హైదరాబాద్‌లో ఏటీఎంలే టార్గెట్‌.. అంతర్రాష్ట్ర దొంగల పనేనా?

ABN , First Publish Date - 2021-04-05T15:45:36+05:30 IST

హైదరాబాద్‌లో ఏటీఎంలే టార్గెట్‌.. అంతర్రాష్ట్ర దొంగల పనేనా?

హైదరాబాద్‌లో ఏటీఎంలే టార్గెట్‌.. అంతర్రాష్ట్ర దొంగల పనేనా?

  • మళ్లీ తిష్ట వేసినట్లు అనుమానాలు
  • గచ్చిబౌలిలో దోపిడీకి విఫలయత్నం
  • రంగంలోకి దిగిన సైబరాబాద్‌ పోలీసులు
  • తాజాగా జీడిమెట్లలోనూ.. రక్షణ మరుస్తున్న బ్యాంకర్లు

హైదరాబాద్‌  : నగరంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు మరోసారి తిష్టవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, హరియాణా ప్రాంతాలకు చెందిన ముఠాలు శివారు ప్రాంతాల్లోని ఏటీఎంలను టార్గెట్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో వనస్థలిపురం, అబ్ధుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లోని ఏటీఎంలను దోచేసిన హరియాణా ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం రెండు విడతలుగా దొంగల ముఠాలను పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. తర్వాత మూడు నెలల పాటు దొంగల ఉనికి కనిపించలేదు. తాజాగా మరోసారి ముఠాలు నగరంలోకి ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  

నిందితుడి కోసం గాలింపు

గచ్చిబౌలి పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలోని కొత్తగూడలో రెండు రోజుల క్రితం ఓ ఏటీఎంను లూటీ చేసేందుకు ఓ దొంగ విఫలయత్నం చేశాడు. ఏటీఎంలో డబ్బులు ఉండే ప్రాంతంలో కొంత భాగాన్ని పూర్తిగా తొలగించారు. కానీ, డబ్బులు చోరీ చేయలేకపోయాడు. అప్పటికే తెల్లవారుజామున నాలుగు గంటలు కావడం, జన సంచారం మొదలవడంతో దొంగ పారిపోయినట్లు తెలుస్తోంది. ఇది అంతర్రాష్ట్ర దొంగల పనా, స్థానిక దొంగ ఈ విఫలయత్నం చేశాడా అన్నది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. రంగంలోకి దిగిన సైబరాబాద్‌ క్రైమ్‌ టీమ్‌ ఇప్పటికే టెక్నికల్‌ ఆధారాలను సేకరించింది. నిందితుడి కోసం గాలిస్తోంది. ఏటీఎంలో దోపిడీకి ప్రయత్నించినప్పుడు అక్కడి సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఈ ఫొటోను పోలీసులు విడుదల చేశారు.  నిందితుడు కనిపిస్తే వెంటనే గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ 94906 17127, సైబరాబాద్‌ వాట్సాప్‌ నంబర్‌ 94906 17444కు సమాచారం  ఇవ్వాలని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపారు.


రక్షణ చర్యలేవీ? 

గతంలో పలు ప్రాంతాల్లో దొంగలు ఏటీఎం సెంటర్‌లను టార్గెట్‌ చేసి చోరీలకు తెగబడ్డారు. రూ. లక్షలు ఉండే ఏటీఎంల వద్ద బ్యాంకు అధికారులు కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదు. సెక్యూరిటీ సిబ్బందిని సైతం నియమించడం లేదు. ఏటీఎంలో ఎవరైనా చోరీకి ప్రయత్నిస్తే వెంటనే తెలిసేలా అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించినా బ్యాంకు అధికారులు పట్టించుకోలేదని పోలీస్‌ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ సిబ్బందిని, అలారం సిస్టం వంటి రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా బ్యాంకు అధికారులకు పోలీసులు లేఖలు రాసిన సందర్భాలున్నాయి. అయినా బ్యాంకర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - 2021-04-05T15:45:36+05:30 IST