Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొవిడ్‌ తగ్గిన నెల తర్వాతే.. శృంగారం ముద్దు!

ముద్దు ముచ్చట్లయినా అప్పుడే.. 

సంతానం కోసం యత్నాలూ ఆ తర్వాతే..

వైరస్‌ తీవ్రత ఎక్కువైతే ఇంకొంత కాలం పట్టొచ్చు

పీరియడ్స్‌ సమయంలోనూ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు

వ్యాక్సిన్‌ తీసుకున్న 15 రోజుల వరకు గర్భం దాల్చకూడదు

ప్రసవం తర్వాత నాలుగు నెలల వరకు వ్యాక్సిన్‌ వద్దు

బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో ఆస్పత్రి ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్‌ ప్రీతిరెడ్డి ఇంటర్వ్యూ


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ.. ప్రజల్లో రకరకాల భయాలు, అనేక సందేహాలు. కొవిడ్‌ వచ్చి తగ్గిన వారిలో ఈ సందేహాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. కొత్త దంపతుల్లో మరీ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శృంగార జీవితం ఎప్పటి నుంచి కొనసాగించవచ్చు? సంతాన ప్రయత్నాలు చేయొచ్చా? లేదా వ్యాక్సిన్‌ తీసుకున్నాక మంచిదా? శృంగారం ద్వారా భాగస్వామికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందా? ఇలా అనేక ప్రశ్నలు. ఎవరిని అడగాలో తెలియదు. ఇంట్లో పెద్దల్ని అడగలేరు. వైద్యుణ్ని అడుగుదామా.. అంటే.. బిడియం. అందుకే.. అలాంటి ఎన్నో జంటలను వేధిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు అందిచాలని భావించింది ‘ఆంధ్రజ్యోతి’. బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో ఆస్పత్రి ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్‌ ప్రీతిరెడ్డిని ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలు మీకోసం..!


కొవిడ్‌ నుంచి బయటపడ్డ తర్వాత ఎన్ని రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి?  

కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కనీసం నెల రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. ఆ తర్వాత శృంగార జీవితాన్ని యథాప్రకారం కొనసాగించ వచ్చు. 


నెగెటివ్‌ వచ్చిన రెండు వారాల తర్వాత జాగ్రత్తలు పాటిస్తూ (కండోమ్స్‌ వినియోగం) శృంగారంలో పాల్గొన వచ్చా? 

ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉండి, శారీరకంగా చురుకుగా ఉంటే పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. 


నెగెటివ్‌ వచ్చినా.. వీర్య కణాలు/యోని స్రావాలలో వైరస్‌ ఉంటుందా? శృంగారం ద్వారా అది భాగస్వామికి వ్యాపిస్తుందా?

వీర్య కణాలలో కొవిడ్‌ వైరస్‌ ఉంటుందా.. ఉండదా.. అనే దానిపై స్పష్టత లేదు. వీర్య కణాల్లో వైరస్‌ను గుర్తించామని కొన్ని, లేదని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది. అప్పటికి గానీ దీనిపై స్పష్టత రాదు. అయితే.. లక్షణాలు కనిపిస్తున్నప్పుడు శృంగారంలో పాల్గొంటే మాత్రం వైరస్‌ సోకుతుంది. 


కొవిడ్‌ తగ్గిన తర్వాత ముద్దు, ముచ్చట ఉండొచ్చా..?

సాధారణంగా పదిహేను రోజుల తర్వాత నెగెటివ్‌ వస్తుంది. ఆ తర్వాత వైరస్‌ సోకే అవకాశం ఉండదు.  అయినా.. నెల రోజులు దూరంగా ఉండడం మంచిది. 


మహిళల్లో అండాల ఉత్పత్తిపై వైరస్‌ ప్రభావం చూపుతుందా ?

