అడవిని, ఆటను పరిచయం చేసే బుజ్జి బుజ్జి పాటలు

ABN , First Publish Date - 2020-07-06T06:47:30+05:30 IST

చుట్టూ ఉండే పరిసరాలను, వాతావరణాన్ని, విజ్ఞానాంశాల్ని పాటలుగా పరిచయం చేసే గంగదేవు యాదయ్య నిరంతరం పిల్లలతో మమేకమయ్యేవాడు. వాళ్ళకు అందేట్టు రాయాలన్న తపనతో పనిచేసేవాడు. ఆ సాన్నిహిత్యం, తపన లేకుంటే ఇటువంటి పాటలు రాయడం...

అడవిని, ఆటను పరిచయం చేసే బుజ్జి బుజ్జి పాటలు

చుట్టూ ఉండే పరిసరాలను, వాతావరణాన్ని, విజ్ఞానాంశాల్ని పాటలుగా పరిచయం చేసే గంగదేవు యాదయ్య నిరంతరం పిల్లలతో మమేకమయ్యేవాడు. వాళ్ళకు అందేట్టు రాయాలన్న తపనతో పనిచేసేవాడు. ఆ సాన్నిహిత్యం, తపన లేకుంటే ఇటువంటి పాటలు రాయడం సాధారణ విషయం కాదు: ‘లేలేత మొగ్గ/ విచ్చితే పువ్వు/ కాసితే కాయ/ మక్కితే పండు/ తింటే తియ్యన/ నీకింత ఇయ్యనా’లాంటి పాటలు అందుకు ఉదాహరణ. 


‘వచ్చే వచ్చే రైలూ బండీ - బండీలోనా మామా వచ్చే

వచ్చిన మామా టీవీ తెచ్చే - టీవీలోనా బొమ్మ వచ్చే

బొమ్మా పేరు అచ్చమ్మ - నా పేరు బుచ్చమ్మ’ 

బహుశ బాల గేయాల్ని వింటున్న, చదువుతున్న వాళ్ళకు ఈ పాట బాగా పరిచయం. మన ఇంట్లో, బడుల్లో చిన్న చిన్న పిల్లలు తమ బుజ్జి బుజ్జి పలుకులతో పాడుతుంటే విన్న, వీడియోల్లో చూసిన జ్ఞాపకం. దీనిని 1990 ప్రాం తంలో రాసింది నిరంతర బోధకుడు, గత మూడు దశా బ్దాలుగా కోయ, గొండీ భాషల్లో బాల సాహిత్య సృజనను ఒక పనిగా చేపట్టి ఆయా భాషల్లో మొదటి తరం రచయి తలను వెలికితీసి, తన కార్యశాలలో ఉత్సాహపరుస్తున్న గంగదేవు యాదయ్య. పిల్లల కోసం పనిచేస్తున్న యాదయ్య గత ఇరవై ఐదేండ్లుగా పిల్లల కోసం సృజనశాలలు నిర్వ హిస్తూ బుజ్జి బుజ్జి పాటలు రాస్తున్నాడు. తన సగం వయసును విద్యాగంధం నోచుకోని అడవి బిడ్డల కోసం వెచ్చించి వాళ్ళు సులువుగా చదువుకునేందుకు ఎన్నో ప్రయోగాలు చేసాడు. ఒక విద్యా సంవత్సరంలోనే వ్రా యడం, చదవడం నేర్పి వారిని పదవ తరగతిలో ప్రవేశం కల్పించేట్టు చేయడం మామూలు విషయం కాదు. సమా జాన్ని నిత్య విద్యార్థిగా లోతుగా అధ్యయనం చేస్తున్న గంగదేవు యాదయ్య బోధనా రంగంలో విప్లవాత్మక మార్పు కోసం తపించే ‘అసాధారణ సామాజికవేత్త’. 


తనను మలిచిన ఆనాటి జానపద, సాహిత్య సాంస్కృ తిక వాతావరణానికి తన ‘బుజ్జి పాటలు’ అంకితం చేసిన యాదయ్య పాటను అలవోకగా రాస్తాడు. బాలలకు మనో వికాసంతో పాటు వైజ్ఞానిక చేతనను కలిగించేందుకు తన పాటలను ఒక వాహికగా మలచుకుని అందుకు తగిన ట్టుగా మలుస్తాడు. పిల్లలకు బోధించాల్సిన అనేక అంశాలు ఈయన పాటల్లో అనేకం చూడోచ్చు. బడికి వచ్చే పిల్ల లకు మొదట ఆటపాటలు నేర్పి బడిపట్ల ఆసక్తిని కలిగిం చాలన్నది యాదయ్య తపన. ఆ దిశగా ఆయన చేసిన ప్రయత్నాల ఫలితమే ఈ పాటల ‘ఉయ్యాలా జంపాలా’. పిల్లల మనస్తత్వానికి దగ్గరగా, ఆసక్తి కలిగించే లయతో సాగడం యాదయ్య పాటల్లోని జీవగుణం. 


