సంగీత ప్రపంచంలో ప్రతి రోజూ ప్రారంభమే!

ABN , First Publish Date - 2020-06-21T05:30:00+05:30 IST

‘స రి గ మ ప ద ని’ సప్తస్వరాలతో స్నేహం చేయాలని నాలుగో తరగతి నుంచి ఆ యువకుడి కోరిక. పదో తరగతికి చేరే సరికి ఆ తపన మరింత పెరిగింది. అతి కష్టమైనా అతని తండ్రి రూ.4500లతో చిన్న కీ బోర్డ్‌ కొనిచ్చారు...

సంగీత ప్రపంచంలో  ప్రతి రోజూ ప్రారంభమే!

‘స రి గ మ ప ద ని’ సప్తస్వరాలతో స్నేహం చేయాలని నాలుగో తరగతి నుంచి ఆ యువకుడి కోరిక. పదో తరగతికి చేరే సరికి ఆ తపన మరింత పెరిగింది. అతి కష్టమైనా అతని తండ్రి రూ.4500లతో చిన్న కీ బోర్డ్‌ కొనిచ్చారు. అదే ఆ యువకుడి దశ-దిశను మార్చింది. ఆయనే అనూప్‌ రూబెన్స్‌. ‘వరల్డ్‌ మ్యూజిక్‌ డే’ సందర్భంగా తన సంగీత ప్రయాణం గురించి ‘నవ్య’తో ముచ్చటించారు.


నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు సంగీతం మీద ఆసక్తి కలిగింది. సంగీతం, సినిమాతో ఎలాంటి సంబంధమూ లేని కుటుంబం మాది. నా ఆసక్తి గమనించి ఆర్థికంగా పరిస్థితులు సహకరించనప్పటికీ అమ్మానాన్న కష్టపడి నన్ను చదివిస్తూ, సంగీతం నేర్పించారు. స్వరాలు సమకూర్చడం నా వృత్తి అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. 2000లో కీ బోర్డ్‌ ప్లేయర్‌గా నా కెరీర్‌ ప్రారంభించా. 2004లో ‘జై’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యా. మొత్తానికి చిత్రపరిశ్రమతో 20 ఏళ్ల  అనుబంధం ఉంది. 60కు పైగా సినిమాలకు సంగీతం అందించా. ఇంత జర్నీ ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. 


ఓనమాలు నేర్చుకుంటున్నా...

సంగీతం అనేది మహాసముద్రంలాంటిది. మనం ఎంత ఈదినా దానికి అంతం ఉండదు. ఓపికగా ఈదుతూనే ఉండాలి. ఎంత నేర్చుకున్నా.. ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. బాణీలు కట్టడం అంతా నాకే తెలుసు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకేం ఉండదు. నా దృష్టిలో 20 ఏళ్లుగా నేను సంగీత ప్రపంచంలో అడుగులేస్తున్నా... అయినా  ఇంకా ఓనమాలు నేర్చుకుంటూనే ఉన్నాననుకొంటా. ఈ జర్నీలో ఎంతో మందిని కలిశా. చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులతో పని చేశా. మంచి అనుభవాలు, చేదు అనుభవాలను చూశా. ప్రశంసలతోపాటు విమర్శలూ ఎదుర్కొన్నా. 


బ్లాక్‌బస్టర్‌ లైఫ్‌ చూశా..

