అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2020-10-24T11:40:45+05:30 IST

వ్యసనాల కోసం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జి ల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

రూ.46.50లక్షల సొత్తు రికవరీ 


నల్లగొండ క్రైం, అక్టోబరు 23: వ్యసనాల కోసం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర  దొంగల ముఠాను నల్లగొండ జి ల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. నల్లగొండ టూటౌన్‌ పోలీసులు పట్టణ పరిధిలోని పానగల్‌ బైపాస్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారన్నారు. వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం కాటాపురం గ్రామానికి చెందిన మద్దెల హరికృష్ణ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. బతుకుదెరువు కోసం 2008 నుంచి 2018 వరకు గుంటూరులో, 2019సంవత్సరంలో ఖమ్మంలో నివాసం ఉంటూ చోరీలకు పాల్పడుతూ ప్రస్తుతం నల్లగొండలో నివాసం ఉంటున్నాడు. గోవాలో పేకాట ఆడేందుకు వెళ్లిన సమయంలో మరో ముగ్గురితో ముఠాను తయారుచేశాడని తెలిపారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని జమ్మలమడక గ్రామానికి చెందిన దుర్గంపూడి అంజిరెడ్డి, స్తంభాలగరువుకు చెందిన ఎస్‌కె.సూరజ్‌, గుజ్జనగుండ్లకు చెందిన ఎస్‌కె.జానిపాషతో కలిసి నల్లగొండ, ఖమ్మం, గుంటూరు జిల్లాల్లో 26చోట్ల దొంగతనాలు చేసినట్లు అంగీకరించారన్నారు.


వీరి నుంచి 900గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు, ఐదు స్మార్ట్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సూమారు రూ.46.50లక్షల విలువ ఉంటుందని తెలిపారు. వారిని కోర్టుకు రిమాండ్‌ చేశామని, విచారణ నిమిత్తం తిరిగి పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారణ సాగిస్తామన్నారు. చోరీ చేసిన ఆభరణాలను ముత్తూట్‌, మణప్పురంతో పాటు వివిధ ఫైనాన్స్‌ సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని జల్సాలు చేస్తారన్నారు. ఈ ఘటనలో ఫైనాన్స్‌ సంస్థలకు చెందిన వారిని సైతం విచారిస్తామన్నారు. 

Updated Date - 2020-10-24T11:40:45+05:30 IST