‘ఎల్లిపాయె ఉల్లిపాయ/ మా మామ ఎల్లిపాయె/ మా అత్త మల్లిపాయె/ మా తాత మురిసిపాయె/ పిచ్చికుక్క కరిసిపాయె/ దవాఖానాకు ఉరుకుడాయె/ బొడ్డుచుట్టు సూదులాయె’ ఇది గంగదేవు యాదయ్య ఎత్తుగడ. ఇందు లోని పదాలన్నీ మనకు తెలిసినవే. పల్లెల్లో, మన బడు లల్లో మనం ఆడుతూ పాడుకున్నవే. ఈ పాటలు వింటుంటే తెలంగాణ ప్రాంతంలో జాజిరి ఆడుకుంటూ పిల్లలు పాడుకునే ‘ఎమాయెమాయె రాంరెడ్డి’, ‘కోతి పుట్టుడెం దుకు/ కొమ్మలెక్కెతందుకు’ వంటి పాటలు యాదికొస్తాయి. అది గంగదేవు బుజ్జి పాటల్లోని కమాల్‌. ఈ బాలల బుజ్జి పాటలు భాషాపరంగా బాలల్లో ఆసక్తిని రేకెత్తించడమే కాక ఆనందాన్ని కలిగించడంలో తోడ్పడతాయనడంలో సందేహం అక్కర లేదు. 


ఇవ్వాళ్ళ తెలుగునాట బాల సాహిత్యం విరివిగా వస్తోంది. అందుకు వ్యక్తులు, సంస్థలు కృషిచేస్తున్నాయి. ఎన్నో చక్కని గేయ సంపుటులు, సంకలనాలు వస్తు న్నాయి. వంద మాటల్లో మనం చెప్పలేనిది ఒక చిత్రంలో చెప్పొచ్చు. అది చిత్రకారులు శివాజీ ఈ పాటలకు వేసిన బొమ్మల్లో తెలుస్తుంది. ఇక పాటల విషయానికి వస్తే లేలేత మనసుగల చిన్నారి బాలబాలికల మీద బలవం తంగా దేనిని రుద్దకూడదు, అది చదువైనా, మరోటైనా అనేది యాదయ్యకు బాగా తెలుసు. పిల్లలకు వాళ్ళకు తెలిసిన వాటిని గేయంగా వాళ్ళకు నచ్చినట్టు చెబితే వింటారని ఆశ. ‘రాజులు’ పాట అటువంటిదే: ‘ఆశకు నక్క రాజు/ పొగరుకు పులిరాజు/ వగరుకు వక్క రాజు/ వాగుడుకు వస రాజు/ పులుపుకు చింత రాజు/ తీపికి తేనె రాజు/ రుచికి ఉప్పు రాజు/ బలానికి పప్పు రాజు/ పగటికి సూర్యుండు రాజు/ రాత్రికి చంద్రుండు రాజు/ ఈ పద్యానికి నేనే రాజు.. నేనే.. రాజు’. పిల్లలకు అర్థం కాని పదంకానీ విషయంకానీ ఈ పాటలో లేదు.  


తమ చుట్టూ ఉండే పరిసరాలను, వాతవరణాన్ని, విజ్ఞానాంశాల్ని పాటలుగా పరిచయం చేసే యాదయ్య నిరంతరం పిల్లలతో మమేకమవుతాడు. వాళ్ళకు అందేట్టు రాయాలన్న తపనతో పనిచేస్తాడు. ఆ సాన్నిహిత్యం, తపన లేకుంటే ఇటువంటి పాటలు రాయడం సాధ్యం కాదు: ‘లేలేత మొగ్గ/ విచ్చితే పువ్వు/ కాసితే కాయ/ మక్కితే పండు/ తింటే తియ్యన/ నీకింత ఇయ్యనా’ వంటివి అందుకు ఉదాహరణలు. 