కీ బోర్డ్‌ ప్లేయర్‌గా నా కెరీర్‌ మొదలైంది ‘చిత్రం’ సినిమాతో. ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘జయం’, సంతోషం’ ఇలా అన్నీ  సూపర్‌హిట్లే. ప్రారంభంలోనే నేను అలా బ్లాక్‌బస్టర్‌ లైఫ్‌ చూశా. సంగీత దర్శకుడిగా మాత్రం మొదట్లో పరాజయాలే ఎక్కువ. పాటలు హిట్టైనా సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. నేను అందుకున్న తొలి విజయం ‘ప్రేమకావాలి’. ఆ తర్వాత ‘ఇష్క్‌’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘లౌక్యం’, ‘గోపాలగోపాల’, ‘మనం’, ‘టెంపర్‌’ ఇలా సక్సెస్‌లో పీక్స్‌  చూశా. పని చేసుకోవడం తప్ప దేనికీ పెద్దగా ఎగ్జైట్‌ కాను. పాటలు ఫెయిల్‌ అయితే డిప్రెషన్‌లోకి వెళ్లను. హిట్‌ అయితే నాకిక తిరుగులేదు అనుకోను. న్యూట్రల్‌గా ఉంటా. మనసులో ఏది ఉంటుందో.. అదే మాట్లాడతా. నా జర్నీని రివైండ్‌ చేసుకుని మార్కులు వేసుకోమంటే ... నేను ఒక్క మార్కు కూడా వేసుకోను. ఎందుకంటే సంగీతరంగంలో ప్రతిరోజూ  కొత్త ప్రారంభమే కదా! 




మళ్లీ పాత రోజులొస్తాయి...

నేను కెరీర్‌ మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికీ సంగీతరంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. టెక్నాలజీ పెరిగింది. ఇన్‌స్ట్రుమెంట్స్‌లో కూడా రకరకాలు వచ్చాయి. ముఖ్యంగా పోటీ బాగా పెరిగింది. గతంలో లైవ్‌ మ్యూజిక్‌ ఎక్కువగా ఉపయోగించేవారు. టెక్నాలజీ పెరగడంతో కీబోర్డ్‌తోనే రకరకాల వాయిద్యాలు సమకూర్చ గలుగుతున్నాం. అయితే ఏ ప్రక్రియ అయినా సైకిల్‌ లాంటిది. ప్రారంభించిన చోటుకే మళ్లీ రావాల్సి  ఉంటుంది. సంగీతరంగంలోనూ మళ్లీ పాత పద్ధతులు వస్తున్నాయి. లైవ్‌ రికార్డింగ్‌ ఇప్పుడు మేమూ చేస్తున్నాం. మున్ముందు ఫ్యూర్‌గా లైవ్‌ రికార్డింగ్‌ బాగా పెరగొచ్చు. న్యూ టాలెంట్స్‌ రావడం అనేది కొత్త, పాతవారికి ఒక పోటీ లాంటిది. దానిని పాజిటివ్‌గా తీసుకోవాలి. ఏ రంగంలో అయినా పోటీ ఉంటేనే అడుగు ముందుకుపడుతుంది. నేను పోటీని ఎంజాయ్‌ చేస్తా. దానిని ఎదుర్కొవడానికి కావలసిన కసరత్తులు చేస్తా. ప్రతి రోజూ నన్ను నేను, నా వృత్తిని అప్‌డేట్‌ చేసుకుంటా. గిటార్‌, వయొలిన్‌ నాకు ఇష్టమైన మ్యూజిక్‌ ఇన్‌స్ట్రూమెంట్స్‌. ఖాళీ సమయంలో వరల్డ్‌ మ్యూజిక్‌ వింటా. సంగీత ప్రియుడిగా నాకు మెలోడీస్‌ అంటే ఇష్టం. 


ప్రశంసలు - విమర్శలు

కొన్నాళ్ల క్రితం ఓ కార్యక్రమం కోసం డల్లాస్‌ వెళ్లినప్పుడు 70 ఏళ్ల ఓ పెద్దాయన నా దగ్గరికొచ్చి ‘మీరు అనూప్‌ కదా’ అని గట్టిగా హగ్‌ చేసుకున్నారు. ‘మనం’లో మీరు కంపోజ్‌ చేసిన ‘కని పెంచిన మా అమ్మకే’ పాటంటే మా కుటుంబంలో అందరికీ ఇష్టం. ఏడాది దాటిన మా మనవరాలు ఆ పాట వినకపోతే తినదు.. పడుకోదు’ అంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆయన మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఇంతకన్నా గొప్ప ప్రశంస ఇంకేం ఉంటుంది అనుకున్నా. ప్రశంసల్ని ఆనందంగా స్వీకరించినప్పుడు విమర్శని అలాగే తీసుకోవాలి. ‘అనూప్‌ మెలోడీస్‌ మాత్రమే చేయగలడు. వేరే జోనర్‌ చేయలేడు’ అన్న విమర్శ నాపై ఉండేది. ‘టెంపర్‌, ‘గోపాల గోపాల’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి చిత్రాలతో ఆ విమర్శ తొలగిపోయింది.


