Abn logo
Apr 21 2021 @ 02:10AM

కంటి కలకా.. కరోనా లక్షణం కావచ్చు

డాక్టర్‌ రాజలింగం, సూపరింటెండెంట్‌, సరోజినీదేవి కంటి ఆస్పత్రి 


‘‘కళ్ల కలకలా, అయితే కరోనా కావచ్చు’’ అంటున్నారు సరోజినీదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజలింగం. కరోనా బాధితుల్లో కంటిచూపు మందగించడం వంటి సమస్యలూ తలెత్తుతున్నట్లు ఆయన చెబుతున్నారు. ప్రస్తుత తరుణంలో సరోజినీదేవి ఆస్పత్రి రోగులకు అందిస్తున్న సేవలతో పాటు, మరిన్ని విశేషాలు రాజలింగం మాటల్లో..హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): కరోనా తొలిదశ సమయంలో కూడా కొవిడ్‌ బాధితుల్లో కళ్లసమస్యలు తలెత్తడాన్ని గుర్తించాం. అప్పుడు మా వద్దకు కంటి కలకతో ఆరుగురు పేషెంట్లొచ్చారు. వారికి పరీక్ష చేయిస్తే, అందులో నలుగురుకి పాజిటివ్‌ అనొచ్చింది. కళ్లు ఎర్రబారడం, కళ్లు తడారడం (డ్రై ఐస్‌), కళ్ల వెంట నీరుకారడం వంటి సమస్యలు గుర్తిస్తే, వెంటనే వారు కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలి. ఇప్పుడు కళ్లద్వారానూ కరోనా వ్యాప్తి చెందుతోంది. కంటికలక ద్వారా కొవిడ్‌-19 వైరస్‌ ముందుగా, రోగి ముక్కులోకి వెళ్తుంది.  అక్కడ నుంచి చిన్ననాళం ద్వారా గొంతులోకెళ్లి, ఊపిరితిత్తుల్లో తిష్టవేస్తుంది. కనుక లక్షణాలంటే దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, ఆయాసం వంటి ఆరోగ్య సమస్యలే కాదు, కంటి దురద, కలకలు వంటివి తలెత్తినా అనుమానించాల్సిందే. అయితే, ఆందోళన చెందక్కర్లేదు. 


కంటిచూపు తగ్గడం...

కొవిడ్‌ బాధితుల్లో కొందరికి కంటిచూపు మందగిస్తోంది. రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలా కొందరిలో రెటీనాకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల కంటిచూపు తగ్గుతుంది. సరైన సమయంలో సరైన చికిత్స అందించడం ద్వారా సమస్య త్వరగానే నయమవుతున్న దాఖలాలున్నాయి. కనుక పెద్దగా భయపడక్కర్లేదు. అయితే ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. 


కొవిడ్‌ సేవలు...

మాసబ్‌ట్యాంక్‌లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో రోజూ రెండు వందల మందికి కరోనా వ్యాక్సిన్‌ ఇస్తున్నాం. తొలి నుంచీ రోజుకు 150 వరకూ యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. రెండు నెలలకిందట రోజుకి నాలుగు లేదా ఐదు కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య ఇరవై నుంచి 30 వరకూ పెరిగింది. తొలిదశ వ్యాప్తి సమయంలో నాలుగు నెలల పాటు కొవిడ్‌ క్వారంటైన్‌ కేంద్రంగా మా ఆస్పత్రి సేవలందించింది. రెండు వందల బెడ్లతో మరో రెండు రోజుల్లో తిరిగి ఐసోలేషన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నాం. ఇంట్లో క్వారంటైన్‌ వసతి లేని వాళ్లకు ఈ కేంద్రం భోజన, వసతి సదుపాయాలను అందిస్తుంది. అడ్మిట్‌ అవ్వాలంటే, కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు రిపోర్టును చూపించాలి. సేవలన్నీ ఉచితమే. 


రోగికీ, డాక్టర్‌కీ మధ్య షీల్డ్‌...

వైర్‌సకు భయపడి, ఇంట్లో కూర్చోలేం కదా.! రెగ్యులర్‌గా పేషెంట్లను పరీక్షిస్తున్నాం. కొవిడ్‌ బాధితులకూ చికిత్స చేస్తున్నాం. మా జాగ్రత్తలు మేం తీసుకుంటున్నాం. మాస్కు, గ్లోవ్స్‌తో పాటు ప్రతిసారీ చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి పాటిస్తున్నాం. కంటి పరీక్షలు చేసే సమయంలోనూ, రోగికి, మాకూ మధ్య ప్లాస్టిక్‌ షీటు అమర్చి ఉంటుంది కనుక, పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు. అయినా ఎక్కడో చోట ప్రమాదం పొంచి ఉంటుందనడంలో సందేహం లేదు. మా సిబ్బంది సుమారు ఇరవై మంది వరకూ కొవిడ్‌తో బాధపడ్డారు. వారంతా కోలుకొని, తిరిగి విధుల్లో చేరారు అనుకోండి. అయినా, మేమంతా అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నాం. తొలిదశకన్నా ఇప్పుడు వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లలో తీవ్రత తక్కువగానే ఉందని చెప్పచ్చు. యువత ఎక్కువగా కొవిడ్‌కు గురవుతున్నారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వాళ్లూ కొవిడ్‌తో చనిపోవడం చూస్తున్నాం. కనుక నాకేమీ కాదులే అనుకోకుండా, ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి. కొవిడ్‌ నిబంధనలను పాటించాలి.

Advertisement
Advertisement