హిజాబ్‌ ధరించలేదని.. ఇంటర్వ్యూ రద్దు!

ABN , First Publish Date - 2022-09-24T07:45:02+05:30 IST

ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు పోరాటం చేస్తున్నారు. జుట్టు కత్తిరించుకుంటూ.

హిజాబ్‌ ధరించలేదని.. ఇంటర్వ్యూ రద్దు!

ఇరాన్‌ అధ్యక్షుడి తీరుపై

మహిళా జర్నలిస్టు విచారం


న్యూయార్క్‌, సెప్టెంబరు 23: ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు పోరాటం చేస్తున్నారు. జుట్టు కత్తిరించుకుంటూ... స్కార్ఫ్‌లు తగులబెడుతూ నిరసన ర్యాలీలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ దేశాధ్యక్షుడు మాత్రం హిజాబ్‌ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. కేవలం హిజాబ్‌ ధరించలేదన్న కారణంతో ఇరాన్‌ మూలాలున్న మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ న్యూయార్క్‌ వెళ్లారు.


ఈ సందర్భంగా ఇరాన్‌లో సాగుతున్న నిరసనలపై ఆయన ఇంటర్వ్యూ తీసుకొనేందుకు సీఎన్‌ఎన్‌కు చెందిన ప్రముఖ మహిళా జర్నలిస్టు క్రిస్టియానా అమన్‌పూర్‌ సిద్ధమయ్యారు. ఇంటర్వ్యూకు ముందు హిజాబ్‌ ధరించాలని ఆయన సహాయకులు ఆమెను ఆదేశించారు. తాము న్యూయార్క్‌లో ఉన్నామని, అక్కడ హిజాబ్‌కు సంబంధించి ఎలాంటి ఆచారాలు, సంప్రదాయాలు లేవని వారికి అమన్‌పూర్‌ వివరించారు. కానీ ఆ సహాయకులు ఆమె వాదనను వినిపించుకోలేదు. హిజాబ్‌ ధరిస్తేనే ఇంటర్వ్యూ ఉంటుందని స్పష్టం చేశారు. తాను ఒప్పుకోకపోవడంతో ఇరాన్‌ అధ్యక్షుడు ఇంటర్వ్యూను రద్దు చేసుకున్నారని అమన్‌పూర్‌ పేర్కొన్నారు. ఖాళీ కుర్చీ ముందు తాను మాత్రమే కూర్చొని ఉన్న ఫొటోను జత చేస్తూ ఆమె వరుస ట్వీట్లు చేశారు. 


ఆందోళనలు ఆమోదయోగ్యం కాదు: రైసీ 

ఇరాన్‌లో భావప్రకటనా స్వేచ్ఛ ఉందని, హిజాబ్‌కు వ్యతిరేకంగా ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు, గందరగోళానికి దారితీసే చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్నారు. పోలీసు కస్టడీలో మహ్సా అమిని(22) మృతి చెందిన ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. 

Updated Date - 2022-09-24T07:45:02+05:30 IST