ప్రతి ఒక్కరూ జీరోతోనే మొదలవుతారు..

ఓ వ్యక్తి ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా ఒకప్పుడు వారు జీరోతో కెరీర్‌ మొదలుపెట్టినవారే. అలాంటివారిని నేను చాలా గౌరవిస్తా, స్ఫూర్తి పొందుతా. వృత్తిరీత్యా ఎప్పటికీ ఎ.ఆర్‌ రెహమాన్‌గారే నాకు స్ఫూర్తి. సమాజంలో ఓ వ్యక్తిగా నాకు మదర్‌ థెరిసా, అబ్దుల్‌ కలాంగారు  స్ఫూర్తి. వారు పడిన కష్టం గురించి, చేసిన సేవల గురించి ఎక్కువగా ఆలోచిస్తా. ఆచరించే ప్రయత్నమూ చేస్తా. 


నాన్న కీబోర్డ్‌ కొనివ్వకపోతే...

పదో తరగతి ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌  అయితే నాన్న కీబోర్డ్‌ కొనిస్తానని  మాటిచ్చారు. కష్టపడి ఫస్ట్‌ క్లాస్‌ తెచ్చుకున్నా. నా గోల భరించలేక నాన్న ఇచ్చిన మాట ప్రకారం... రూ.4500తో చిన్న కీ బోర్డ్‌ కొనిచ్చారు. అప్పటి మా పరిస్థితుల దృష్ట్యా అది చాలా ఖరీదైనదే. అయినా నాన్న డబ్బులు దాచి కొనిచ్చారు. ఆ కీ బోర్డ్‌తోనే నా కెరీర్‌ మొదలైంది. ఆ రోజు నాన్న కీ బోర్డ్‌ కొనివ్వకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో? చిన్నప్పటి నుంచి నాన్న ఇచ్చిన సపోర్ట్‌ మరువలేను. ‘వరల్డ్‌ మ్యూజిక్‌ డే’తోపాటు ఈరోజే ‘ఫాదర్స్‌ డే’ కావడం డబుల్‌ హ్యాపీగా ఉంది!


సంగీత ప్రయాణం.. సప్త స్వరాల్లో!

సప్త స్వరాల్లో ఏ అక్షరం మిస్‌ అయినా సంగీతానికి అర్థమే ఉండదు. నా సంగీత ప్రయాణాన్ని సప్తస్వరాలతో పోల్చమంటే నేను ఎక్కిన ఒక్కో మెట్టును ఒక్కో అక్షరంతో పోల్చుతా. 


ఫస్ట్‌ నేను కంపోజ్‌ చేసిన ‘దేశం మనదే’ పాట.

రి మొదట వందరోజులు ఆడిన హిట్‌ సినిమా ‘ప్రేమ కావాలి’.

‘ఇష్క్‌’ మ్యూజికల్‌ హిట్‌ అయి తెలుగు పరిశ్రమలో నాకంటూ ఓ స్థానం కల్పించింది.

‘గుండెజారి గల్లంతయ్యిందే’ మరో పెద్ద మెట్టు

‘మనం’ నా కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. వరుసగా అక్కినేని ఫ్యామిలీతో పనిచేసే అవకాశాలు తీసుకు వచ్చింది.

పవన్‌ కల్యాణ్‌గారితో రెండు సినిమాలు చేయడం

ని  నాలో కమర్షియల్‌, మాస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఉన్నాడని ‘టెంపర్‌’, ‘పైసా వసూల్‌’ నిరూపించాయి.


-ఆలపాటి మధు


Updated Date - 2020-06-21T05:30:00+05:30 IST