వడ్డీ జలగలు!

ABN , First Publish Date - 2022-01-07T06:17:25+05:30 IST

జిల్లాలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు.

వడ్డీ జలగలు!

జిల్లాలో శుత్రిమించుతున్న వడ్డీవ్యాపారులు ఆగడాలు

ఖాళీ చెక్కులు, నోట్లు రాయించుకుని వేధింపులు

అప్పు చెల్లించినా కోర్టుల్లో కేసులు వేస్తూ బెదిరింపులు

తనఖా పేరుతో ఆస్తులు సేల్‌ డీడ్‌ రాయించుకుని వసూళ్లు

కరోనా మృతుల కుటుంబాల రక్తం పీలుస్తున్న వ్యాపారులు

సివిల్‌ వివాదం అంటూ తప్పుకుంటున్న పోలీసులు

కలకలం రేపుతున్న బాధితుల బలవన్మరణాలు


జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ప్రజల అవసరాలు, అమాయకత్వాన్ని, ఆసరాగా చేసుకుని వడ్డీలపై వడ్డీలు, మీటరు వడ్డీలు వసూలు చేస్తూ ప్రజల రక్తం జలగల్లా పీలుస్తున్నారు. బాధితులు న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయిస్తే సివిల్‌ వివాదమని తప్పుకొంటున్నారు. దీంతో బాధితులు ఎవరికి చెప్పుకోవాలో అర్ధంకాక మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకోవడమో, లేదంటే ఆస్తులు అమ్మి వడ్డీ వ్యాపారులు చెప్పినట్లు చెల్లిస్తున్నారు... మరికొందరైతే ఇల్లు వదిలి పారిపోతున్నారు. తాజాగా తెనాలి కోర్టు ఆవరణలోనే లెక్చరర్‌ తాళ్లూరి జక్రయ్య పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. జిల్లాలో వడ్డీ వ్యాపారుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయనే దానికి జక్రయ్య ఆత్మహత్య  ఘటనే నిదర్శనం.  

 

గుంటూరు, జనవరి6: జిల్లాలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. గతంలో వడ్డీలను ముక్కుపిండి వసూలుచేసే వ్యాపారులు ఇటీవల ఓ అడుగు ముందుకేసి దారుణాలకు ఒడిగడుతున్నారు. అప్పు చెల్లించినా తమ వద్దనున్న ఖాళీ చెక్కులు, నోట్లు తిరిగి ఇవ్వకుండా వేరొకరి పేరుతో కోర్టుల్లో కేసులు, దావాలు వేస్తూ వేధిస్తున్నారు. మరికొందరు తీసుకున్న మొత్తానికి పదిరెట్లు కలిపి చెక్కులు, నోట్లు కోర్టుల్లో వేసి బాధితుల ఆస్తులను దోచుకుంటున్నారు. తనఖాకు బదులు ఏకంగా సేల్‌ డీడ్‌ రాయించుకుని ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. మరికొందరైతే ఫోర్జరీ సంతకాలతో నోట్లు, డాక్యుమెంట్లు సృష్టించి కోర్టుల్లో వేసి వేధిస్తున్నారు. రోజురోజుకు జిల్లాలో వీరి ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. 

 

 వడ్డీవ్యాపారుల కారణంగా ఇటీవల ఈపూరు మండలం బద్రుపాలెం వద్ద పాతూరి రత్తయ్య (62), పాతూరి నీరజ(56) దంపతులు కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వ్యాపార భాగస్వామికి మఽధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించాడు. వారు తిరిగి చెల్లించకపోవడంతో తన ఆస్తులు అమ్మి అప్పులు తీర్చినా వడ్డీలకు వడ్డీ వేసి మూడు కోట్లు చెల్లించాలని వ్యాపారులు వత్తిడి చేయడంతో చివరకు దంపతులు ఇద్దరు అద్దంకి బ్రాంచి కెనాల్‌లో దూకి బలవన్మరణానికి గురయ్యారు. 

