ట్రూజెట్‌లో ఇంటరప్స్‌కు 49% వాటా

ABN , First Publish Date - 2021-04-02T06:20:36+05:30 IST

ట్రూజెట్‌ పేరుతో విమానయాన సేవలందిస్తున్న హైదరాబాద్‌ సంస్థ టర్బో మేఘా ఎయిర్‌వేస్‌.. భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎ్‌ఫడీఐ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానయాన సంస్థలో 49 శాతం వాటాను అమెరికాకు చెందిన ఇంటరప్స్‌

ట్రూజెట్‌లో ఇంటరప్స్‌కు 49% వాటా

సేవల విస్తరణ, కొత్త అవకాశాలపై ఎయిర్‌లైన్స్‌ దృష్టి


హైదరాబాద్‌: ట్రూజెట్‌ పేరుతో విమానయాన సేవలందిస్తున్న హైదరాబాద్‌ సంస్థ టర్బో మేఘా ఎయిర్‌వేస్‌.. భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎ్‌ఫడీఐ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానయాన సంస్థలో 49 శాతం వాటాను అమెరికాకు చెందిన ఇంటరప్స్‌ ఇంక్‌ కొనుగోలు చేసింది. అయితే ఒప్పంద విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. డీల్‌ త్వరలోనే పూర్తి కానుందని, నియంత్రణ సంస్థల నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉందని మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌ డైరెక్టర్‌ కేవీ ప్రదీప్‌ తెలిపారు. టర్బో మేఘా ఎయిర్‌వేస్‌.. ఈ గ్రూప్‌ కంపెనీయే.  ట్రూజెట్‌ ఈ 49 శాతం ఎఫ్‌డీఐ నిధులను సర్వీసుల విస్తరణతో పాటు విమాన రంగంలో కొత్త అవకాశాల అన్వేషణ కోసం ఉపయోగించుకోనుంది. గురువారం విడుదల చేసిన సంయు క్త ప్రకటనలో ఇరువర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. వాటా కొనుగోలు ఒప్పంద తుది విలువను తర్వాత నిర్ణయించనున్నట్లు తెలిపాయి. 


28 లక్షల మంది ప్రయాణికులకు సేవలు 

ట్రూజెట్‌ 2015 జూలైలో ప్రారంభమైంది. ఉడాన్‌ మార్గాల్లో విజయవంతంగా సేవలు అందిస్తున్న ప్రాంతీయ విమాన సంస్థల్లో ఇదొకటి. ట్రూజెట్‌ ప్రస్తుతం ఏడు ఏటీఆర్‌-72 విమానాలతో దేశంలోని 21 విమానాశ్రయాలకు సర్వీసులు నడుపుతోంది. ఈ జాబితాలో హైదరాబాద్‌, ముంబై, ఔరంగాబాద్‌, చెన్నై, గోవా, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, కడప, రాజమండ్రి, అహ్మదాబాద్‌, పోర్‌బందరు, జైసల్మేర్‌, నాసిక్‌, జల్గావ్‌, బెల్గావీ, బీదర్‌, మైసూర్‌, విద్యానగర్‌ తదితర నగరాలున్నాయి. తమ ఎయిర్‌లైన్స్‌ ఇప్పటివరకు 28,19,893 ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిందని ట్రూజెట్‌ తెలిపింది.

 

ఇంటరప్స్‌ గురించి.. 

న్యూయార్క్‌కు చెందిన లిస్టెడ్‌ కంపెనీ ఇది. అమెరికాలో స్థిరపడిన తెలుగువ్యక్తి, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ పీ లక్ష్మీ ప్రసాద్‌ ఈ కంపెనీ అధిపతి. ఈ మధ్య ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు పోటీపడిన కంపెనీల్లో ఇంటరప్స్‌ ఒకటి. ఎయిర్‌ఇండియా ఉద్యోగులతో కలిసి ఇంటరప్స్‌ బిడ్‌ దాఖలు చేసింది. ప్రాథమిక దశలోనే బిడ్‌ తిస్కరణకు గురికావడంతో చివరివరకు పోటీలో నిలబడలేకపోయింది. 

Updated Date - 2021-04-02T06:20:36+05:30 IST