ఇమ్యూనిటీ బూస్టర్లతో ప్రయోజనం లేదు!

ABN , First Publish Date - 2020-05-07T16:52:48+05:30 IST

కొవిడ్‌-19 సోకినా.. ఎలాంటి లక్షణాలూ కనిపించనివారు కొందరు! మరికొందరిలో కొద్దిపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తే.. ఇంకొందరికి అది ప్రాణాంతకంగా మారుతోంది. దీనికి కారణమేంటి? ఆయా వ్యక్తుల రోగనిరోధక

ఇమ్యూనిటీ బూస్టర్లతో ప్రయోజనం లేదు!

ఆంధ్రజ్యోతి(07-05-2020):

పౌష్టికాహారంతోనే రోగ నిరోధక వ్యవస్థకు బలం

కొందరిలో కనిపించని కరోనా లక్షణాలు 8 మరికొందరిలో వెంటనే ప్రభావం

తేడాకు కారణం జన్యువులే: డాక్టర్‌ హిమ చల్లా


కొవిడ్‌-19 సోకినా.. ఎలాంటి లక్షణాలూ కనిపించనివారు కొందరు! మరికొందరిలో కొద్దిపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తే.. ఇంకొందరికి అది ప్రాణాంతకంగా మారుతోంది. దీనికి కారణమేంటి? ఆయా వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థలో తేడాలే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ తేడాకు కారణం జన్యువులేనంటున్నారు ప్రముఖ జన్యు వైద్యురాలు, కే అండ్‌ హెచ్‌ క్లినిక్‌ డైరెక్టర్‌.. డాక్టర్‌ హిమ చల్లా. కరోనా వైర్‌సపై ‘ఆంధ్రజ్యోతి’తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..


రోగనిరోధక వ్యవస్థకు జన్యువులకు మధ్య సంబంధం ఉంటుందా? 

మన శరీరంలో ప్రతి వ్యవస్థకు.. జన్యువులతో సంబంధం ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరు రెండు వందలకు పైగా జన్యువులపై ఆధారపడి ఉంటుంది. ఆ జన్యువుల్లో ఏవైనా మార్పులు జరిగితే రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. అప్పుడు మనపై వైరస్‌, బ్యాక్టీరియాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.


ఆ జన్యువులు సక్రమంగా పనిచేస్తున్నదీ లేనిదీ ఎలా తెలుసుకోవచ్చు?

జన్యు పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఎక్కువ జన్యువుల్లో మార్పులు వస్తే ఆ ప్రభావం రోగనిరోధక వ్యవస్థపై పడుతుంది. ఉదాహరణకు ఎవరికైనా పదే పదే జలుబు చేస్తోందనుకుందాం. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లు లెక్క. దీనికి కారణం జన్యువులా కాదా అనే విషయాన్ని తెలుసుకుంటే తగిన చర్యలు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. జన్యువుల్లో వచ్చే మార్పులను మనం సరిచేయలేం. ఆహారం, జీవనశైలిలో మార్పుల ద్వారా రోగనిరోధక వ్యవస్థను కొంత వరకూ బలోపేతం చేసుకోవచ్చంతే.


పౌష్టికాహారం.. విటమిన్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందా?

‘డి’ విటమిన్‌ తప్ప మరే ఇతర సప్లిమెంట్స్‌ వల్లా రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పలేం. సాధారణంగా సూక్ష్మ పోషక పదార్థాలు (రోజుకు 100 మిల్లీగ్రాముల కంటే తక్కువ అవసరమయ్యేవి- మైక్రో న్యూట్రియెంట్స్‌) తక్కువగా ఉన్నప్పుడు.. విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకుంటే పనిచేస్తాయి. అదనంగా ఉన్నవి మలమూత్రాల ద్వారా బయటకు వచ్చేస్తాయి. శరీరంలో విటమిన్ల కొరత రాకుండా ఉండాలంటే.. సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉండే ఎండు ఫలాలు, గుడ్లు, పచ్చటి ఆకుకూరలు, పాలకూర మొదలైనవి రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతారు. ఇక.. మార్కెట్లో దొరికే ఇమ్యూనిటీ బూస్టర్ల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.


కరోనా సోకిన వారందరికీ ఒకే రకం లక్షణాలు ఎందుకు ఉండట్లేదు? వృద్ధులలో రోగనిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది?

వయసు పెరుగుతున్న కొద్దీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతూ ఉంటుంది. పౌష్టికాహారంతో దాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అలా తీసుకోకపోతే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కొవిడ్‌-19 మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉండటానికి కారణమిదే! ఇక కోవిడ్‌-19 ఎంత తీవ్రంగా వ్యాపిస్తుందనే విషయం కూడా జన్యువులపైనే ఆధారపడి ఉంటుంది. కొందరి జన్యువుల్లో జరిగే ఉత్పరివర్తనాల వల్ల.. వారికి వైరస్‌ వస్తే నియంత్రించటం చాలా కష్టమవుతుంది. కొవిడ్‌-19 మృతుల సంఖ్య కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఇదే కావచ్చు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.  


మధుమేహులూ.. జర భద్రం

మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ రెండు దశల్లో పనిచేస్తుంది. మొదటి దశలో వైరస్‌, బ్యాక్టీరియాలను చర్మం, ముక్కు పొరలలో ఉండే కణాలు గుర్తిస్తాయి. వెంటనే తెల్లరక్తకణాలు వాటిపై దాడి చేస్తాయి. సాధారణంగా మధుమేహం ఉన్నవారిలో ఈ తెల్లరక్త కణాల ప్రయాణం నెమ్మదిగా ఉంటుంది. అందువల్లే మధుమేహం ఉన్నవారిపై కొవిడ్‌-19 ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.


 - స్పెషల్‌ డెస్క్

Updated Date - 2020-05-07T16:52:48+05:30 IST