ఇటీవల వడ్డీ వ్యాపారి తాను రూ.5 లక్షలు ఇచ్చిన బాధితుడు కరోనాతో చనిపోవడంతో రూ.15లక్షలు ఇవ్వాలంటూ ఏకంగా కోర్టులో దావాలు వేసి ఉదంతం కలకలం రేపింది. అలాగే మరో ఘటనలో ఓ వడ్డీ వ్యాపారి కరోనా మృతుడి సంతకాలను ఫోర్జరీ చేసి రెట్టింపు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించడంతో ఆ కుటుంబం మానసిక ఒత్తిడికి గురైంది.  గుంటూరునగరంలో కొందరు వడ్డీ వ్యాపారుల ఆగడాలు మరింతగా సృతిమించుతున్నాయి. క్రికెట్‌ బెట్టింగ్‌కు, పేకాటకు అప్పులు ఇచ్చి ఏకంగా రూ.10 వడ్డీ చొప్పునవారి ఆస్తులన్నీ రాయించుకుంటున్న ఉదంతాలు అనేక కుటుంబాలను వీధిపాలు చేస్తున్నాయి. 


స్పందనకు ఫిర్యాదుల వెల్లువ

వడ్డీ వ్యాపారుల వేధింపులపై పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అప్పు చెల్లించినా ఇంకా ఇవ్వాలంటూ వేరొకరి పేరుతో చెక్కులు, నోట్లు కోర్టుల్లో వేసి తమను వేధిస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కొద్ది మొత్తంలో అప్పు ఇచ్చి ఆస్తులు తనఖా పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారని తాము వడ్డీ సహా అసలు చెల్లిస్తామంటే అందుకు పదింతలు చెల్లించాలని అంటున్నారని,  లేదంటే అడ్డం తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు బాధితులను సంబంధిత స్టేషన్‌కు పంపుతుంటే అక్కడి పోలీసులు సివిల్‌ వివాదమని చేతులెత్తేస్తున్నారు. తెనాలిలో అపార్టుమెంటు నిర్మించిన భాగస్వాముల్లో ఒకరు మరొకరిని అధిక వడ్డీలపేరుతో రూ.కోట్లలో చెల్లించాలంటూ వేధిస్తున్న వ్యవహారం వివాదాస్పదంగా మారింది.  


కరోనా మృతుల కుటుంబాల్లో కల్లోలం

వడ్డీ వ్యాపారుల ఆగడాలతో కరోనా మృతుల కుటుంబాల్లో కల్లోలం నెలకొంది. ఆకస్మికంగా కరోనాతో కుటుంబపెద్ద మృత్యువాత పడితే ఇదే అదనుగా వడ్డీ వ్యాపారులు జలగల్లా వారి రక్తం పీలుస్తున్నారు. ఏమాత్రం కనికరం చూపకపోగా వారు బతికున్నప్పుడు తీసుకున్న మొత్తానికి మూడు నుంచి ఐదురెట్లు అధికంగా చెప్పి వసూలు చేస్తున్నారు. తాము అంత ఇవ్వలేమని చెబితే కోర్టు నోటీసులు పంపి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఒకవైపు భర్త చనిపోయి భార్య, తండ్రి చనిపోయి పిల్లలు మానసిక ఆందోళనలో ఉంటే వడ్డీ వ్యాపారులు మాత్రం ఆయా కుటుంబాలను మరింత వేదనకు గురిచేస్తూ వారి ఆస్తులు లూటీ చేస్తున్నారు. దీంతో  బాధితులు మానసిక వత్తిడికి గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యాయత్నాలు కూడా చేస్తున్నా... ఆయా ఘటనలు వెలుగులోకి రావడం లేదు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, వేధింపుల విషయంలో పోలీసు ఉన్నత అధికారులు కఠిన వైఖరి అవలంబించాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-07T06:17:25+05:30 IST