Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యమంలోకి..

సిద్ధమైన ఉద్యోగ సంఘాలు

ప్రభుత్వంపై తొలగిన భ్రమలు 

 నేటి నుంచి నిరసన కార్యక్రమాలు

నెలాఖరు వరకూ కొనసాగింపు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

సీఎం జగన మాట తప్పరు..మడమ తిప్పరు. విపక్షంలో ఉన్నప్పుడు...అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల వరకూ వినిపించిన మాట ఇది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఐదేళ్ల పాలనలో సగం కాలం కరిగిపోయింది. ఇప్పుడిప్పుడే వివిధ వర్గాలతో పాటు ఉద్యోగులకూ భ్రమలు తొలగుతున్నాయి. అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యమబాట పడుతుండడం విశేషం. ఇప్పటివరకూ ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురవుతామని తప్పించుకు తిరిగిన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. బహిరంగంగానే ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లుగా ప్రభుత్వంతో అంటకాగిన ఉద్యోగ సంఘాలు సైతం ఇప్పుడు ప్రశ్నించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అన్ని ఉద్యోగ సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమ కార్యాచరణను ప్రారంభించాయి. ఏపీ ఎనజీవో, అమరావతి జేఏసీ, రెవెన్యూ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులు, కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులంతా ఏకమయ్యారు. ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించని పక్షంలో దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వివిధ సంఘాల నాయకులు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రాథమిక దశ నుంచి నిరసన కార్యక్రమానికి బీజం వేస్తున్నారు. దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ హామీల్లో సీపీఎస్సీ రద్దు ప్రధానమైనది. అలాగే పీఆర్‌సీ అమలు చేస్తామని చెప్పి దాట వేస్తున్న ధోరణిపై ఉద్యోగులు మండి పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వారం రోజుల్లోనే సీపీఎస్సీ రద్దు చేస్తామన్న సీఎం హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడాన్ని తప్పు పడుతున్నారు. మొత్తంగా 71 హామీలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. డిసెంబరు నెలంతా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. 

 నిరసన కార్యక్రమాలివి

 డిసెంబరు 7,8,9,10 తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడం, భోజన విరామ సమయాల్లో నిరసన తెలపడం.

 10న మండలాలు, తాలుకాలు, జిల్లా కేంద్రాలు, పాఠశాలలు, ఆర్టీసీ డిపోల ఎదుట భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు.

13న మండల, తాలుకా, జిల్లా కేంద్రాలు, ఆర్టీసీ డిపోల ఎదుట నిరసన ప్రదర్శనలు, బహిరంగ సమావేశాలు,

 16న  మండల, తాలుకా, జిల్లా కేంద్రాలు, ఆర్టీసీ డిపోలు ఎదుట ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ నిరసన ధర్నాలు

 21న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ నిరసన ధర్నా.

 27న చలో విశాఖ, భారీ బహిరంగ సభను ఏర్పాటుచేయడానికి తీర్మానించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మిక, రాష్ట్ర పింఛన్‌దారులు పెద్ద ఎత్తున భాగస్థులు కావాలని జేఏసీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

 

 ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో?

ఉద్యోగ సంఘాలు చేపడుతున్న నిరసన కార్యక్రమాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిపై నిరసన తెలిపిన ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ముందస్తు అరెస్ట్‌లు, లాఠీచార్జి వంటి ఘటనలు సైతం వెలుగుచూశాయి. అయితే ఉద్యోగుల విషయంలో మాత్రం ఆ పరిస్థితి ఉండదని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. వాస్తవానికి గత రెండున్నరేళ్లుగా ఉద్యోగ సంఘాల నేతల మాటలు పెదవి దాటలేదు. దీనిపైస రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దిగువ స్థాయి ఉద్యోగుల నుంచి సంఘ నేతలపై ఒత్తిడి పెరిగింది. దీంతో మంగళవారం నుంచి ఉద్యమ బరిలో దిగారు. చూద్దాం ఏం జరుగుతుందో? 


Advertisement
Advertisement