కొవిడ్‌ను ఎదుర్కొంటాం

ABN , First Publish Date - 2021-04-17T06:01:06+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు జిల్లాలో రెండు ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు మరో 15 ప్రైవేట్‌ ఆసుపత్రులలో కరోనా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ చెప్పారు.

కొవిడ్‌ను ఎదుర్కొంటాం

 1,146 బెడ్లు అందుబాటులో ఉన్నాయి

గూడవల్లిలో 500 బెడ్లతో కేర్‌ సెంటర్‌ 

జిల్లాలో మరో 500 పడకలతో రెండో సెంటర్‌ ఏర్పాటు చేస్తాం

 కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడి

పాయకాపురం, ఏప్రిల్‌ 16 : కరోనా సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు జిల్లాలో రెండు ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు మరో 15 ప్రైవేట్‌ ఆసుపత్రులలో కరోనా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ చెప్పారు. జిల్లాలో 1,146 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కొవిడ్‌ రోగుల కోసం గూడవల్లిలో 500 బెడ్లతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో 500 బెడ్లతో రెండవ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ జిల్లాలో కొవిడ్‌ నియంత్రణకు చేపట్టిన చర్యలు, వ్యాక్సినేషన్‌ అమలు తదితర అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 17 ఆసుపత్రులను కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తించి అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్యులను, సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం కొవిడ్‌ ఆసుపత్రులలో 1,146 బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి వేగంగా ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు అన్నివిధాలా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని అన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌, ట్రేసింగ్‌, శాంపిల్‌ టెస్టింగ్‌, ట్రీటింగ్‌ లాంటి అన్ని అంశాలపై జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులలో కూడా కరోనా బాధితులకు వైద్య సహాయం అందించేలా మౌలిక సదుపా యాలు కల్పించామని, ఇందుకు సంబంధించి ప్రతి ఆసుపత్రికి ఒక నోడల్‌ అధికారిని ఏర్పా టు చేసి ఎప్పటికప్పుడు ఆయా ఆసుపత్రులలో అందుతున్న వైద్య సహాయం, నాణ్యమైన భోజన సదుపాయం, శానిటే షన్‌లపై దృష్టి సారించామని కలెక్టర్‌ వివరిం చారు. జిల్లా కొవిడ్‌ ప్రత్యేకాధికారి, రాష్ట్ర సాం ఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీతతో కలిసి పాల్గొన్న ఈ సమావేశంలో జేసీలు మాధవీలత, శివశంకర్‌, మోహన్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు, డీఎంహెచ్‌వో సుహాసిని, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-17T06:01:06+05:30 IST