అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-02-23T06:08:06+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న కేసుల్లో అంతర్రాష్ట్ర

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

17.85 లక్షల సొత్తు స్వాధీనం

ఐదుగురిపై 25 కేసుల నమోదు

డీఎస్పీ ప్రసాద్‌ వివరాల వెల్లడి


కావలి(క్రైం), ఫిబ్రవరి 22 : ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో  ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న కేసుల్లో అంతర్రాష్ట్ర దొంగలముఠాను శుక్రవారం సాయంత్రం కావలి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల్లో గుంటూరుకు చెందిన గుత్తికొండ పవన్‌ కుమార్‌, పశ్చిమగోదావరి జిల్లా పెనుమట్రం గ్రామానికి చెందిన జక్కంశెట్టి నాగరాజు, విశాఖపట్నంకు చెందిన బులా నాగసాయి, పశ్చిమగోదావరి జిల్లా దొడిపట్ల గ్రామానికి చెందిన మంచం శ్రీనివాసరావు, అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మంజుల చంద్రశేఖర్‌ ఉన్నారు. వారి నుంచి పోలీసులు రూ.11.85 లక్షల విలువైన 383.40 గ్రాముల బంగారు ఆభరణాలు, బ్యాంకు చెక్కులు, 10 సెల్‌ఫోన్లు, రూ.6 లక్షల కారు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. 


 ఈసందర్భంగా  డీఎస్పీ డి.ప్రసాద్‌ శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితులను ముసుగులతో ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. అరెస్టయిన దొంగలందరికీ గతంలో నేర చరిత్ర  ఉందన్నారు. వారు గతంలో తెలంగాణతో పాటు రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పలు దొంగతనాల కేసుల్లో  జైల్లో ఉన్నప్పుడు ముఠాగా ఏర్పడ్డారని తెలిపారు. 2010లో ముఠాగా ఏర్పడిన  వారు అప్పటి నుంచి దోపిడీలు, ఇంటిదొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లారని తెలిపారు. 2019 ఆగస్టులో కర్నూలు జైలు నుంచి విడుదలైన వారు అప్పటి నుంచి 25 దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. 


వారిపై కావలి సబ్‌డివిజన్‌లో 9 కేసులు, నెల్లూరు టౌన్‌ సబ్‌డివిజన్‌లో 5కేసులు, ఆత్మకూరు సబ్‌డివిజన్‌లో 1కేసు, ఒంగోలు రూరల్‌లో 1కేసు, చిత్తూరులో 1కేసు, కడపలో 2కేసులు, నంద్యాలలో 1కేసు, చెన్నైలో 4కేసుల చొప్పున మొత్తం 25 కేసులు ఉన్నాయన్నారు. దాదాపు రూ.38 లక్షల విలువ చేసే 1265 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించిన ముఠా సభ్యులు కొంతమేర అమ్మి ఒక స్కోడా కారు, 2 పల్సర్‌ 220 బైక్‌లు కొనుగోలు చేశారన్నారు.


వాటిలో తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. మరో 883.90 బంగారం అట్టికా గోల్డ్‌ కంపెనీకి అమ్మేశారనీ, వాటిని త్వరలో రికవరీ చేస్తామని డీఎస్పీ తెలిపారు. పట్టణం కావలిలోని పుల్లారెడ్డినగర్‌లోని పార్కు వద్ద నిందితులను 1వ పట్టణ సీ.ఐ ఎం.రోశయ్య,  డీఎ్‌సపీ ఐ.డీ పార్టీ ఏ.ఎ్‌స.ఐ ఎం. జానకిరామిరెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.శ్రీనివాసరెడ్డి,  కానిస్టేబుళ్లు పి.మాధవరావు, టి.వేణుకుమార్‌ అరెస్ట్‌  చేశారని తెలిపారు. ఆయా పోలీసు అధికారులకు,  సిబ్బందికి ఎస్పీ రివార్డులకు సిఫార్సు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.  సమావేశంలో 1వపట్టణ సీ.ఐ ఎం.రోశయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-02-23T06:08:06+05:30 IST