ఇది వైరస్‌ తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. తీవ్రత ఓ మోస్తరు నుంచి అధికంగా ఉన్న పురుషుల వీర్యం/స్త్రీ అండం ఉత్పత్తి, నాణ్యత, చురుకుదనంపై కొంత ప్రభావం ఉంటుంది. ఇలాంటి సమస్యను కొందరు పురుషుల్లో గతంలో గుర్తించాం. కొవిడ్‌ రోగుల్లో.. తీవ్ర జ్వరం, ఇన్‌ఫెక్షన్‌, హార్మోన్ల అసమతౌల్యం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి స్త్రీ/పురుషుల్లో ఇబ్బందులు వస్తున్నాయి. 


ఇందుకు మానసిక ఒత్తిడి కారణమవుతుందా ?

మానసిక ఒత్తిడి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి.  


మళ్లీ ఎన్ని రోజుల్లో వీర్య కణాలు సాధారణ స్థితికి వస్తాయి?

కొవిడ్‌ నుంచి కోలుకున్న నెల రోజుల్లో అంతా సాధారణం అయిపోతుంది. కొందరికి రెండు నెలల సమయం కూడా పట్టొచ్చు. ఇది వైరస్‌ తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఈ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే.. కొన్ని నెలల సమయం కూడా పట్టొచ్చు. తీవ్రత స్వల్పంగా ఉన్న వారిపై పెద్దగా ప్రబావం ఉండదు. 


అండాశయంపై వైరస్‌ ప్రభావం ఉంటుందా? 

అండాశయంపై వైరస్‌ ప్రభావం ఉండదు. కానీ, వారికి కూడా ఇవే సూచనలు వర్తిస్తాయి. గర్బం దాల్చడానికి మానసిక, శారీరక పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందువల్ల.. అంతా బాగున్నప్పుడే సంతానం కోసం ప్రయత్నించడం మంచిది. నెల తర్వాత ఎప్పుడైనా ప్లాన్‌ చేసుకోవచ్చు. కాకపోతే.. ముందుగా డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవడం మంచిది.


సంతానం కోసం ప్రయత్నించే వారు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా?

అలాంటి వారు ముందుగానే వ్యాక్సిన్‌ తీసుకోవాలి. రెండు డోసులూ పూర్తయిన 15 రోజుల వరకు గర్భం దాల్చకుండా జాగ్రత్త పడాలి. 


గర్భిణులు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా? 

గర్భిణులు వ్యాక్సిన్‌ తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. బాలింతలు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవద్దని సూచిస్తోంది. గర్బిణులు, బాలింతలు, పిల్లలపై ఇంకా మన దేశంలో క్లినికల్‌ ట్రయల్స్‌ జరగలేదు. అందుకే వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం లేదు. 


ప్రసవం తర్వాత ఎన్ని రోజులకు వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు?

ప్రసవం తర్వాత నాలుగు నెలలు వ్యాక్సిన్‌ వేసుకోవద్దు. ఆ తర్వాత వేసుకోవడం మంచిది. 


ఫెర్టిలిటీ చికిత్స పొందే దంపతులు వ్యాక్సిన్‌ ఎప్పుడు వేసుకోవాలి?

ఇలాంటి దంపతులలో వయస్సు, వారి ఫెర్టిలిటీని గమనించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వయసు ఎక్కువగా ఉన్నవాళ్లు ఇంకా ఆలస్యం చేస్తే ఇబ్బందులు వస్తాయి. అండాల నాణ్యత తగ్గిపోతుంది. సంతానం లేమి సమస్య ఏర్పడే ముప్పు ఉంటుంది. ఇలాంటి దంపతులకు వైరస్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. వ్యాక్సినేషన్‌ను వాయిదా వేసుకోవాలని సూచిస్తాం. 


మహిళలు పీరియడ్స్‌ సమయంలో వ్యాక్సిన్‌ వేసుకోవచ్చా?

నిర్భయంగా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. ఇందులో ఎలాంటి అనుమానాలూ వద్దు. వ్యాక్సిన్‌ తీసుకుంటే పీరియడ్స్‌ ఆలస్యం అవుతాయని, రక్తస్రావం ఎక్కువగా జరుగుతుందనే అనుమానాలు పెట్టుకోవద్దు. ఎలాంటి ఇబ్బందులూ రావు. 


Advertisement
Advertisement