‘ఇంటికి వెళ్లకుండా నేరుగా ఆస్పత్రికెళ్లా..’.. కరోనా నుంచి కోలుకున్న యువకుడి ఇంటర్వ్యూ

ABN , First Publish Date - 2020-04-03T18:43:32+05:30 IST

వచ్చిన జబ్బుకంటే దాని గురించి అతిగా ఆలోచిస్తేనే ఎక్కువగా నష్టం జరుగుతుంది. ఆత్మస్థైర్యంతో నిలబడితే ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా జయించవచ్చు. కొండెత్తు ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనాను జయించాడో యువకుడు.

‘ఇంటికి వెళ్లకుండా నేరుగా ఆస్పత్రికెళ్లా..’.. కరోనా నుంచి కోలుకున్న యువకుడి ఇంటర్వ్యూ

ఆత్మస్థైర్యమే ఆయుధంగా...

కరోనా వ్యాధిని జయించిన హన్మకొండ యువకుడు

14 రోజుల అనంతరం గాంధీ ఆస్పత్రి నుంచి విడుదల

నెగిటివ్‌ రిపోర్ట్‌తో స్వగృహానికి రాక


వరంగల్‌ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వచ్చిన జబ్బుకంటే దాని గురించి అతిగా ఆలోచిస్తేనే ఎక్కువగా నష్టం జరుగుతుంది. ఆత్మస్థైర్యంతో నిలబడితే ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా జయించవచ్చు. కొండెత్తు ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనాను జయించాడో యువకుడు. హన్మకొండకు చెందిన ఓ యువకుడు గత నెల 19న కరోనా పాజిటివ్‌తో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అనంతరం ఏప్రిల్‌ 2న గురువారం కరోనా నెగటివ్‌ రిపోర్ట్‌తో ఇంటికి చేరుకున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సంబరాల మధ్య ఆ యువకుడు సంతోషంగా ఇంట్లోకి ప్రవేశించాడు.


లండన్‌లో లా కోర్సు

హన్మకొండకు చెందిన ఆ యువకుడు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఇటీవల లండన్‌లో లా మాస్టర్‌ కోర్సు చదివేందుకు వెళ్లాడు. కరోనా ప్రభావంతో అక్కడ కూడా అలజడి రేగింది. దీంతో అతడు భారత దేశానికి తిరుగుపయనమయ్యాడు. అప్పటికే ప్రపంచమంతా కరోనా వల్ల పరిస్థితి దారుణంగా తయారైంది. గత నెల 19 న ఇండియా చేరిన అతడికి శంషాబాద్‌ విమానాశ్రయంలో థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేశారు. స్వల్పంగా గొంతునొప్పి ఉందని చెప్పినప్పటికీ ఏం పర్వాలేదనీ... హోం క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందని అక్కడి వైద్యాధికారులు చెప్పారు. ఎమర్జెన్సీ పారామెడిక్‌ కోర్సు చదివిన అతడు.. ఇంటికి రావడానికి ఇష్టపడలేదు. కొద్దిసేపు ఒక హోటల్‌లో విశ్రమించినప్పటికీ వారెవ్వరినీ తన దగ్గరకు చేరనివ్వలేదు. అనంతరం గాంధీ ఆస్పత్రిలో జాయినయ్యాడు. కరోనా నిర్థారణ పరీక్షల అనంతరం అతడికి పాజిటివ్‌ అని తేలింది. తన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు. ఒంటరిగా ఉండాల్సి వచ్చినా బాధపడకుండా, భయపడకుండా చికిత్స చేయించుకున్నాడు. దీంతో 14 రోజుల అనంతరం తనకు నెగటివ్‌ అని తేలింది. అయినప్పటికీ కూడా రెండు, మూడు సార్లు పరీక్షలు చేసి నెగిటివ్‌ అని రిపోర్ట్‌ వచ్చిన తర్వాతనే గాంధీ ఆస్పత్రి వైద్యులు అతడిని ఢిచార్జి చేసి ఇంటికి పంపించారు.


‘ఎవ్వరికీ ఇబ్బంది రాకూడదనుకున్నా..’

‘నా వల్ల ఎవ్వరికీ నష్టం జరగకూడదు. వైద్య పరంగా కొంత అవగాహన ఉన్నవాడిని కావడంతో ఎందుకైనా మంచిదని గాంధీ ఆస్పత్రిలో చేరాను. వైద్యుల సేవానిరతి మాటల్లో చెప్పలేం. సరిహద్దుల్లో సైనికుల కంటే అద్భుతంగా పనిచేస్తున్నారు. తక్కువ జీతంతో పనిచేసే వైద్య సిబ్బంది కూడా ఎంతో ధైర్యంతో పనిచేస్తున్నారు. నేను అందరిలాగా ఎమోషన్‌తో కుటుంబ సభ్యులను కలవాలని ఆత్రుతతో ఇంటికి వెళితే ఎంతో నష్టం జరిగేది. ఇది నా జీవితంలో తీసుకున్న అత్యుత్తమమైన నిర్ణయం అనిపించింది. ఇప్పుడు నా వల్ల ఎవరూ కూడా క్వారంటైన్‌లో ఉండాల్సిన పనిలేకుండా పోయింది. కరోనా వైరస్‌ గురించి ఇంకా ప్రజల్లో చైతన్యం రావలసిన అవసరం ఉంది. నా వంతుగా ఆ పని కూడా ఇంట్లో నుంచే చేస్తాను...’.. అని ఆ యువకుడు చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-04-03T18:43:32+05:30 IST