పాఠాలను పాటలుగా చెప్పడం అనేది ఒక రసవిద్య. అది అందరికీ చేతకాదు. అందులోనూ విజ్ఞానశాస్త్ర అంశాల్ని అరిటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పడం మరీ కష్టం. దానిని కవి చేసి చూపించాడు: ‘భూమి ఎంతో పెద్దదీ/ చుక్క ఎంతో చిన్నదీ/ చుక్క వరకు వెళ్లి చూస్తే../ చుక్క ఎంతో పెద్దది/ భూమి ఎంతో చిన్నది’


ఇటువంటి పాటలు పిల్లలకు మాతృభాష మీద ప్రేమతో పాటు సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుతాయి. ‘తిరగవేస్తే మోత/ మురగవేస్తే రోత/ కత్తిరిస్తే కోత/ ఘీంకరిస్తే ఘాత/ కింకరిస్తే వాత/ ఎన్నికయితే నేత/ ఆడి గెలిస్తే విజేత..!’ వంటి పాటలు యాదయ్య పరి చయం చేస్తున్న పద సంపదతో పాటు అంత్యప్రాసల్లోని లయ పాటను ఎంత అందంగా మలుస్తుందో తెలుపు తాయి. అద్భుతమైన ఊహా ప్రపంచం, విలక్షణమైన కల్పనాశక్తి పిల్లలకే సొంతం. ఆది వాళ్ళకే సాధ్యం కూడా. దానికి మనం తోడ్పాటు అందిస్తే ఈ విశాల విశ్వం వాళ్ళ చేతుల్లో ఒదిగిపోతుంది. 


‘ఎ’ ఫర్‌ ఆపిల్‌, ‘బి’ ఫర్‌ బ్యాట్‌ అంటూ అర్థం అయినా, కాకున్నా మన కాన్వెంట్‌ పిల్లలు పాడుతుంటే విని సంతోషపడుతున్నాం. కానీ అడవి బిడ్డలకు అక్షరాలు నేర్పిన కవి తన పాటల్లోనూ ఆదే చిత్తశుద్ధి కనబరిచాడు. ‘సై అంటే సై.. నై అంటే నై’లో అడవిని, ఆటను పిల్లలకు పరిచయం చేయడం చూడొచ్చు: ‘అడవికి.. అ/ ఆటకు.. ఆ/ ఇటుకకు.. ఇ/ ఈగకు.. ఈ/ ఉడుతకు.. ఉ/ ఊరుకు.. ఊ/ ఎలుకకు.. ఎ/ ఏరుకు.. ఏ/ ఐదుకు.. ఐ/ ఒకికి.. ఒ/ ఓడకు.. ఓ/ సనంటే.. ఔ/ సై అంటే సై/ నై అంటే నై..!


ఇటువంటి బుజ్జి బుజ్జి బాల లయలు అనగానే గుర్తొచ్చే పేర్లు బాల గేయకారులు కవికాకి మరియు డా.ఎం. భూపాల్‌. మళ్ళీ ఇప్పుడు గంగదేవు యాదయ్య. బాల కార్మికులుగా పనిచేస్తున్న వందలాదిమంది బాల బాలిక లను ఉద్యమస్ఫూర్తితో ఎం.వి. ఫౌండేషన్‌ సహకారంతో బడిలో చేర్పించిన యాదయ్యకు పిల్లలంటే అభిమానం. వాళ్ళదే లోకం. వాళ్ళే అన్నీ. బోధనలో పిల్లలతో, టీచర్లతో కలిసి పాఠాలను తయారు చేసే గంగదేవు యాదయ్య పిల్లల వయస్సును, ప్రాంతాన్ని, భాషను పరిగణలోకి తీసుకుని పాఠాలు రూపొందిస్తాడు. చిన్న చిన్న పదాలతో భాషను ఎలా నేర్పుతాడో తన పాటల్లోనూ అదే పాటి స్తాడు. ‘ఒక జాతికంటె మరో జాతి, ఒక భాష కంటె మరో భాష ఎక్కువదీ కాదూ-తక్కువదీ కాదూ అని నమ్ముతూ తెలుగు, కోయ/ గోండీ భాషల్లో రచనాశాలలు నిర్వహిం చాడు. కోయ భాషలో తెలుగు లిపిలో ఎనమిది పుస్త కాలు, కొండరెడ్ల మాండలికంలో నాలుగు పుస్తకాలు రావ డానికి సూత్రధారిగా నిలిచాడు. పద్మశ్రీ శాంతా సిన్హా ‘ఉయ్యాలా.. జంపాలా’ను ‘ఒక్కసారికాదు.. వందసార్లు, వెయ్యిసార్లు చదవండి... చదివించండి’ అంటారు. ఆ మాటలు అచ్చంగా నిజాలు. 

పత్తిపాక మోహన్‌




Updated Date - 2020-07-06T06:47:30+05:30 IST