయితే సంస్థాగత ఎన్నికలు పూర్తయినప్పటికీ, జిల్లా కమిటీ నియామకాలను అధిష్ఠానం వాయిదా వేసింది. అసలు జిల్లాకు అధ్యక్షుడిని నియమిస్తారా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, పార్టీలోని సీనియర్‌ నాయకుల మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయి. అయితే గతంలో మాదిరిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లయితే మరో సంవత్సరం మాత్రమే సమయం ఉన్నట్టు లెక్క. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్‌ నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై అనుచరులతో చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది. టీఆర్‌ఎ్‌సలోనే కొనసాగాలా? లేదా కాంగ్రెస్‌, బీజేపీలో చేరాలా అన్న దానిపై ఆలోచనల్లో నిమగ్నమయ్యారు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి త్వరలోనే చాలామంది చేరుతారని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారానికి ఈ పరిణామాలు ఊతమిస్తున్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు సంభవించాయి. గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి, అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదు. ఇటీవల నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో పలువురు నేతలు పార్టీలు మారేందుకు సిద్ధం అవుతున్నారు. ఏ పార్టీలోని నేతలు ఎందులో పార్టీలో చేరుతారో అన్నది వేచి చూడాల్సిందే. 


రసవత్తరంగా ఆలేరు రాజకీయం

ఆలేరు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కృత నేతలు పార్టీ మారేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. బీజేపీలో చేరుతారా? లేక బీఎస్పీలోకి వెళ్లనున్నారా? అన్నదానిపై స్థానికంగా ప్రచారం సాగుతోంది. వీరితోపాటు పార్టీలో స్థానిక ప్రజాప్రతినిధులతో పొసగని నేతలు కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నట్లు సమాచారం. తుర్కపల్లి మండలంలో ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల్లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆరుగురు టీఆర్‌ఎస్‌ నేతలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీత ప్రకటించారు. వీరిలో తుర్కపల్లి మాజీ మండల అధ్యక్షుడు, ఆలేరు మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌, తుర్కపల్లి సర్పంచ్‌, పడాల పెద్దశ్రీనివాస్‌, తుర్కపల్లి సర్పంచ్‌, ర్యాకెల నరేష్‌, సామల కరుణాకర్‌, ఇమ్మిడి అనిల్‌ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పడాల శ్రీనివా్‌సతో పాటు మండలంలోని మంది పార్టీ శ్రేణులు మంత్రి జగదీ్‌షరెడ్డి వద్దకు తరలివెళ్లారు. జడ్పీ వైస్‌చైర్మన్‌తోపాటు మండలాల అన్ని విభాగాల అధ్యక్షులు, 34మంది గ్రామశాఖల అధ్యక్షులు, కార్యదర్శులు, మెజార్టీ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్‌  డైరెక్టర్లు, మండల,గ్రామాల రైతుబంధు కమిటీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండలంలోని కీలక నేతలంతా కూడా తుర్కపల్లి నుంచి మంత్రుల క్వార్టర్స్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. జరిగిన సంఘటనతో సస్పెన్షన్‌కు గురైన పార్టీ నేతలతో మంత్రి చర్చించారు. సస్పెన్షన్‌కు గురైన పార్టీ నేతలు తొందరపడొద్దని, తనకు నాలుగురోజుల సమయం ఇవ్వాలని కోరారు. సంఘటన జరిగి రెండునెలలు కావస్తున్నప్పటికీ, అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందనలేదు. దీంతో పడాల శ్రీనివా్‌సతోపాటు ఆయనతో కలిసొచ్చే నేతలతో వేరే పార్టీలో చేరనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆయన తన అనుచరులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తల మెజార్టీ అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలన్న దానిపై స్పష్టం ఇవ్వనున్నట్లు తెలిసింది.   

Updated Date - 2021-11-20T06:41:44+05:30 IST