పరిచయం... ప్రేమ...

ABN , First Publish Date - 2021-07-13T05:30:00+05:30 IST

‘కాంతిహీనమైన నా ప్రపంచంలో కాంతి కిరణమై నన్ను నడిపించింది నువ్వే ఏకాంతిక. నీ ప్రేమ, నీ కోపం, నీ నవ్వు, నీ జ్ఞాపకాలన్నీ నిన్ను వెతికే ఈ క్షణాల్లో నన్ను వెతుక్కొంటూ వస్తున్నాయ్‌’..

పరిచయం... ప్రేమ...

కాంతిహీనమైన నా ప్రపంచంలో కాంతి కిరణమై నన్ను నడిపించింది నువ్వే ఏకాంతిక. నీ ప్రేమ, నీ కోపం, నీ నవ్వు, నీ జ్ఞాపకాలన్నీ నిన్ను వెతికే ఈ క్షణాల్లో నన్ను వెతుక్కొంటూ వస్తున్నాయ్‌’... ఆదిష్‌ మనసు మాట్లాడుతోంది. కట్‌ చేస్తే... అతడి ఫోన్‌ రింగ్‌ అవుతుంది. ‘హాయ్‌ అంకుల్‌... ఏంటి... పెళ్లికి రాకు అని చెప్పడానికి ఫోన్‌ చేశారా?’... ‘లేదు బాబూ... నువ్వు రాకపోతే పెళ్లి ఆగిపోతుందని ఫోన్‌ చేశా’... ఆన్న ఆయన సమాధానంతో అతడిలో అలజడి. బైక్‌పై బయలుదేరుతాడు. ‘నువ్వు నాకు దూరమై ఏడాది అవుతున్నా నేను వెళ్లే ప్రతి చోటులో నా జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. వాటన్నిటినీ విడిచిపెట్టడానికో, వెతుక్కోవడానికో తెలియని ఈ ప్రయాణం ముగిసేదెక్కడో!’ మళ్లీ జ్ఞాపకాల్లోకి వెళతాడు. ‘నేను ఫౌండేషన్‌ ఎలా వేయమన్నాను’... అంటూ ప్రశ్నించిన అతడి మాటలు, సూచనలు పట్టించుకోడు బిల్డింగ్‌ సైట్‌లో సూపర్‌వైజర్‌. నచ్చని డిజైన్లు చేయలేక, కార్పొరేట్‌ క్యాలిక్యులేషన్స్‌కు కాంప్రమైజ్‌ కాలేక తనలో తాను మధనపడుతుంటాడు. అలాంటి ఒక టైమ్‌లో తొలిసారి ఏకాంతికను చూశాడు ఆదిష్‌. 


ఆ క్షణమే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. తనతో పరిచయం పెంచుకోవడానికి కాఫీ షాప్‌కి వెళతాడు. మాట కలుపుతాడు. అతను ఆర్కిటెక్ట్‌. ఆమె డిజైనర్‌. రెండోసారి అనుకోకుండా కలిసినప్పుడు ‘ఐ లవ్‌ యూ’ చెప్పేస్తాడు ఆదిష్‌. తనకు నచ్చదు. డేటింగ్‌కు రమ్మంటాడు. తను నో అంటూనే అతడి పరిచయాన్ని ఆస్వాదిస్తుంటుంది. ఒకరోజు ఆదిష్‌ ప్రేమకు ఓకే చెబుతుంది. పరిచయం... ప్రేమ... జంటగా ఆస్వాదిస్తుంటారు. కొన్నాళ్లకు ప్రేమ ముదిరి పెళ్లి చేసుకోవాలనుకొంటారు. కానీ కెరీర్‌లో సెటిల్‌ అయ్యాకే! అయితే ఆదిష్‌ ఏ ఉద్యోగంలోనూ కుదురుకోలేడు. కారణం... ఆర్కిటెక్ట్‌గా తను కొత్త కొత్త డిజైన్లు చేయాలనుకొంటాడు. కానీ అతడికి ఉద్యోగం ఇచ్చిన కంపెనీలు వాళ్లకు నచ్చినట్టు మాత్రమే డిజైన్లు కావాలంటారు. ఇక్కడే మనోడి మనోభావాలు దెబ్బతింటాయి. అందుకే తన నైపుణ్యాన్ని అర్థం చేసుకొని ఉద్యోగం ఇచ్చే వారి కోసం వేచి చూస్తుంటాడు. అక్కడే ఏకాంతికకు మండుతుంది. ‘ముందు నిన్ను నువ్వు నిరూపించుకున్న తరువాత నీకు నచ్చినవి చేసుకోవచ్చు’ అంటుంది. 


‘నేను నీలాగా మనసు చంపుకొని పని చేయలేను’... ఆదిష్‌ సమాథానం. ‘ఇప్పటికే నాన్న పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు’... ‘అయితే మీ నాన్న చూసిన సంబంధమే చేసుకో పో’ అంటాడు ఆదిష్‌ ఆవేశంగా. ఆ మాటలు ఆమె గుండెల్లో గుచ్చుకుంటాయి. అటు నాన్నని ఒప్పించలేక... ఇటు ఆదిష్‌కు నచ్చచెప్పలేక... నలిగిపోతుంటుంది. మరుసటి రోజు ఆదిష్‌ దగ్గరికి వస్తుంది ఏకాంతిక. ‘ఐ లవ్‌ యూ ఆదిష్‌. కానీ ఇంకా మనం కలిసి ఉంటే తీపి జ్ఞాపకాలన్నీ చెరిగిపోతాయేమోనని భయం వేస్తోంది. లెట్స్‌ బ్రేకప్‌’... కన్నీళ్లతో ఏకాంతిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అతడు ఒంటరి అయిపోతాడు. అంత బాధను జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదతడు. కెరీర్‌ను వదిలేసి, విరహంలో తనను తాను మరచిపోతాడు. చివరకు ఏమైంది? ‘లవ్‌’ లఘుచిత్రంలో చూస్తేనే బాగుంటుంది. కథ, కథనం, దర్శకత్వం శివ మజ్జి. వాసంతి, కల్యాణ్‌రెడ్డిల అభినయం ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ షార్ట్‌ ఫిలిమ్‌ను ఇప్పటికి 5.78 లక్షల మంది వీక్షించారు.

Updated Date - 2021-07-13T05:30:00+05:30 IST